Begin typing your search above and press return to search.

పింఛ‌న్లు పోతున్నాయ‌ని జ‌నాలు ఏడుస్తుంటే.. విప‌క్షాల‌పై మీ ఏడుపెందుకు సారూ!!

By:  Tupaki Desk   |   27 Dec 2022 2:30 PM GMT
పింఛ‌న్లు పోతున్నాయ‌ని జ‌నాలు ఏడుస్తుంటే.. విప‌క్షాల‌పై మీ ఏడుపెందుకు సారూ!!
X
ఏపీలో ప్ర‌భుత్వం చేప‌డుతున్న స‌ర్వేలు కావొచ్చు.. ఇత‌ర‌త్రాకార‌ణాలు కావొచ్చు.. త‌మ పింఛ‌న్లు పోతున్నాయంటూ.. పేద‌లు, వృద్ధులు ల‌బోదిబోమ‌ని రోడ్డున ప‌డుతున్నారు. క‌నిపిస్తున్న ప్ర‌తి అధికారి కాళ్లు ప‌ట్టుకుని పింఛ‌న్లు తీసేయొద్దు మొర్రో అని వేడుకుంటున్నారు. అయితే.. దీనిపైనా సీఎం జ‌గ‌న్ మండిప‌డుతున్నారు. ఇదంతా ప్ర‌తిప‌క్షాల కుట్ర అని విరుచుకుప‌డుతున్నారు.

పెన్షన్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని జ‌గ‌న్ మండిపడుతున్నారు. దీనిని తిప్పి కొట్టాల‌ని ఏకంగా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కే ఆయ‌న పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం. అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మందికి రూ.590.91 కోట్లను సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి ఖాతాల్లో జమ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘పెన్షన్లపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్‌ జరగాలి. ఆడిట్‌ జరుగుతుంటే పెన్షన్లు తీసేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్‌ మాత్రమే చేస్తారు. అర్హులందరికీ పెన్షన్లు అందాలన్నదే మా లక్ష్యం. మంచి పనులను చెడుగా చిత్రీకరిం చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషపు రాతను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. తప్పుడు ప్రచారాన్ని కలెక్టర్లు తిప్పికొట్టాలి’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘గత ప్రభుత్వంలో పెన్షన్‌ బిల్లు కేవలం రూ.400 కోట్లు మాత్రమే. ఇప్పుడు నెలనెలా పెన్షన్‌ బిల్లు రూ.1770 కోట్లు. గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. మా ప్రభుత్వంలో 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో పెన్షన్‌ రూ.వెయ్యి మాత్రమే ఇచ్చేవారు.

మా ప్రభుత్వంలో పెన్షన్‌ రూ.2750కి పెంచుతూ ఉన్నాం. మనం విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. విష ప్రచారం చేసే వారిని దేవుడే శిక్షిస్తాడు’’ అని సీఎం అన్నారు. మ‌రి నిజంగానే ల‌క్ష‌ల సంఖ్య‌లో పింఛ‌న్లు తీసేస్తే.. ఆ దేవుడు ఎవ‌రిని శిక్షిస్తారో చూడాలని పింఛ‌ను దారులే వ్యాఖ్యానిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.