Begin typing your search above and press return to search.

రాజధాని రైతుల్లో ఆందోళన

By:  Tupaki Desk   |   14 Jan 2016 11:15 AM GMT
రాజధాని రైతుల్లో ఆందోళన
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో ఇప్పుడిప్పుడే తీవ్రస్థాయి ఆందోళన నెలకొంటోంది. భూములు ఇచ్చిన తమకు ప్లాట్లు కేటాయించడంతోపాటు వాటిలో భవనాలు నిర్మించుకోవడానికి ఎన్ని అంతస్తులకు అనుమతి ఇస్తారనే విషయంలో రకరకాల ఊహాగానాలే ఇందుకు కారణం.

నవ్యాంధ్ర రాజధానికి సంబంధించి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన మాస్టర్ ప్లాన ప్రకారం 30 శాతంలోనే ఇళ్ల నిర్మాణాలు చేసుకోవాలి. దీనికితోడు ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ లోని సందేహాలపై అధికారులు రాజధాని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రైతులకు ఆర్3 జోన్లో భూములు ఇస్తారు. ఇక్కడ రైతులకు కేవలం మూడు అంతస్తులకు మాత్రమే అనుమతులు ఇస్తారు. అంతకు మించి అనుమతులు ఇవ్వరు. సెంట్రల్ జోన్ లో జీ 11 భవనాలకు అనుమతులు ఇచ్చినా.. రైతులకు ఇచ్చే ప్లాట్లలో మాత్రం మూడు అంతస్తుల వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. దాంతో రైతుల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రాజధాని ఏర్పాటుకు ముందే ఇక్కడి కొన్ని భూములు 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ పలికాయి. రాజధాని ఏర్పాటు తర్వాత కోటి నుంచి రెండున్నర కోట్ల వరకూ పలికాయి. అయినా రైతులు తమ భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చేశారు. ప్రభుత్వం ప్లాట్లు ఇస్తుందని, ఎక్కువ అంతస్తులు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందని భావించారు. అయితే మాస్టర్ ప్లాన్ లో నిబంధనలు చూసిన తర్వాత.. అక్కడి అధికారులు చెప్పే మాటలు విన్న తర్వాత రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైతులకు ఇచ్చిన మొత్తం ప్లాటు విస్తీర్ణంలో 30 శాతంలో మాత్రమే భవనాలు కట్టుకోవాలని మాస్టర్ ప్లాన్లో స్పష్టం చేశారు. అంటే 500 గజాలు ఉంటే అందులో 175 గజాల్లో మాత్రమే భవనం కట్టుకోవచ్చు. మిగిలిన స్థలాన్ని పచ్చదనం, సెట్ బ్యాక్ ల కింద వదిలేయాలి. ఇక మూడు అంతస్తుల వరకే భవనం నిర్మించుకోవచ్చు అంటే తమను పూర్తిస్థాయిలో ముంచేసినట్లేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉద్యమించడానికి కూడా సిద్ధమవుతున్నారు.