Begin typing your search above and press return to search.

బాబు ప్ర‌చారం కామెడీగా మారిందా?

By:  Tupaki Desk   |   16 Nov 2016 11:30 AM GMT
బాబు ప్ర‌చారం కామెడీగా మారిందా?
X
సొంత రాష్ట్రం నుంచే ప‌రిపాల‌న‌ - ఏపీకి చేరువ‌గా అధికారులు అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన ప్ర‌చారంలో ఆచ‌ర‌ణ‌లో విఫ‌లం అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. కార‌ణం వెలగపూడిలో పని చేసేందుకు అధికారులు అంతగా ఆసక్తి చూపడం లేదు. నేటికీ పలువురు అధికారులు సచివాలయానికి రావడం లేదు. ఏడాది కిందట అంతా వెలగపూడికి రావాల్సిందేనంటూ ఊదరగొట్టిన అధికారులే నేడు దూరంగా ఉంటుండ‌టం గ‌మ‌నార్హం. ప్రతి రోజూ సచివాలయానికి వస్తున్న అధికారులను వేళ్లపై లెక్కించవచ్చని టాక్ వినిపిస్తోందంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. చివరకు పాలనా యంత్రాంగానికి అధిపతిగా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా సచివాలయం వైపు కన్నెత్తి చూడడం లేదు. దీని ప్రభావం ఉద్యోగులపైనా పడుతోందని త‌ద్వారా పాల‌న కుంటుప‌డుతోంద‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ప‌రిపాల‌న గత నెల మూడో తేదీన వెలగపూడి నుంచి పాలన ప్రారంభమైంది. ముఖ్య మంత్రి - సీఎస్‌ - ఇతర అధికారుల ఒత్తిడి మేరకు ఉద్యోగులంతా ప్రత్యేక రైలులో వెలగపూడికి తరలివచ్చారు. ఉద్యోగులను వెనుక నుంచి నడిపించిన అధికారులు మాత్రం ముందడుగు వేయడం లేదు. ఇప్పటికీ కొంతమంది అధికారులు అసలు వెలగపూడికి రాలేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. మరికొందరైతే గత నెల రోజుల్లో కేవలం నాలుగైదు సార్లు మాత్రమే వెలగపూడి సందర్శించి వెళ్లిపోయారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ పీ టక్కర్‌ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదు. ఆయన కోసం ఒకటో భవనంలో ఏర్పాటు చేసిన సిఎస్‌ ఛాంబర్‌ పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదన్న కారణంగా టక్కర్‌ ఇప్పటికీ సిఎస్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తున్నారు. అయితే వెలగపూడి సచివాలయంలోని రెండో భవనంలో ప్లానింగ్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో టక్కర్‌ కు మరో ఛాంబర్‌ కేటాయించారు. ఇది అన్ని వసతులతో సిద్ధంగా ఉంది. అయితే దీన్ని ఉపయోగించుకునేందుకు టక్కర్‌ సుముఖత చూపించడం లేదని అధికారులు అంటున్నారు. అందుకే ఆయన సచివాలయం వైపు రావడం లేదని చెబుతున్నారు.

ఆయన దారిలోనే మరికొందరు అధికారులు నడుస్తున్నారని - వెలగపూడికి రాకుండా తప్పించుకుంటున్నారు. కేవలం ఆర్థికశాఖ - ప్లానింగ్‌ - మౌలికాభివృద్ధి - రోడ్లు - భవనాలు - రెవెన్యూ - సాంఘిక సంక్షేమం వంటి కొన్ని శాఖల అధికారులు మినహా మిగిలిన శాఖల అధికారులు సచివాలయం వైపు ముఖం చాటేస్తున్నారు. కొంతమంది సెలవులపై వెళ్లిపోతున్నారు. అధికారులు రాకపోతుండడంతో ఆ ప్రభావం ఉద్యోగులపైనా పడుతోంది. ఇప్పటికీ హైదరాబాద్‌కు అప్ అండ్‌ డౌన్‌తో ఐదు రోజుల పనిదినాలు కాస్తా నాలుగు రోజులుగా మారిపోయాయి. సోమవారం మధ్యాహ్నానికి వెలగపూడి చేరుకుంటున్న ఉద్యోగులు శుక్రవారం మధ్యాహ్నానికే బస్సుల పేరుతో సచివాలయం నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో కేవలం నాలుగు రోజులు మాత్రమే వారు పనిచేస్తున్నారు. ఇదే సమయంలో చీఫ్‌ సెక్రటరీ - ఇతర అధికారులు - చివరకు మంత్రులు కూడా ఆశించిన స్థాయిలో సచివాలయానికి రాకపోవడంతో ఉద్యోగులు కూడా విధులపై శ్రద్ధ చూపించని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సీఎస్‌ టక్కర్‌ సచివాలయానికి రావాలని - అప్పుడే పాలన వేగవంతం అవుతుందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/