Begin typing your search above and press return to search.

ఢిల్లీకి వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం.. అక్కడకు మాత్రం వెళ్లలేదా?

By:  Tupaki Desk   |   1 April 2020 4:00 AM GMT
ఢిల్లీకి వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం.. అక్కడకు మాత్రం వెళ్లలేదా?
X
ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఢిల్లీలో నిర్వహించిన మత ప్రార్థనలు.. అందులో హాజరైన వారికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజాముద్దీన్ లోని మర్కజ్ మత ప్రార్థనలకు హాజరైన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ రావటం.. ఇప్పటికే తెలంగాణలో ఈ కార్యక్రమానికి హాజరై వచ్చిన వారిలో ఆరుగురు మరణించటంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ ఉదంతం మినహా.. కరోనా ట్రాక్ రికార్డు ఫర్లేదన్న స్థాయి నుంచి వేలెత్తి చూపించే వరకూ వెళ్లిందని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సైతం ఢిల్లీకి వెళ్లారని.. ఈ మత ప్రార్థనల్లో పాల్గొన్నట్లుగా ప్రచారం సాగుతోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారి.. హాట్ టాపిక్ గా మారాయి. చాలామంది ఏపీ డిప్యూటీ సీఎం బాషా మీద అనుమానపు చూపులు చూస్తున్నారు. ఇలాంటివేళ.. డిప్యూటీ ముఖ్యమంత్రి తన మీద జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా కొట్టిపారేశారు.

ఉద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం సాగుతుందని స్పష్టం చేశారు. తాను ఢిల్లీ వెళ్లిన మాట వాస్తవమే అయినా.. తాను మత ప్రార్థనల్లో పాల్గొన్నది లేదని స్పష్టం చేశారు. తాను మార్చి రెండున ఢిల్లీకి వెళ్లిన మాట వాస్తవమే అయినా.. అదంతా కూడా పార్టీ ప్రకటించిన నాలుగు శాతం రిజర్వేషన్ కేసుకు సంబంధించి మాత్రమే వెళ్లినట్లు చెప్పారు.

ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న తనకు ప్రోటోకాల్ ఉంటుందని.. తన ప్రతి అడుగు నమోదువుతుందన్నారు. తన బస కూడా ఏపీ భవన్ లోనే అని చెప్పిన ఆయన.. తర్వాతి రోజున తాను సీఎం జగన్ ను కలిసిన వైనాన్ని గుర్తు చేశారు. నాలుగో తేదీన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలోనూ తాను హాజరైన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. నిజాలుఇలా ఉంటే..తన మీద జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపడుతూ.. ఇలా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నారు. తనను రాజకీయంగా దెబ్బ తీయటానికి ఇలంటి ప్రచారాం మొదలు పెట్టినట్లుగా ఆయన ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం.