Begin typing your search above and press return to search.

144 సంస్థల్లో 123 మావేనంటున్న టీ సర్కార్‌?

By:  Tupaki Desk   |   8 July 2015 4:55 AM GMT
144 సంస్థల్లో 123 మావేనంటున్న టీ సర్కార్‌?
X
రాష్ట్ర విభజనకు సంబంధించి పదో షెడ్యూల్‌ పంచాయితీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఈ షెడ్యూల్‌లోని 144 సంస్థలు ఉమ్మడి సంస్థలని.. వీటిని రెండు రాష్ట్రాలు కలిపి నిర్వహించాలన్నది విభజన చట్టం చెబుతుంటే.. అందులోని 123 సంస్థలు తమకు చెందినవని.. వాటి సేవలు కావాలంటే ఫీజు చెల్లించి మరీ సేవలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు చెప్పటంపై ఏపీ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

విభజన చట్టంలోని ఉమ్మడి రాజధానిలో భాగంగా పదో షెడ్యూల్‌లోని సంస్థల విషయంలో తమకు న్యాయం చేయాలని ఏపీ వాదిస్తోంది. టీ సర్కారు చెబుతున్న 123 సంస్థల్లో ఏపీకి భాగస్వామ్యం ఉందన్న విషయంపై ఆదేశాలు ఇవ్వాలని ఏపీ సర్కారు కోరుకుంటోంది. దీనిపై ఇప్పటివరకూ ఏపీ సర్కారు పెద్దఎత్తున పోరాటం చేయలేదన్న విమర్శ వినిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కళ్లు తెరిచిన ఏపీ సర్కారు.. అడుగులు మందుకు వేస్తుందని చెబుతున్నారు.

ఇప్పుడున్నట్లుగానే మొదటే వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్న భావన వ్యక్తమవుతోంది. ఇక.. ఉమ్మడి సంస్థల్లోని ఏపీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఏపీ సర్కారు వాదిస్తోంది.తాజాగా ఈ అంశాల్ని రాష్ట్రపతి ప్రణబ్‌ దృష్టికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు తీసుకెళ్లారు. మరి.. దీనిపై రాష్ట్రపతి ఏం స్పందిస్తారో..? కేంద్రం ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి. పంచాయితీలతోనే కాలం గడిచిపోతుంటే.. పాలన ఎప్పటికి మొదలవుతుంది..?