Begin typing your search above and press return to search.

ఏపీలో డిప్యూటీ సీఎంలకు స్థానం దక్కనిది అందుకే!

By:  Tupaki Desk   |   21 Oct 2019 7:09 AM GMT
ఏపీలో డిప్యూటీ సీఎంలకు స్థానం దక్కనిది అందుకే!
X
ఏపీ లో ఇన్ చార్జి మంత్రులకు స్థాన చలనం ఆసక్తిదాయకంగా మారింది. సరిగ్గా నాలుగు నెలలకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇన్ చార్జి మంత్రులను మార్చారు. వారి వారి పనితీరును పరిగణనలోకి తీసుకునే ఈ మార్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. పార్టీ నేతలను సమన్వయం చేసుకోవడం విషయంలో ఇన్ చార్జి మంత్రుల పనితీరు సరిగా లేకపోవడమే ఈ మార్పులకు కారణమని తెలుస్తోంది. ఈ బాధ్యతల్లో ఫెయిల్ అయిన వారిని జగన్ మోహన్ రెడ్డి నిర్మొహమాటంగా పక్కన పెట్టడం గమనార్హం.

ప్రధానంగా ఇప్పుడు ఇన్ చార్జి మంత్రులుగా బాధ్యతలు కొందరికి దక్కలేదు. వారి గురించినే చర్చ జరుగుతూ ఉంది.మేకతోటి సుచరిత (హోంమంత్రి) - పాముల పుష్పశ్రీవాణి (ఉప ముఖ్యమంత్రి) - తానేటి వనిత (మహిళా శిశు సంక్షేమం) లకు ఇన్ చార్జి మంత్రులుగా స్థానం దక్కలేదు. ఉన్న మంత్రులు ఎక్కువమంది - జిల్లాలు తక్కువ అయిన నేపథ్యంలో కొందరికి చోటు దక్కకపోయి ఉండవచ్చు.అయితే వీరిలో కొందరు పనితీరు అంత గొప్పగా లేకపోవడంతోనే ముఖ్యమంత్రి వారిని పక్కన పెట్టారనే ప్రచారం సాగుతూ ఉంది.

ప్రత్యేకించి మొన్నటి వరకూ నెల్లూరు ఇన్ చార్జిగా వ్యవహరించారు హోంమంత్రి మేకతోటి సుచరిత. అయితే అక్కడ నేతల కీచులాటలు గట్టిగా సాగాయి. అంతా సీనియర్లే. వాళ్లలో వాళ్లు కలహించుకున్నారు. ఎమ్మెల్యే అరెస్టు వరకూ వెళ్లింది వ్యవహారం. అలాంటి సమయంలో వారిని సమన్వయ పరచడంలో సుచరిత రాణించలేకపోయినట్టుగా స్పష్టం అయ్యింది.

అందుకే నెల్లూరు జిల్లా ఇన్ చార్జి పదవిని సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డికి అప్పగించారు. సుచరిత చెప్పినా నెల్లూరు జిల్లా నేతలు వినకపోవచ్చు. అందుకే బాలినేని వంటి ప్యూర్ సీనియర్ నేతకు ఆ బాధ్యతలు అప్పగించారు. నేతలను అదిలించి అయినా వారిని గాడిన పెట్టగల నేర్పు బాలినేనికి ఉంటుంది. అందుకే రాజకీయంగా కఠినమైన జిల్లా అయిన నెల్లూరు బాధ్యతలు ఆయనకు అప్పగించినట్టున్నారు ముఖ్యమంత్రి.

ఏతావాతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి సారి ఒక గట్టి సమీక్ష నిర్వహించి, మార్పులు చేశారు. చర్యలు తీసుకోవడానికి తన వద్ద ఆలస్యం ఉండదనే సంకేతాలను గట్టినే ఇచ్చారు ముఖ్యమంత్రి.