Begin typing your search above and press return to search.

ఏపీ కాంగ్రెస్ కొత్త ల‌క్ష్యం ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   13 Nov 2017 10:55 AM GMT
ఏపీ కాంగ్రెస్ కొత్త ల‌క్ష్యం ఏంటో తెలుసా?
X
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు చెందిన న‌వ్యాంధ్ర తాజాగా పెట్టుకున్న ల‌క్ష్యం చూస్తే నిజంగానే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు. ఎందుకంటే... దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి రాష్ట్రాన్ని అత్య‌ధిక కాలం పాలించిన పార్టీగా... కాంగ్రెస్‌కు గ్రాండ్ రికార్డే ఉంది. తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య న‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ అధికారం చేజిక్కించుకోవ‌డానికి ముందు అధికారంలో ఉన్న‌ది కాంగ్రెస్సే. ఆ త‌ర్వాత కూడా తెలుగు దేశం పార్టీకి స‌మానమైన కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించింది. అయితే తెలంగాణ ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ తీర్చిన ద‌రిమిలా కాంగ్రెస్ పార్టీ న‌వ్యాంధ్ర‌లో జీరో స్థాయికి ప‌డిపోయింది. అటు కేంద్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా సాధించ‌లేని స్థితికి ప‌డిపోయిన కాంగ్రెస్‌... ఏపీ అసెంబ్లీలో కనీసం సింగిల్ సీటు కూడా సాధించ‌లేక చ‌తికిల‌బ‌డిపోయింది.

తెలంగాణ ప్ర‌జ‌ల కాంక్ష‌ను తీర్చిన కాంగ్రెస్‌... త‌మ‌ను అధోఃపాతాళానికి నెట్టేసింద‌న్న భావ‌న‌తో ఏపీ ప్ర‌జ‌లు ఆ పార్టీని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా ఆ పార్టీకి ఇవ్వ‌లేదు. ఫ‌లితంగా అప్ప‌టిదాకా ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాష్ట్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి 175 సీట్ల‌తో కొత్త‌గా ఏర్ప‌డ్డ ఏపీ అసెంబ్లీలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా ద‌క్క‌లేదు. అంటే... ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో అస‌లు కాలు మోపే స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేద‌న్న మాట‌. ఫ‌లితంగా అప్ప‌టిదాకా ప‌దేళ్ల పాటు మంత్రి ప‌ద‌వులు అలంక‌రించి డాబూ ద‌ర్పం ఒల‌క‌బోసిన కాంగ్రెస్ నేత‌లంతా డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక‌పోయారు. మ‌రి మ‌రో ఏడాదిన్న‌ర‌లో అటు పార్ల‌మెంటుతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతోంద‌న్న వాద‌న ఇప్పుడు అంద‌రి నోటా వినిపిస్తోంది.

అంద‌రి మాట ఎలా ఉన్నా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా ఎలా చూపించాల‌న్న భావ‌న కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో నెల‌కొంద‌న్న మాట వినిపిస్తోంది. ఇదే విష‌యంపై ఆ పార్టీ నేత‌లు ఇప్పుడు ఎక్క‌డిక‌క్క‌డ చ‌ర్చోప‌చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్నారు. పీసీసీ ప్రెసిడెంట్‌ గా ఉన్న మాజీ మంత్రి ఎన్‌. ర‌ఘువీరారెడ్డి కాళ్ల‌కు చ‌క్రాలు క‌ట్టుకున్న వాడిలా రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు. ర‌ఘువీరా ఎంత‌గా చుట్టేస్తున్నా... ఈ సారి ఎన్నిక‌ల్లోనైనా విజ‌యం సాధించే నేత ఒక్క‌రు కూడా క‌నిపించ‌డం లేదు. అప్ప‌టిదాకా పార్టీ సీనియ‌ర్లుగా - రాష్ట్ర మంత్రులుగా - కేంద్ర మంత్రులుగా ప‌ద‌వులు వెల‌గ‌బెట్టిన వారు... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత త‌మ త‌మ సొంత ప్ర‌యోజ‌నాలు చూస‌సుకుని పార్టీని అనాథ‌ను చేసేసి వెళ్లిపోయారు. ఇక మిణుకుమిణుకు మంటున్న కాంగ్రెస్ దీపంలో కాస్తంత ఒత్తి వేస్తార‌ని భావిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కూడా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు అంత‌గా హాజ‌ర‌వ‌డం లేదు. మ‌రోమారు త‌న సినీ ప్ర‌స్థానాన్ని ఘ‌నంగా ప్రారంభించిన చిరు... ఇప్పుడు వ‌రుస చిత్రాల షూటింగ్‌ లో బిజీబిజీగా మారిపోయారు.

మ‌రి ఒక్క ర‌ఘువీరా తిరిగితే ప్ర‌యోజ‌నం ఏముంటుంది? ఇదే భావ‌న ఆ పార్టీ నేత‌ల‌ను కూడా వెంటాడుతోంద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో ఆ పార్టీ ఓ స‌రికొత్త ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుంద‌ట‌. పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో మాత్ర‌మే చ‌ర్చ‌కు వస్తున్న ఈ ల‌క్ష్యాన్ని బ‌య‌ట‌కు పొక్క‌నీయ‌కుండా ర‌ఘువీరా చాలా జాగ్ర‌త్త‌లే తీసుకున్నారు. ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకున్నా... ఆ ల‌క్ష్యం ఎప్పుడో ఒక‌ప్పుడు బ‌య‌ట‌ప‌డిపోక త‌ప్ప‌దు క‌దా. అలాగేనేమో తెలియ‌దు గానీ... ఆ ల‌క్ష్యాన్ని మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్ తాజాగా బ‌య‌ట‌పెట్టేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీలో పార్టీ పాదం మోప‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. అంటే... మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తున్నా... క‌నీసం ఓ ప‌ది స్థానాల్లో అయినా విజ‌యం సాధించే అవ‌కాశాలు లేవ‌ని గ్ర‌హించిన పార్టీ... క‌నీసం ఒక్క సీట్లోనైనా విజ‌యం సాధించాల్సిందేన‌ని, త‌ద్వారా అసెంబ్లీలో స‌రికొత్త‌గా ఎంట్రీ ఇవ్వాల‌ని ఆ పార్టీ నేత‌లు ల‌క్ష్యం నిర్దేశించుకున్నార‌ట‌. ఎంత పిటీ కాక‌పోతే... రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ క‌నీసం ఒక్క సీట్లోనైనా గెల‌వాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం చూస్తుంటే... నిజంగానే జాలి వేయ‌క మాన‌దు. మ‌రి ఆ ల‌క్ష్య‌మైనా నెర‌వేరుతుందో, లేదో ఎన్నిక‌లు ముగిస్తే గానీ తెలియ‌దు.