Begin typing your search above and press return to search.

సరిసంఖ్య మెలిక.. సీఎస్ అలక

By:  Tupaki Desk   |   26 Oct 2015 7:09 AM GMT
సరిసంఖ్య మెలిక.. సీఎస్ అలక
X
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన పూర్తయి నాలుగు రోజులైనా అలకలు మాత్రం తీరడం లేదు. ఇప్పటికే పలువురు నాయకులు అలకబూనారన్న సంగతి తెలియగా తాజాగా ఉన్నతాధికారులూ ఇంకా అలక పాన్పుపైనే ఉన్నారన్న విషయం బయటపడింది. దీంతో చంద్రబాబు వారి అలకను అర్థం చేసుకుని అందుకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తున్నారట. రాజధాని వ్యవహారాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించి చంద్రబాబుకు కుడిభుజంగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు మొన్నటి శంకుస్థాపన కార్యక్రమంలో తనకు ప్రాధాన్యం దక్కలేదని అలకవహించారట. అన్నీ తామే చేస్తే చివరకు తమనే పట్టించుకోలేదన్నది ఆయన ఆగ్రహానికి కారణమవుతోంది. శంకుస్థాపన కార్యక్రమ ప్రధాన వేదికపై ఆయనకు చోటు లభించకపోవడంతో ఆయన మండిపడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ సంగతి తెలుసుకున్న చంద్రబాబు ఆయన్ను బుజ్జగిస్తున్నారట.

ఇంతకీ కృష్ణారావును ప్రధాన వేదికపై ఎందుకు ఉంచలేదన్నది విచారిస్తే తమాషా సంగతొకటి బయటపడింది. ప్రధాని మోడీకి ఉన్న నంబర్ సెంటిమెంటు కారణంగానే కృష్ణారావు కింద కూర్చోవాల్సి వచ్చిందట. తొలుత వేదికపై 17మంది ఉంటారని నిర్ణయించారు. అందులో కృష్ణారావు కూడా ఒకరు. అయితే. ఆ 17 మందిలో ఉన్న పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ హాజరుకాకపోవడంతో ఆ సంఖ్య 16కు చేరింది. కానీ, సరి సంఖ్యలంటే అంటే మోడీకి పడదంట. దీంతో ఆయన కార్యాలయం 16మంది వద్దేవద్దని పట్టుపట్టింది. దీంతో లిస్టులో 16వ పేరైన సీఎస్ పేరు డిలీటైపోయిందట. దాంతో కృష్ణారావు కింద కూర్చోవాల్సి వచ్చింది.

మనలో మన మాట.... సరిసంఖ్య కాకుండా బేసి సంఖ్యే ఉండాలంటే ఆ పదిహేడో వ్యక్తిగా ప్రకాశ్ సింగ్ బాదల్ కు బదులుగా ఇంకొకరికి అవకాశం ఇవ్వొచ్చుగా. అప్పుడు సీఎస్ పేరు తీయనవసరం లేదు.. కొత్తగా ఇంకొకరెవరైనా ఖుషీ అవుతారు కూడా. మరి అలా ఎందుకు చేయలేదో.