Begin typing your search above and press return to search.

ఉత్సాహం పెరిగితే రూల్ రూళ్ల‌క‌ర్ర సీన్లోకి..

By:  Tupaki Desk   |   22 April 2017 4:34 AM GMT
ఉత్సాహం పెరిగితే రూల్ రూళ్ల‌క‌ర్ర సీన్లోకి..
X
కొన్నిసార్లు అంతే.. ఊహించ‌ని విధంగా కొన్నిప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. ఇలాంటి స‌మ‌యాల్లో సంయ‌మ‌నం కాస్త అవ‌స‌రం. అస‌హ‌నం అంత‌కంత‌కూ పెరిగిపోతున్న వేళ‌.. వ్య‌క్తిగ‌త ఎజెండాల్ని ప‌క్క‌న పెట్టాల్సిందే. లేదంటే.. మొద‌టికే మోసం వ‌చ్చే ప‌రిస్థితి. ప్ర‌స్తుతం ఇలాంటి సీన్‌ తెలుగు రాష్ట్రాల్లో నెల‌కొంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో ఇప్పుడు ప‌రిస్థితులు ఇబ్బందిక‌రంగా మారాయి. తెలంగాణ‌లో అధికార‌ప‌క్షానికి ధీటైన ప్ర‌తిప‌క్షం లేద‌నే చెప్పాలి. దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి ఏపీలో ఉంది. తెలుగుదేశం ప్ర‌భుత్వానికి త‌ర‌చూ గ‌ట్టి స‌వాళ్లు విసిరే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. పోటాపోటీగా రెండు రాజ‌కీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్న‌ప్పుడు.. రెండుపార్టీల‌ను అభిమానించే వారు త‌మ అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు.

అస‌లు కంటే కొస‌రు ఎక్కువ‌న్న‌ట్లుగా ఇరు పార్టీల అధినేత‌లు ఎలా ఉన్నా.. వారిని విప‌రీతంగా అభిమానించే వారు త‌మ త‌మ అభిమానాల్ని చాటి చెప్పేందుకు వీలుగా ఎవ‌రికి వారు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

గ‌తంలో ఇలాంటి అభిమానాలు ప్ర‌ద‌ర్శించుకోవ‌టానికి స‌రైన వేదిక‌లు ఉండేవి కాదు. ర‌చ్చబండ ద‌గ్గ‌రో.. అయిన వాళ్ల ద‌గ్గ‌రో.. లేదంటే ప‌ది మంది జ‌మ అయ్యే ఫంక్ష‌న్ల‌ లోనో త‌మ అభిమానాల్ని మాట‌ల రూపంలో ప్ర‌దర్శించుకునే అవ‌కాశం ఉండేది. ఇలాంటి ముచ్చ‌ట్లు దాదాపుగా మీడియాలోకి వ‌చ్చేవి కావు. కానీ .. సోష‌ల్ మీడియా ఎంట్రీ పుణ్య‌మా అని ఎవ‌రికి వారు త‌మ‌ లోప‌లి భావాల్ని విప్పి చెప్పుకోవ‌టం.. తాను అభిమానించే వారికి సంబంధించిన వాద‌న‌ల్ని వినిపించుకునే అవ‌కాశం ల‌భించింది.

కాస్తంత భిన్నంగా ఆలోచించే తీరు.. లాజిక్కుల‌తో కొట్టేలా వాద‌న‌లు వినిపించ‌టం అంత‌కు మించిన క్రియేటివిటీ క‌ల‌గ‌లిపి త‌మ భావాల‌కు అక్ష‌రాలు.. ఛాయాచిత్రాల (ఫోటోలు)తో తామేం అనుకుంటున్నామో అంద‌రికి చెప్పే త‌హ‌త‌హ పెరిగిపోయింది. ఫేస్ బుక్‌.. వాట్స‌ప్‌.. ట్విట్ట‌ర్ లాంటి ప్ర‌చార మాధ్య‌మాలు విస్తృతంగా జ‌నం వినియోగిస్తున్న వేళ‌.. వాటి ప్ర‌భావానికి లోన‌య్యే అవ‌కాశం ఉండ‌టంతో ఎవ‌రికి వారు.. త‌మ క్రియేటివిటీని రంగ‌రించి.. తాము అభిమానించే వారిని ఆకాశానికి ఎత్తేయ‌టం.. తాము వ్య‌తిరేకించేవారిని పాతాళానికి తొక్కేసే తీరులో పోస్టింగులు పెట్ట‌టం కామ‌న్ అయిపోయింది. మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా.. రాజ‌కీయాల విష‌యానికి అయితే.. ఇది మ‌రికాస్త ఎక్కువైంది.

ఇది ఇప్పటికిప్పుడు వ‌చ్చిందేమీ కాదు. గ‌డిచిన కొన్నేళ్లుగా న‌డుస్తున్న‌దే. ఆ మాట‌కు వ‌స్తే.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ విజ‌యం వెనుక సోష‌ల్ మీడియా చ‌లువ చాలానే ఉంది. మోడీ కానీ ప్ర‌ధాన‌మంత్రి అయితే.. ప‌న్ను పోటు త‌గ్గిపోయి లీట‌రు పెట్రోల్ రూ.30 - 40 మ‌ధ్య‌కు ఏ విధంగా తీసుకురావొచ్చన్న అంశంపై చాలానే పోస్టింగులు హ‌డావుడి చేశాయి. తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా.. అనుకూలంగా సోష‌ల్ మీడియాలో పెద్ద యుద్ద‌మే జ‌రిగింది. ఆ సంద‌ర్భంలోనూ రెండుగా విడిపోయి.. ఎవ‌రికి వారు సూటిపోటీ మాట‌లు అనుకున్న ప‌రిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలుగోళ్ల‌కు ఉన్న మ‌హా చిత్ర‌మైన ల‌క్ష‌ణం.. ఎట‌కారం. ఒక త‌మిళుడికి.. క‌న్న‌డిగ‌కు.. మ‌రాఠీతో పోల్చిన‌ప్పుడు తెలుగోళ్ల‌లో ఎట‌కారం పాళ్లు కాస్త ఎక్కువ‌. ముక్కుముఖం తెలీని వారితో మాట్లాడేట‌ప్పుడు సైతం.. త‌మకు స‌హ‌జ‌సిద్ధంగా ఉండే ఎట‌క‌రాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. నిజానికి ఎట‌కారం ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌న్న లోతుల్లోకి వెళితే.. తెలుగోళ్ల‌కు త‌ర‌త‌రాల నుంచి వ‌స్తున్న‌హాస్య చ‌తుర‌త‌కు ఫైన‌ల్ ప్రొడ‌క్ట్ గా ఈ ఎట‌కారాన్ని చెప్పాలి. ఎవ‌రికి లేనిది తెలుగోళ్ల‌లోనే క‌నిపించే ఈ ఎట‌కారం రోజులు గ‌డుస్తున్న కొద్దీ వేర్వేరు రూపాల్లో ద‌ర్శ‌న‌మిస్తుంది. తెలుగోళ్ల‌కు స‌హ‌జ‌సిద్దంగా ఉండే ఎట‌కారాన్ని సాటి తెలుగువాడు గుర్తించ‌రా అంటే గుర్తిస్తార‌నే చెప్పాలి. కానీ.. మారిన కాలానికి త‌గ్గ‌ట్లు.. కొంద‌రిలో ఇలాంటివి భ‌రించ‌లేని ప‌రిస్థితి.

ఎందుకిలా అంటే.. దూకుడు రాజ‌కీయాల్లో ఎవ‌రూ త‌మ‌కు జ‌రిగే న‌ష్టాన్ని భ‌రించ‌లేక‌పోతున్నారు. చిన్న‌పాటి డ్యామేజ్ సైతం త‌మ‌కు అంతిమంగా భారీ న‌ష్టాన్ని చేస్తుంద‌న్న అభిప్రాయాన్ని పార్టీలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే.. సోష‌ల్ మీడియా చూపించే ప్ర‌భావం అలాంటిది. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నిలిచే ముద్ర‌ల‌తో రాజ‌కీయంగా త‌మ‌కు భారీ న‌ష్టం వాటిల్లే వైనాల‌పై క‌ర‌కుగా ఉండే తీరు అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇక్క‌డ వినిపించే రెండు వాద‌న‌లు ఏమిటంటే.. ఉత్త ఎట‌కారానికే ప్ర‌భుత్వాలు సీరియ‌స్ అయిపోయి కేసులు పెట్టాలా? అన్న‌ది ఒక‌టైతే.. ఏదైనా హ‌ద్దుల్లో ఉండాలే కానీ.. హ‌ద్దులు దాట‌కూడ‌ద‌న్న‌ది రెండో వాద‌న‌.

ఈ రెండింటిని చూసే కోణానికి త‌గ్గ‌ట్లే విష‌యం క‌నిపిస్తుంది. ఎట‌కారాన్ని ఎట‌కారంగా చూడొద్దా? ఆ మాత్రం హాస్య‌ప్రియ‌త్వం ఉండ‌దా? అని కొంద‌రు అంటుంటే.. ఎట‌కారం ఎంత‌వ‌ర‌కో అంత వ‌ర‌కూ ఓకే కానీ.. మ‌రీ శృతిమించి రాగాన ప‌డి.. దారుణ‌మైన డ్యామేజ్ జ‌రుగుతుంటే.. చూస్తూ ఉరుకోవాలా? ఎట‌కారం స్థాయిల్ని చెప్పేలా చ‌ట్టాలు ఉన్న‌ప్పుడు.. వాటి ప‌ని అవి చేసుకుంటూ పోవా? అన్న‌ది మ‌రో వాద‌న‌. మిగిలిన వారితో పోలిస్తే.. తెలుగోళ్ల‌కు దేవుడిచ్చిన హాస్య‌ప్రియ‌త్వం.. ఎట‌కారాల్నివ‌దిలేయాలా? అంటూ ప్ర‌శ్నించే వారూ లేక‌పోలేదు.

ఈ ఇష్యూకు సంబంధించి అంతిమంగా చెప్పేదేమిటంటే.. ఎట‌కారాన్ని ఎట‌కారంగా చూడ‌లేని ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు..వాటిని రిసీవ్ చేసుకునే వారి మ‌న‌సుల్ని తీవ్రంగా గాయ‌ప‌ర్చేలా (చ‌ట్ట‌ప్రకారం) ఉన్న‌ట్లుగా ఫీల్ అవుతున్న‌ప్పుడు త‌మకు స‌హ‌జ‌సిద్ధంగా వ‌చ్చే వాటిని త‌గ్గించుకోవాల్సిందే. కాకుంటే.. ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏమిటంటే.. ఎట‌కారాన్ని (అదే రూపంలో ఉన్నా) భ‌రించ‌లేమ‌ని ఫీల‌యిన‌ప్పుడు.. వారు కూడా దాన్ని వ‌దిలేయాల్సి ఉంటుంది. ఇవాళ వాడ‌కున్నా.. రేపొద్దున్న దాని అవ‌స‌రం వ‌చ్చిన వేళ‌.. ఎట‌కార‌పు అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీస్తామంటే కుద‌ర‌దు. ఎందుకంటే.. ఇవాళ మ‌న‌కు నొప్పి క‌ల్పించిన అంశాన్నే.. రేపొద్దున మ‌నం అస్త్రంగా వాడ‌తామంటే.. ఎదుటోళ్లు కూడా అలానే ఫీల్ అవుతార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఎందుకంటే.. రూల్ ఎప్పుడూ రూల్ గా ఉంటుంది మరి. కాకుంటే రూల్ రూళ్ల క‌ర్ర‌ను తీసేట‌ప్పుడు వ‌ర్త‌మానాన్నే కాదు.. భ‌విష్య‌త్తును కూడా దృష్టిలో పెట్టుకొని వాడితే.. బాగుంటుంది.

ఎందుకిలా అంటే.. ఎవ‌రేం చేసినా ప్ర‌జ‌లు ఓ కంట క‌నిపెడుతూ ఉంటారన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఇదే స‌మ‌యంలో.. మారిన ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా.. తెలుగోళ్లు త‌మకు స‌హ‌జ‌సిద్ధంగా వ‌చ్చే హాస్య‌ప్రియ‌త్వం.. ఎట‌కారాల విష‌యం కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎందుకంటే.. మ‌నం తీసుకున్న లైట్ గా ఎదుటోళ్లు లైట్ తీసుకోక‌పోవ‌చ్చు. అలాంట‌ప్పుడు చ‌ట్టం ఎంట‌రై.. చుక్క‌లు చూపిస్తోంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఉత్సాహంతో కొంద‌రు.. అత్యుత్సాహంతో మ‌రికొంద‌రు అల‌వోక‌గా పెట్టే సోష‌ల్ పోస్టింగుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/