Begin typing your search above and press return to search.

ఏపీ బడ్జెట్ సమావేశాలు ఒక్కరోజులోనే

By:  Tupaki Desk   |   23 March 2020 1:25 PM GMT
ఏపీ బడ్జెట్ సమావేశాలు ఒక్కరోజులోనే
X
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాలు కేవలం ఒక్క రోజుకే పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు ఏపీలోనూ పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమై ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతి పరిధిలోని విజయవాడలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం మరింత ముందు జాగ్రత్తలు పాటిస్తోంది.

తొలుత ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు అసెంబ్లి సమావేశాలను నిర్వహించాలని భావించినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశాలను కేవలం ఒక్క రోజుకే కుదించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఓటాన్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టి - దాన్ని ఆమోదించి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయాలని యోచిస్తోంది. బడ్జెట్‌ ఆమోదంతోనే ఏప్రిల్‌ నెల ఉద్యోగుల జీతాలు - ఇతర ఖర్చులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్క రోజు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఒకే రోజున గవర్నర్‌ ప్రసంగం - బడ్జెట్‌ ప్రతిపాదన - ఆమోదం పూర్తి చేయాలని ప్రభుత్వం సీరియస్‌ గా ఆలోచిస్తోంది. ఒకవేళ రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడకపోతే అదే రోజు పోలింగ్ ఉంటుంది. పోలింగ్‌ కోసం 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరు కావాల్సి ఉండటంతో, అదే సమయంలో ఓటాన్‌ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తే కరోనా ప్రభావం ముప్పు నుంచి కొంత మేరకు బయటపడవచ్చన్న ఆలోచనలో అధికార యంత్రాంగం ఉంది. ప్రత్యేకంగా ఓటాన్‌ బడ్జెట్‌ సమావేశాలు మరోరోజు నిర్వహిస్తే.. మళ్లి ఎమ్మెల్యేలతో పాటు 56 మంది ఎమ్మెల్సీలు - వారి సిబ్బంది - ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అధికారులు అంతా హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో అసెంబ్లిలో భారీగా జనసమూహం కూడే అవకాశాలు ఉండటంతో ఒకవైపు పోలింగ్‌ పూర్తి చేసుకుంటూనే.. మరోవైపు అసెంబ్లిని నడపాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లుగా చెబుతున్నారు.