Begin typing your search above and press return to search.

బాబూ...జ‌గ‌న్ పై అస‌భ్య పోస్టు పెడితే ఓకేనా!

By:  Tupaki Desk   |   21 Aug 2017 5:07 AM GMT
బాబూ...జ‌గ‌న్ పై అస‌భ్య పోస్టు పెడితే ఓకేనా!
X
రాజ‌కీయంగా ఎలాంటి అనుభవం లేకుండానే - ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డిపోయి ప‌రోక్షంగా పొలిటిక‌ల్‌గా ఎంట్రీ ఇచ్చిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్ కు నోరే స‌రిగా తిర‌గ‌ని వైనంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే నెటిజ‌న్ల మ‌న‌సుల‌ను గెలుచుకునే ప‌నిని వ‌దిలేసిన టీడీపీ సర్కారు... సోష‌ల్ మీడియాలో ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా త‌మ పార్టీ నేత‌ల‌ను దుమ్మెత్తిపోస్తారా? అంటూ ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేసింది. సోష‌ల్ మీడియా హ‌డ‌లెత్తిపోయేలా అరెస్టుల ప‌ర్వానికి తెర తీసింది. అయితే చ‌ట్టంలోని నిబంధ‌న‌ల‌ను తామెక్క‌డా అతిక్ర‌మించ‌లేద‌న్న సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల స‌మాధానాల‌తో త‌ల ప‌ట్టుకున్న బాబు స‌ర్కారు ఆ త‌ర్వాత కాస్తంత స్పీడు త‌గ్గించింది. అయితే కొన్నాళ్ల క్రితం సోష‌ల్ మీడియాపై జ‌రిగిన దాడిని జ‌నం మ‌రిచిపోతున్న వేళ‌... బాబు స‌ర్కారు మ‌రోమారు సోష‌ల్ మీడియాపై క‌త్తి దూసింది.

ఈ ఘ‌ట‌న మ‌రెక్క‌డో జ‌ర‌గ‌లేదు... సాక్షాత్తు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిని ద‌శాబ్దాలుగా గెలిపిస్తూ వ‌స్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగింది. ఆ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... సోష‌ల్ మీడియాలో త‌మకు నచ్చ‌ని నేత‌ల‌పై విమ‌ర్శ‌లు సంధిస్తున్న నెటిజ‌న్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలో ఏపీలో విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ టీడీపీ సింప‌థైజ‌ర్‌ గా ఉన్న ఓ వ్య‌క్తి అస‌భ్య‌క‌ర పోస్టును సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడ‌ట‌. ఈ త‌ర‌హా వ్య‌క్తులు తాము పోస్ట్ చేసిన అంశాన్ని సోష‌ల్ మీడియాలో వీల‌యినంత మందికి చేర‌వేస్తున్న వైనం మ‌న‌కు తెలిసిందే. ఇదే క్ర‌మంలో ఈ పోస్టును చూసిన బ‌స‌వ‌రాజు ఘాటుగా స్పందించారు. అయినా బ‌స‌వ‌రాజు ఎక్క‌డివారో చెప్ప‌లేదు క‌దూ. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని శాంతిపురం మండ‌లం కాలిగానూరుకు చెందిన బ‌స‌వ‌రాజుకు... వైసీపీ అన్నా - వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నా చాలా అభిమాన‌మ‌ట‌.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌ పై పోస్టు అయిన అస‌భ్య‌క‌ర‌మైన పోస్టుపై ఘాటుగా స్పందించిన అత‌డు... ఆ త‌ర‌హా పోస్టులు స‌రికావ‌ని పేర్కొన్న‌ప్ప‌టికీ టీడీపీ సింప‌థైజ‌ర్ దానిని తొల‌గించ‌లేద‌ట‌. దీంతో చిర్రెత్తుకొచ్చిన బ‌స‌వ‌రాజు... జ‌గ‌న్‌ పై పోస్ట్ అయిన అస‌భ్య‌క‌ర పోస్టుకు ప్ర‌తిగా టీడీపీ అధినేత ఫొటోకు ఏదో ట్యాగ్ త‌గిలింది తాను ఓ అస‌భ్య‌క‌ర పోస్టును సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడ‌ట‌. అంతే... విష‌యం తెలుసుకున్న కుప్ప పోలీసులు వెనువెంట‌నే రంగంలోకి దిగిపోయారు. బెంగ‌ళూరులో టైల‌ర్‌ గా జీవ‌నం సాగిస్తున్న బ‌స‌వ‌రాజుకు ఫోన్ చేసి మ‌రీ శాంతిపురం పిలిపించార‌ట‌. నిన్న మ‌ధ్యాహ్నం శాంతిపురం చేరుకున్న బ‌స‌వ‌రాజును వెంట‌నే లాక‌ప్‌ లో మూడు గంట‌ల పాటు కూర్చోబెట్టి ఆ త‌ర్వాత‌... సీఐ పిలుస్తున్నారంటూ కుప్పంకు త‌ర‌లించి అక్క‌డి నుంచి అదే నియోజ‌క‌వ‌ర్గంలోని గుడుప‌ల్లె పోలీస్ స్టేష‌న్‌ కు త‌ర‌లించి వివిధ ర‌కాలుగా బెదిరించి ఎప్పుడో రాత్రి వేళ విడిచిపెట్టార‌ట‌. ఇంత జ‌రిగినా కూడా బ‌స‌వ‌రాజు ఏమాత్రం బెదిరిపోలేద‌ట‌.

అయినా ముందుగా జ‌గ‌న్‌ పై అస‌భ్య‌క‌ర పోస్టు చేసిన వ్య‌క్తిని ఏం చేశార‌ని నిల‌దీశార‌ట‌. టీడీపీ సింప‌థైజ‌ర్ పెట్టిన పోస్టుకు బ‌దులుగానే తాను ఆ పోస్టును పెట్టాన‌ని, వివాదం రేపిన వ్య‌క్తిని వ‌దిలేసి త‌న‌ను మాత్రం బెదిరిస్తే బాగోద‌ని కూడా అత‌డు కాస్తంత గట్టిగానే బ‌దులిచ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో అత‌డి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక పోలీసులు అత‌డిని వ‌దిలిపెట్టినట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బ‌స‌వ‌రాజు సంధించిన ప్ర‌శ్న‌ల‌తో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత హోదాలో ఉన్న జ‌గ‌న్‌ కు కేబినెట్ మినిస్ట‌ర్ ర్యాంకు ఉంది. మ‌రి పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన టీడీపీ స‌ర్కారు... కేబినెట్ ర్యాంకులో ఉన్న జ‌గ‌న్ గౌర‌వ మ‌ర్యాద‌ల‌ను కూడా కాపాడాల్సిందే క‌దా. అయితే ఇందుకు విరుద్ధంగా వ్య‌వ‌హరిస్తున్న టీడీపీ స‌ర్కారు... త‌న పార్టీకి చెందిన వారిపై అస‌భ్య పోస్టుల‌పైనే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.... ఇత‌ర పార్టీల నేత‌ల‌పై నెటిజ‌న్లు ఎంత‌టి అస‌భ్య పోస్టులు పెట్టినా ప‌ట్టించుకునే స్థితిలో లేద‌న్న వాద‌న ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.