Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి అస‌లు సంగ‌తి చూస్తున్నారు

By:  Tupaki Desk   |   11 Aug 2015 5:49 AM GMT
అమ‌రావ‌తి అస‌లు సంగ‌తి చూస్తున్నారు
X
న‌వ్యాంద్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమ‌రావ‌తి నిర్మాణం పూర్త‌యిన త‌ర్వాత‌ భారీ క‌ట్ట‌డాల‌తో, ప్ర‌పంచ స్థాయి నైపుణ్యంతో అల‌రార‌నుండ‌టం...ఇందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని ప్ర‌భుత్వం వేగంగా క‌స‌ర‌త్తు చేస్తుండ‌టం తెలిసిందే. ఇప్ప‌టికే మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించడం పూర్తయినందున ఇక క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఈ క్ర‌మంలో తక్షణం చేపట్టాల్సిన పనుల గురించి ఉన్న‌తాధికారులు దృష్టి పెట్టారు.

మాస్టర్‌ ప్లాను పై ఉన్న‌తాధికారులు మూడురోజుల పాటు చర్చించి, స్వల్పంగా మార్పులు చేశారు. రాజధానికి అవసరమైన మౌళిక స‌దుపాయ‌ల‌పై ప్ర‌థ‌మంగా దృష్టి సారించారు. ఈ పనుల్లో తొలి దశగా రహదారులు, రెండో దశలో వరద నీరు, మూడో దశలో తాగునీరు, నాలుగో దశలో వ్యర్థాల నిర్వహణ‌, అయిదో దశలో టెలికం నెట్‌ వర్క్‌ ఏర్పాటవుతుంది. ముఖ్యంగా రాజధానికి చేరుకునే ప్రత్యేక రోడ్డును నిర్మించనున్నారు. ఈ రోడ్డును విజయవాడ అమరావతి రోడ్డుకు ఉత్తరదిశగా ఏడు కిలోమీటర్ల పొడవున ముందుగా రెండు వరుసలుగా నిర్మిస్తారు. తర్వాత 150 అడుగులకు విస్తరిస్తారు. దీనికి ఆనుకునే ప్రత్యేక ప్రజారవాణా, సైకిల్‌ మార్గాలనూ నిర్మించనున్నారు. రోడ్డు నిర్మాణంలో భాగంగానే టెలికం కనెక్షన్లకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించనున్నారు.

రాజధాని ప్రాంతం నుంచి ప్ర‌తి రోజు వచ్చే చెత్తను గుంటూరుకు సమీపంలోని నాయుడుపేట డంపింగ్‌ యార్డుకు తరలిస్తారు. అక్కడ నాలుగు దశల్లో 20 టన్నుల వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అయిదో దశలో 180 టన్నులకు వాటి సామర్థ్యం పెంచనున్నారు. ఐకాన్‌ టవర్లుండే ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ప్రజల అవసరాల కోసం మూడు మంచినీటి సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిని ఉపరితలం, భూగర్భంలలో ఒక్కోటి, ఈ రెండు పద్ధతుల్లోనూ మరొకటి ఏర్పాటు చేసి తాగునీటిి సరఫరా నిర్వహిస్తారు. రాజధాని కేంద్రానికి పశ్చిమంగా మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఈ నీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీడ్‌ క్యాపిటల్‌ అవసరాలు తీర్చే విధంగా 260 ఎంఎల్‌ డి నీటిని కృష్ణా నది నుంచి తీసుకోనున్నారు. తొలి విడతలో 15 ఎంఎల్‌ డి నీటిని సీడ్‌ క్యాపిటల్‌ కు అందివ్వనున్నారు. కోర్‌ ఏరియా, డౌన్‌ టౌన్‌, గేట్‌ వే... ఇలా మూడు ప్రాంతాలకూ ఈ నెట్‌ వర్కును విస్తరిస్తారు.

కొండవీటి వాగు వరద ముంపు నుండి నగరాన్ని కాపాడేందుకు సముద్రమట్టానికి 25 మీటర్ల ఎత్తులో గట్లు నిర్మించాలని నిర్ణయించారు. కృష్ణా వరద ముంపు నుంచి రక్షణ కోసం, ప్రస్తుత కరకట్టను పటిష్ఠం చేయాలని సంకల్పించారు. సీడ్‌ క్యాపిటల్‌ చుట్టూ వరద నీటి కాలువలను నిర్మించనున్నారు. 2018 నాటికి మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని, గ్రావిటీ ఆధారిత కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అండర్‌గ్రౌండ్‌ వ్యవస్థ సహా నాలుగు మురుగునీటి పంపింగ్‌ కేంద్రాలు నిర్మిస్తారు. వీటిలో ప్రధాన కేంద్రాన్ని సీడ్‌ క్యాపిటల్‌ కు అవతల ఏర్పాటు చేయనున్నారు. ముందుగా తూర్పు వైపు నుంచి పైపులైను పనులు ప్రారంభిస్తారు. రాజధానికి కలిపే ప్రధాన రోడ్డును సుందరయ్యనగర్‌ ప్రాంతం నుంచి వేసేందుకు సాధ్యా సాధ్యాలను పరిశీలించేందుకు కన్సల్టెంట్లను నియమించ నున్నారు. వారిచ్చే నివేదిక ఆధారంగా రోడ్డు నిర్మాణం ఉంటుంది. మరో వైపు ప్రకాశం బ్యారేజీ నుంచి చంద్రబాబు నివాసముండే ఎల్‌ ఈపిఎల్‌ వరకూ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. తొలి దశలో నిర్మించే రాజధాని ప్రధాన రోడ్డుకు దీన్ని అనుసంధానం చేయనున్నారు.

మొత్తంగా రాజ‌ధాని నిర్మాణంతో పాటే...ఆంధ్రుల రాజ‌ధాని అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కునేందుకు ఏపీ స‌ర్కారు వేగంగా అడుగులు వేస్తోంది.