Begin typing your search above and press return to search.

ఆ రెండింటిలోనూ తెలంగాణను దాటేసిన ఏపీ

By:  Tupaki Desk   |   26 April 2020 5:55 AM GMT
ఆ రెండింటిలోనూ తెలంగాణను దాటేసిన ఏపీ
X
ఒక్కసారి వెనక్కి వెళితే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన చాలా రోజుల వరకూ ఏపీ ఖాతా తెరిచింది లేదు. తెలంగాణలో డబుల్ డిజిట్ కు పాజిటివ్ కేసులు టచ్ చేసిన వేళలోనూ ఏపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఇదే జోరు మార్చి మొత్తమే కాదు.. ఏప్రిల్ మొదటివారం వరకూ కొనసాగింది. గడిచిన పది రోజులుగా చూస్తే సీన్ తలకిందులు కావటమే కాదు.. కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

తాజాగా చూస్తే.. రెండు ఇబ్బందికర రికార్డులు ఏపీ పేరిట నమోదయ్యాయి. కరోనా కలకలం షురూ అయిన తర్వాత తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసుల్ని ఏపీ క్రాస్ చేసింది. మూడు రోజుల క్రితమే తెలంగాణలో వెయ్యి పాజిటివ్ కేసులు నమోదవుతాయని భావించినా.. అలా జరగలేదు. అందుకు భిన్నంగా గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణతో పోలిస్తే కేసుల నమోదులో వెనుకబడి ఉన్నట్లు కనిపించిన ఏపీ.. శనివారం మాత్రం దాటేసింది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో ఏపీలో వెయ్యి అంకెను దాటేస్తే.. తెలంగాణ మాత్రం 990 కేసులకే పరిమితమైంది.

కేసుల నమోదులోనే కాదు.. కరోనా మరణాల్లోనూ తెలంగాణను క్రాస్ చేసేసింది ఆంధ్రప్రదేశ్. గడిచిన 24 గంటల్లో (శనివారం రాత్రితో ముగిసే) దేశ వ్యాప్తంగా 57 మంది మరణించారు. కొత్తగా 1429 కేసులు నమోదయ్యాయి. దీంతో.. భారత్ లో కరోనా కేసుల నమోదు పాతికవేలకు దగ్గరగా వచ్చేసింది. ఇప్పటికి 5062 మంది కోలుకుంటే.. 775 మంది మరణించారు.

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందుతున్న వారు 18,668గా చెబుతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి మధ్యనున్న 24 గంటల్లో చోటు చేసుకున్న మరణాల్లో అత్యధికం మహరాష్ట్రలో కాగా.. అత్యల్పం పంజాబ్ లో కావటం గమనార్హం. తాజాగా మహారాష్ట్రలో 18 మరణిస్తే.. గుజరాత్ లో తొమ్మిది మంది..మధ్యప్రదేశ్.. పశ్చిమబెంగాల్.. ఢిల్లీల్లో ముగ్గురుచొప్పున మరణించారు.తమిళనాడులో ఇద్దరు.. యూపీ.. పంజాబ్ లలో ఒక్కరుచొప్పున ప్రాణాలు విడిచారు.

విషాదకరమైన విషయం ఏమంటే.. నిన్నటివరకూ కేసుల నమోదులోనూ.. కరోనా మరణాల్లోనూ తెలంగాణ కంటే మెరుగైన రికార్డు ఉన్న ఏపీలో శనివారం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో 990 పాజిటివ్ కేసులు నమోదైతే.. ఏపీలో వెయ్యి కేసుల్ని దాటేసింది. మరణాల్లోనూ తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ మంది మరణించినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకూ తెలంగాణలో 26 మంది కరోనా కారణంగా మరణిస్తే.. ఏపీలో ఇది 29గా ఉంది. కొత్త కేసుల నమోదు.. మరణాల్లో తెలంగాణను ఏపీ క్రాస్ చేయటం హాట్ టాపిక్ గా మారింది.