Begin typing your search above and press return to search.

రోజా జీతాన్ని డిసైడ్ చేసిన ఏపీ సర్కార్

By:  Tupaki Desk   |   5 Oct 2019 8:08 AM GMT
రోజా జీతాన్ని డిసైడ్ చేసిన ఏపీ సర్కార్
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా.. రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే నగరి ఎమ్మెల్యే కమ్ ఏపీఐఐసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆర్కే రోజాకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వెల్లడైంది. జగన్ సర్కారులో రోజాకు మంత్రి పదవి పక్కాగా దక్కుతుందని భావించినా.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమెకు ఆ అవకాశం దక్కలేదు. అయితే.. మంత్రి పదవికి ధీటైన ఏపీఐఐసీ ఛైర్మన్ గా నియమిస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీఐఐసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న రోజా జీతభత్యాలకు సంబంధించి ఒక జీవోనుజారీ చేశారు. ఇందులో ఆమెకు జీతం రూపంలో ఎంత? అలవెన్స్ ల రూపంలో ఎంత మొత్తాన్ని ఇవ్వనున్న విషయాన్ని వెల్లడించారు. తాజాగా విడుదలైన జీవో ప్రకారం.. ఏపీఐఐసీ ఛైర్మన్ గా నెలకు రూ.3.82లక్షలు అందనుంది. ఇందులో జీతం రూ.2లక్షలు కాగా.. వివిద సౌకర్యాల కోసం మిగిలిన మొత్తాన్ని కేటాయించారు.

ఛైర్ పర్సన్ హోదాలో రోజా వాహన సౌకర్యానికి రూ.60వేలు.. అధికారిక క్వార్టర్స్ లో లేనిపక్షంలో వసతి సౌకర్యంలో భాగంగా నెలకు రూ.50వేలు.. మొబైల్ ఫోన్ ఛార్జీలకు రూ.2వేలు.. వ్యక్తిగత సిబ్బంది.. వారి జీతభత్యాల కోసం రూ.70వేలు చెల్లించనున్నట్లుగా జీవో పేర్కొంది. మంత్రి పదవి దక్కున్నా.. ఆ స్థాయికి ఏ మాత్రం తీసిపోని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవే కాదు.. జీతభత్యాలు కూడా భారీగా ఉన్నాయని చెప్పక తప్పదు.