Begin typing your search above and press return to search.

జగన్ సంకల్పం.. సాగు నీటి రంగానికి పెద్ద పీట

By:  Tupaki Desk   |   19 Sep 2020 2:52 AM GMT
జగన్ సంకల్పం.. సాగు నీటి రంగానికి పెద్ద పీట
X
తండ్రి వైఎస్సార్‌‌ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభివృద్ధిలో దూసుకెళ్తున్నారు. రాష్ట్రంలో సాగు నీటి రంగానికి పెద్ద పీట వేస్తూ లక్ష్యం మేర పనులు పూర్తి చేయించాలని ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తూనే ఉన్నారు. ఇందుకోసం ముందుగానే పటిష్ట కార్యాచరణ చేశారు. నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయడంతోపాటే కొత్త వాటి కోసం ఈ ఐదేళ్లలో రూ.96,550 కోట్లు ఖర్చు పెట్టేందుకు సీఎం జగన్‌ సిద్ధమయ్యారు. వీటిలో నిర్మాణంలో ఉన్న వాటికి 84,092 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. అలాగే కొత్త ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 72,458 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధులు సమీకరణకు అవసరమైన చర్యలను ప్రభుత్వం ఎస్పీవీలు (స్సెషల్ పర్పస్ వెహికిల్) ఏర్పాటు చేస్తోంది. ఓ వైపు పోలవరం వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో చురుగ్గా పనులు చేయిస్తున్న ప్రభుత్వం - మరోవైపు ఇతర ప్రాజెక్టుపైనా ఫోకస్‌ పెట్టింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆరేళ్లు సీఎంగా ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌‌ రెడ్డి జలయజ్ఞం పేరిట రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. ముఖ్యంగా ఆంధ్రలో పోలవరం - తెలంగాణ ఎల్లంపల్లి ప్రాజెక్టులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎల్లంపల్లి పూర్తయినప్పటికీ పోలవరం పనులు కాస్త నెమ్మదించాయి. ప్రాజెక్టు కుడి - ఎడమ కాలువలు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో అప్పుడు ఆ పనులు చేసిన సంస్థ టెండర్‌‌ను రద్దు చేసిన వైఎస్సార్‌‌ ప్రభుత్వం.. ఆ టెండర్లను మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌)కు అప్పగించింది. ఎప్పుడైతే పనులు మేఘాకు దక్కాయో అప్పటి నుంచి పనుల్లో స్పీడ్‌ అందుకుంది.

మేఘా టేకోవర్‌‌ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 71.46 శాతం పనులు పూర్తి కాగా.. ప్రస్తుతం చేస్తున్న పనులన్నీ కీలకమైనవే. స్పిల్‌ వే కాంక్రీట్‌ - స్పిల్‌ వే ఛానల్‌లలో మేఘా చేపట్టిన తర్వాత ఆరు నెలల కాలంలోన 2.80 లక్షల ఘనపు మీటర్ల పని పూర్తయింది. ప్రస్తుతం గోదావరి వరదలు ఉన్నా.. ఎక్కడా బ్రేక్‌ ఇవ్వకుండా కాంక్రీట్‌ బ్రిడ్జి పనులు నడిపిస్తూనే ఉన్నారు. జల విద్యుత్‌ ప్రాజెక్టు పనులనూ కొనసాగిస్తున్నారు. వరద తగ్గాక అప్పర్‌‌ - లోయర్‌‌ కాపర్‌‌ డ్యాంలతోపాటు స్పిల్‌ ఛానల్‌, పైలెట్‌ ఛానెళ్లను గ్యాప్‌ 1 - 2 - 3 పనులను ఏకకాలంలో చేపడుతామని మేఘా కంపెనీ ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

అన్ని పనులూ ఒకేసారి కాకుండా ప్రాధాన్యతను విభజించారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. అందులో భాగంగా వచ్చే ఏడాది కొన్ని ప్రాజెక్టులను కంప్లీట్‌ చేసి వినియోగంలోకి తెచ్చేందుకు బడ్జెట్‌ కూడా కేటాయించారు. మిగితా ప్రాజెక్టులను ఈ మూడు నాలుగేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టారు. అయితే.. ప్రాజెక్టులు నిర్మించడం కోట్లతో కూడుకున్న వ్యవహారం. దీనికితోడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విభజన నాటికే అప్పుల్లో కూరుకుపోయింది. వాటితోపాటు గత ప్రభుత్వం హయాంలో చేసిన అప్పులూ అలానే ఉన్నాయి. దీంతో కొత్త సీఎం జగన్‌ ఎస్పీవీలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా రుణాలు తీసుకునే అవకాశాలను జలవనరుల శాఖ - రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితితో ఇప్పటికే జగన్‌ సమీక్షించారు కూడా. సాగునీటి ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ఎస్పీవీలు ఏర్పాటు చేయడం చాలా అరుదు. ఏ ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు చేయలేవు. కానీ.. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పక్కా వ్యూహంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.

ఎస్పీవీ 1 కింద రాయలసీమలో కరువు నివారణకు ఈ ఐదేళ్లలో 39,980 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎస్పీవీ 2 కింద ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడానికి 8,787 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎస్పీవీ 3 కింద రాష్ట్ర నీటి రక్షణ అభివృద్ధి కార్యక్రమం పేరిట 12,702 కోట్లు సమీకరించనున్నారు. ఎస్పీవీ 4 పేరుతో పలనాడు కరువు నివారణ కార్యక్రమం ద్వారా గోదావరి - కృష్ణా - పెన్నాలను అనుసంధానించనున్నారు. ఇందుకు 7,636 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎస్పీవీ 5 ద్వారా కృష్ణా - కొల్లేరు సెలినిటి మిటిగేషన్‌ కార్యక్రమం ద్వారా 3,356 కోట్లు సమీకరిస్తున్నారు. అలాగే ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నెల్లూరు బ్యారేజీ - సంగం బ్యారేజీ పనులు వేగంగా పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టారు. ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటరీ పనులకు సంబంధించి - ఈ ప్రాజెక్టులో మొదటి సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాగా - రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

సీఎం జగన్‌ టార్గెట్‌ కు అనుగుణంగా మేఘా సంస్థ కూడా తాను చేపట్టిన పనుల్లో దూసుకుపోతోంది. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ - కాలువలకు సంబంధించి 71 శాతం పనులు ఇప్పటికే పూర్తి చేయగా.. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో మేఘా పనులను పరుగులు పెట్టిస్తోంది. ప్రాజెక్టు గేట్ల ఫ్యాబ్రికేషన్‌ ఇప్పటికే పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి మొత్తం 48 గేట్లు బిగించేలా పనులు నడుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. వంశధార–నాగావళి అనుసంధానం పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఆఫ్‌ షోర్‌ రిజర్వాయర్‌ పూర్తైతే నందిగాం - మెలియాపుట్టి - పలాస - టెక్కలి మండలాల్లోని 108 గ్రామాలకు ప్రయోజనం కలుగనుంది. తారకరామ తీర్థసాగర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టును 2022 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టారు. సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్టులో డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తైతే కొత్తగా 55 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.

ఇలా జగన్ సంకల్పం.. కాంట్రాక్టు పొందిన సంస్థల పట్టుదల వెరిసి ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నాయి. ఎంత అప్పుల్లో ఉన్నా కూడా ప్రజలకు కావాల్సిన సంక్షేమం - అభివృద్ధి విషయంలో జగన్ వెనకడుగు వేయకుండా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేలా పనులు చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలోనే ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి సాగు - తాగునీటిని ప్రజలకు అందించాలని పట్టుదలతో ముందుకెళ్తున్నారు.