Begin typing your search above and press return to search.

ఏ క్ష‌ణంలోనైనా తెలంగాణ‌కు ఏపీ క‌రెంట్ క‌ట్‌

By:  Tupaki Desk   |   8 Jun 2017 4:46 AM GMT
ఏ క్ష‌ణంలోనైనా తెలంగాణ‌కు ఏపీ క‌రెంట్ క‌ట్‌
X
విభ‌జ‌న నేప‌థ్యంలో ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య‌నున్న పంచాయితీలు స‌రిపోన‌ట్లు కొత్తగా బ‌కాయిల లొల్లి తెర పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. విభ‌జ‌న నిర్ణ‌యాల ప్ర‌కారం ఏపీకి చెందిన విద్యుత్ తెలంగాణ‌కు.. తెలంగాణ ఉత్ప‌త్తి చేసే థ‌ర్మ‌ల్ విద్యుత్‌ లో కొంత‌భాగాన్ని ఏపీకి పంపిణీ చేసేలా నిర్ణ‌యం తీసుకున్నారు.

అయితే.. తెలంగాణ‌కు పంపిణీ చేసే ఏపీ విద్యుత్‌ కు సంబంధించిన బ‌కాయిల్ని తెలంగాణ ప్ర‌భుత్వం క్లియ‌ర్ చేయ‌లేదు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఉత్త‌ర‌ప్ర‌త్యుత్త‌రాలు జ‌రిగాయి. చివ‌ర‌కు.. త‌మ‌కు చెల్లించాల్సిన రూ.3,138 కోట్ల‌ను వెంట‌నే చెల్లించాల‌ని ఏపీ జెన్ కో తెలంగాణ‌ను ప‌లుమార్లు కోరింది. అయిన‌ప్ప‌టికీ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌టంతో.. త‌మ‌కు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వ‌ని ప‌క్షంలో.. క‌రెంట్ పంపిణీని క‌ట్ చేస్తామ‌ని పేర్కొంది. అయిన‌ప్ప‌టికీ తెలంగాణ నుంచి త‌గిన స్పంద‌న రాక‌పోవ‌టంతో.. తెలంగాణ‌కు పంపిణీ చేసే విద్యుత్‌ ను నిలిపివేయాల‌ని ఏపీ జెన్ కో నిర్ణ‌యించింది. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని తెలంగాణకు అంద‌చేసింది.

అయిన‌ప్ప‌టికీ ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌టంతో..త‌మ‌కు రావాల్సిన బ‌కాయిల్ని చెల్లించే వ‌ర‌కూ విద్యుత్ నిలిపివేయాలంటూ స‌ద‌ర‌న్ రీజియ‌న్ లోడ్ డిస్పాచ్ సెంట‌ర్‌ కు.. ఏపీ లోడ్ డిస్పాచ్ సెంట‌ర్‌ కు ఏపీ జెన్ కో ఎండీ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు.

గ్రిడ్ డిమాండ్‌ ను అనుస‌రించి.. విద్యుత్‌ ను నిలిపివేసేందుకు షెడ్యూలింగ్ చేయాల్సి ఉంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో బుధ‌వారం అర్ద‌రాత్రి నుంచి గురువారం లోపు ఏ క్ష‌ణంలో అయినా తెలంగాణ‌లో ఏపీ విద్యుత్ నిలిపివేయ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

ఈ లెక్క‌ల పంచాయితీలో మ‌రో ఆస‌క్తిక‌ర కోణం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. సింగ‌రేణి కాల‌రీస్‌ కు తాము ఇవ్వాల్సిన రూ.1360 కోట్ల మొత్తాన్ని తెలంగాణ డిస్కంల నుంచి స‌ర్దుబాటు చేస్తామ‌ని చెప్పినా సింగ‌రేణి అందుకు నో చెప్పేయ‌టం గ‌మ‌నార్హం. దీంతో బ‌కాయిల్ని త‌మ‌కు చెల్లించాల‌ని ఏపీ జెన్ కో నోటీసులు జారీ చేసినా తెలంగాణ అధికారులు మాత్రం స్పందించ‌లేదు. ఓప‌క్క వ‌ర్షాల‌తో ఏపీలో విద్యుత్ డిమాండ్ త‌గ్గింది. మ‌రోవైపు తెలంగాణ‌కు పంపిణీ చేయాల్సిన విద్యుత్‌ ను నిలిపివేస్తున్న వేళ‌లో.. విద్యుదుత్ప‌త్తి డిమాండ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌నుంది. దీంతో.. ఏపీ జెన్ కో థ‌ర్మ‌ల్ ఫ్లాంట్ల‌లో కొంత‌మేర ఉత్ప‌త్తి నిలిపివేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీకి చెల్లించాల్సిన బ‌కాయిల‌పై ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీ వాద‌న‌ను మాత్ర‌మే వింటున్నా.. తెలంగాణ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ ఈ అంశంపై త‌న వాద‌న‌ను వినిపించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/