Begin typing your search above and press return to search.

విశాఖ వ‌ద్ద సీఎం అధికారిక నివాసం అదే?

By:  Tupaki Desk   |   19 Dec 2019 5:47 AM GMT
విశాఖ వ‌ద్ద సీఎం అధికారిక నివాసం అదే?
X
ఏపీ అడ్మినిస్ట్రేటివ్ కేపిట‌ల్ గా విశాఖ ఉండ‌వ‌చ్చ‌ని సీఎం చేసిన ప్ర‌క‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా నిలుస్తూ ఉంది. త్వ‌ర‌లోనే అధ్య‌య‌న‌క‌మిటీ నివేదిక ఇస్తుంద‌ని.. ఏపీకి మూడు రాజ‌ధానులు ఉంటాయ‌ని సీఎం జ‌గ‌న్ అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే మూడు రాజ‌ధానులకు త‌గ్గ‌ట్టుగా ఏర్పాట్లు సాగుతూ ఉన్నాయ‌ని స‌మాచారం.

ఈ మేర‌కు అడ్మినిస్ట్రేటివ్ కేపిట‌ల్ విశాఖ వ‌ద్ద సీఎం అధికారిక నివాసానికి కూడా మ‌ర‌మ్మ‌త్తులు మొద‌ల‌య్యాయ‌ట‌. భీమిలి వ‌ద్ద సీఎం జ‌గ‌న్ అధికారిక నివాసం ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. బీచ్ కు స‌మీపంలోని ఒక గెస్ట్ హౌస్ నే ఏపీ సీఎం అధికారిక నివాసంగా తీసుకోబోతున్నార‌ట‌. ఈ మేర‌కు ఆ గెస్ట్ హౌస్ కు హంగులు అద్దుతున్నార‌ని.. అదే సీఎం అధికారిక నివాసం కాబోతోంద‌ని తెలుస్తోంది.

మూడు రాజ‌ధానుల ఫార్ములాపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆ ఫార్ములాను వ్య‌తిరేకిస్తూ ఉంది. అదే బాణీలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా సాగుతున్నాడు. వారు జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకిస్తూ ఉన్నారు.

అయితే ఆయా ప్రాంతాల నేత‌లు మాత్రం ఈ విష‌యంలో గ‌ట్టిగా మాట్లాడటం లేదు. అటు రాయ‌ల‌సీమ తెలుగుదేశం నేత‌లు అయినా, ఇటు ఉత్త‌రాంధ్ర తెలుగుదేశం నేత‌లు అయినా.. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌ను వ్య‌తిరేకించ‌డం లేదు. అలా వ్య‌తిరేకిస్తే స్థానికంగా వారు వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొనక త‌ప్ప‌దు. అయితే చంద్ర‌బాబు నాయుడు, తెలుగుదేశం పార్టీలోని కొంత‌మంది నేత‌లు మాత్రం ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను వ్య‌తిరేకిస్తూ ఉన్నారు.