Begin typing your search above and press return to search.

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సీతారామాంజనేయులు..ఊపిరాడనివ్వడం లేదు

By:  Tupaki Desk   |   26 Feb 2020 6:32 AM GMT
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సీతారామాంజనేయులు..ఊపిరాడనివ్వడం లేదు
X
ఒక మంచి సీఎంగా ప్రజల మదిలో చెరగని ముద్ర వేయాలని చూస్తున్న సీఎం జగన్.. దానికి తనొక్కడినే నీతిమంతుడిగా ఉంటే సరిపోదు అని నిర్ణయించుకున్నారు. అవినీతితో మకిలిపట్టిన ఈ వ్యవస్థను కడిగేయాలని డిసైడ్ అయ్యారు. ఆ జగన్ సంకల్పంలో తోడుగా నిలిచిన వారు ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు.. ఆర్టీసీ ఎండీ, రవాణాశాఖ కమిషనర్ గా అవినీతిపై ఉక్కుపాదం మోపిన సీతారామాంజనేయులు పనితీరు నచ్చి ఏరికోరి మరీ జగన్ ఆయనను ఏసీబీ డీజీగా నియమించారు. ఇప్పుడు ఆయన ఏపీలోని అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోయేలా చేస్తున్నారు.

అవినీతిపై పోరాటంలో జగన్ ఎంత నిక్కచ్చగా వెళుతున్నారో.. ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు అంతకుమించిన దాడులతో అవినీతి అధికారుల పీచమణిపిస్తున్నారు.

తాజాగా అవినీతిపై సీఎం జగన్ మరో యుద్ధం ప్రకటించారు. ఏపీలో అవినీతి నిరోధానికి 14400 ట్రోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేయించారు. మరి ఈ నంబర్ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచించారు. సెలెబ్రెటీలతో ప్రచారం చేయిస్తే ప్రజల్లోకి వెళుతుంది. ఈ క్రమంలోనే తెలుగమ్మాయి.. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలిసి ప్రచార వీడియోలను తయారు చేసి విడుదల చేశారు. సింధూతో అవినీతి చేయకూడదంటూ.. లంచం అడిగిన వారిపై టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలంటూ ప్రచారం చేయించారు.

ఇలా అవినీతిపై ప్రసంగాలు చేయడమే కాదు.. దాన్ని ఆచరించడంలోనూ జగన్ వెనకడుగు వేయనని నిరూపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు. నా స్థాయిలో, అధికారుల స్థాయిలో 50శాతం తగ్గితే, మిగిలిన యాభైశాతం తగ్గించడానికి అధికారులు పూర్తిస్థాయిలో ధ్యాస పెట్టాలని సీఎం జగన్ కోరారు.అవినీతిని కూకటి వేళ్లతో ఏరివేయాలని మరోసారి చెప్తున్నానని వివరించారు. మరి జగన్ సంకల్పం నెరవేరి ఏపీ అవినీతి రహిత రాష్ట్రంగా ఏర్పడాలని అందరం కోరుకుందాం..