Begin typing your search above and press return to search.

ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్... ప్రధాని మోదీతో భేటీ

By:  Tupaki Desk   |   11 Feb 2020 4:16 PM GMT
ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్... ప్రధాని మోదీతో భేటీ
X
ఉదయం ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉదయం ఫ్లైట్ ఎక్కనున్న జగన్... మధ్యాహ్నానికంతా ఢిల్లీ చేరుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ప్రదానమంత్రి నరేంద్ర మోదీతో జగన్ భేటీ కానున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సీఎం టూర్ కు సంబంధించిన స్పష్టమైన ప్రకటన చేసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించేందుకే జగన్ ఢిల్లీ టూర్ కు వెళుతున్నారని సమాచారం. ఈ టూర్ లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది.

చడీ చప్పుడు లేకుండా హఠాత్తుగా జగన్ ఢిల్లీ టూర్ కు వెళుతున్న నేపథ్యంలో ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఏపీలో శాసన మండలిని రద్దు చేస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టి... ఆ తర్వాత రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయించుకునే విషయంలో జగన్ పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన మోదీతో భేటీ కోసం ఢిల్లీ వెళుతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా మహిళల రక్షణ కోసం జగన్ సర్కారు ‘దిశ’ పేరిట కొత్త చట్టం తీసుకువచ్చింది. దీనిని కూడా కేంద్రం ఆమోదించాల్సి ఉంది. అయితే చట్టం ముసాయిదాలో పలు లోటుపాట్లు ఉన్నాయంటూ కేంద్రం దిశ బిల్లును తిప్పి పంపింది. దానికి సవరణలు చేసిన రాష్ట్రం మరోమారు కేంద్రానికి పంపింది. దీనికి ఆమోద ముద్ర వేయించడం కూడా జగన్ ప్రాధాన్యతల్లో ఒకటిగా చెబుతున్నారు.

ఈ రెండు అంశాలపై చాలా రోజులుగా డిల్లీ వెళ్లాలని జగన్ భావిస్తున్నా... ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రదానితో పాటు కేంద్ర మంత్రులు బిజీబిజీగా గడుపుతున్న నేపథ్యంలో తాను ఢిల్లీ వెళ్లినా అపాయింట్ మెంట్లు దొరికే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయని భావించిన జగన్... ఢిల్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసే దాకా వేచి చూశారు. అయితే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి... మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో వెనువెంటనే ఢిల్లీ పర్యటనకు జగన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు పీఎంఓతో ఏపీ ప్రభుత్వం సంప్రదించగా... బుధవారం సాయంత్రం మోదీ అపాయింట్ మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా బుధవారం నాటి ఢిల్లీ టూర్ లో మోదీ వద్ద జగన్ చాలా కీలకమైన అంశాను ప్రస్తావించనున్నారు.