Begin typing your search above and press return to search.

ఏపీలోని ప్ర‌తి త‌ల‌కాయ మీద అప్పు ఎంతంటే?

By:  Tupaki Desk   |   11 July 2019 7:27 AM GMT
ఏపీలోని ప్ర‌తి త‌ల‌కాయ మీద అప్పు ఎంతంటే?
X
గొప్పలు ఎవ‌రైనా చెబుతారు. కానీ.. వాస్త‌వం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇప్పుడిదే విష‌యం ఏపీ ప్ర‌భుత్వం తాజాగా విడుద‌ల చేసిన శ్వేత‌ప‌త్రం చూస్తే ఇట్టే తెలుస్తుంది. త‌న‌కు మించిన అనుభ‌వం దేశంలో మ‌రే రాజ‌కీయ నేత‌కు లేద‌ని గొప్ప‌లు చెప్పే చంద్ర‌బాబు పాల‌న‌లో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా మారింద‌న్న విష‌యం తాజా లెక్క‌లు స్ప‌ష్టం చేశాయ‌ని చెప్పాలి.

విభ‌జ‌న త‌ర్వాత రాష్ట్రం ఎంత రుణ‌గ్ర‌స్థంగా మారింద‌న్న విష‌యం తాజా లెక్క‌లు చెప్పేస్తున్న ప‌రిస్థితి. అప్పులు తెచ్చినా.. వాటిని ఆదాయం తెచ్చేలా మార్చ‌టంలో విఫ‌లం కావ‌టం కూడా కార‌ణం. రాష్ట్ర ఆర్థిక దుస్థితికి విభ‌జ‌న ప్ర‌భావం ఒక ఎత్తు అయితే.. కార్పొరేష‌న్ల పేరుతో నిధులు స‌మీక‌రించి వాటిని వేరే ప‌థ‌కాల‌కు మ‌ళ్లించ‌టంతో ప్ర‌భుత్వానికి పెనుభారంగా మార్చాయ‌ని చెప్పాలి.

2004-09 మ‌ధ్య కాలంలో రాష్ట్రంలో పేద‌రికం త‌గ్గింద‌ని.. మాన‌వాభివృద్ధి పెరిగిన‌ట్లు స‌ద‌రు శ్వేత‌ప‌త్రంలో పేర్కొన్నారు. గ‌డిచిన 20 ఏళ్ల‌లో 2004-09 మ‌ధ్య‌కాలంలోనే రాష్ట్ర స్థూల జాతీయోత్ప‌త్తి పెరిగింద‌ని.. విభ‌జ‌న త‌ర్వాత గ‌త ఐదేళ్ల‌లో వ్య‌వ‌సాయంతో పాటు.. వాటి అనుబంధ రంగాల్లో వృద్ధి చూపించిన‌ప్ప‌టికీ.. లెక్క‌ల్ని లోతుగా ప‌రిశీలిస్తే కొన్ని రంగాల్లో మైన‌స్ వృద్ధి రేటు న‌మోదైన‌ట్లుగా పేర్కొంది.

ప్ర‌స్తుతం ఏపీ నెత్తిన రూ.3,62,375 కోట్ల భారీ అప్పు భారం ఉన్న‌ట్లు పేర్కొంది. రాష్ట్రంలో పుట్టిన బిడ్డ‌తో స‌హా ప్ర‌తి ఒక్క‌రి నెత్తిన త‌ల‌స‌రి రుణ‌భారం రూ.42,500 ఉన్న‌ట్లుగా తేల్చారు. ఎస్పీవీ.. త‌దిత‌రాల ద్వారా తీసుకున్న అప్పులు క‌లిపితే ప్ర‌తి ఒక్క‌రి మీద త‌ల‌స‌రి రూ.ల‌క్ష వ‌ర‌కు అప్పు ఉన్న‌ట్లు తేల్చారు. ప్ర‌తి నెలా ఏపీ ఓవ‌ర్ డ్రాఫ్ట్ కు వెళ్లాల్సి రావ‌టంతో ఇదంతా ఏపీ రేటింగ్ మీద ప్ర‌భావం చూపుతుంద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించింది.