Begin typing your search above and press return to search.

మీరు ఏపీలో ఉంటారా? ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే

By:  Tupaki Desk   |   8 Dec 2019 4:18 AM GMT
మీరు ఏపీలో ఉంటారా? ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే
X
మీరు ఏపీలో ఉంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుబంధం కానీ.. ఆ రాష్ట్రంలో తరచూ పర్యటిస్తుంటారా? అయితే.. మీరీ వార్తను తప్పనిసరిగా చదవాల్సిందే. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను అసరా చేసుకొని సరికొత్త రక్షణకు తెర తీసేలా కొత్త మొబైల్ యాప్ ను లాంఛ్ చేయబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఒక్కటంటే ఒక్క యాప్ తో ఏకంగా 89 సేవల్ని పొందే వీలుంది.

ఇవాల్టి రోజున స్మార్ట్ ఫోన్లు లేనోళ్లు చాలా తక్కువనే చెప్పాలి. ఫోన్లలో చాలానే యాప్ లు ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం లాంఛ్ చేస్తున్న స్పందన సురక్ష యాప్ ఉంటే చాలు.. ఉన్న చోటు నుంచే అవసరమైన పోలీసు సేవల్ని అందించేందుకు ఏపీ పోలీసులు అందుబాటులోకి వచ్చేస్తారు. ఈ యాప్ లోని ప్రధానమైన 15 విభాగాల నుంచి పలు రకాలైన సేవల్ని అందిస్తున్నారు. త్వరలో దీన్ని ఏపీ ముఖ్యమంత్రి అధికారికంగా లాంఛ్ చేయనున్నారు.

అత్యవసర సమయాల్లో సమయాల్లో పోలీస్ రక్షణ కోసం డయల్ 112.. పోలీస్‌ సేవల కోసం డయల్‌ 100.. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098.. టూరిస్ట్‌ హెల్ప్‌లైన్‌ 1363.. ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 181.. అంబులెన్స్‌ సేవలకు 108.. ఫైర్‌ సర్వీస్‌కు 101.. రోడ్డు ప్రమాదాల్లో అత్యవసర సేవలకు 1073.. సైబర్‌ మిత్ర సేవల కోసం 9121211100కి డయల్‌ చేయవచ్చు.

ఇవే కాక ఈ మెయిల్స్.. వెబ్‌ సెర్చింగ్.. ఎస్ ఎంఎస్‌ లాంటి అన్ని కీలక లింక్‌లు ఈ యాప్‌ తో అనుసంధానమై ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి ఉపయోగించినా అత్యవసర సిగ్నల్‌ ద్వారా పోలీసులను అప్రమత్తం చేస్తుంది. ఈ యాప్‌ ద్వారా ప్రజలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ అధికారికి అందిన ఫిర్యాదు రశీదు కూడా యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంది. అంతేనా.. వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలుసుకోవచ్చు.

ఈ యాప్‌తో కమ్యూనిటీ పోలీసింగ్‌ నిర్వహించవచ్చు. అవాంఛనీయ ఘటనలు, అసాంఘిక శక్తుల ఆగడాలను ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తేవచ్చు. సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు యాప్‌ ద్వారా సమాచారం అందిస్తే పోలీసులు లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్.. ప్రత్యేక పోలీస్‌ బీట్‌ ద్వారా రక్షణ కల్పిస్తారు. ఈ చలానా ద్వారా వాహనాలకు విధించే అపరాధ రుసుము, ఎప్పుడు ఫైన్‌ పడింది? ఎంత చెల్లించాలి? తదితర వివరాలను యాప్‌ ద్వారా తెలుసుకుని చెల్లింపులు జరపవచ్చు. సొత్తు రికవరీ ఆప్షన్‌లో చోరీకి గురైన నగదు, బంగారం, వాహనాలు, మొబైల్‌ ఫోన్‌లు తదితరాలకు సంబంధించి పోలీస్‌ దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

అంతేకాదు.. కొత్తగా ఏపీకి వెళ్లిన వారు కానీ.. రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వివిధ పనుల మీద వెళ్లిన వారు తమ సమీపంలోని పోలీస్ స్టేషన్ వివరాల్ని ఒక్క క్లిక్ లో తెలుసుకోవటానికి ఈ యాప్ అక్కరకు రానుంది. లొకేట్ పోలీస్ స్టేషన్ అప్షన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు.. సబ్ డివిజనల్ ఆఫీసులు.. జిల్లా ఎస్పీ కార్యాలయాలు.. అధికారుల మొబైల్.. ల్యాండ్ ఫోన్ నెంబర్లు తెలుసుకునే వీలుంది.

కేసు స్టేటస్‌ ఆప్షన్‌లో జిల్లా.. మండలం.. పోలీస్‌ స్టేషన్.. ఎఫ్ఐఆర్‌ వారీగా వివరాలను స్వయంగా చూసుకోవచ్చు. తమ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో పౌరులు స్వయంగా చూడవచ్చు. ఫిర్యాదు రశీదు, ఎఫ్ఐఆర్‌ పత్రాలను పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరిన్ని సేవల విషయానికి వస్తే.. కేసు పురోగతి డిటైల్స్.. కిడ్నాప్ నకు గురైన వ్యక్తుల గాలింపు వివరాలు.. గుర్తు తెలియని మృతదేహాల డిటైల్స్.. అరెస్టు అయిన నిందితుల వివరాల్ని తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. పాస్ పోర్టు తనిఖీ స్టేటస్ ఉన్న చోటు నుంచే పోలీసు సేవల్ని వినియోగించుకునే వీలుంది. మొత్తంగా చూస్తే.. స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన యాప్ గా దీన్ని చెప్పక తప్పదు.