Begin typing your search above and press return to search.

హైకోర్టులో ఏపీ సర్కారు నోట పొరపాటు మాట

By:  Tupaki Desk   |   22 March 2016 4:30 AM GMT
హైకోర్టులో ఏపీ సర్కారు నోట పొరపాటు మాట
X
రోజా ఇష్యూలో బాబు సర్కారు మొండిగా వ్యవహరించకూడదని డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది. వెనక్కి తగ్గినా.. అధికాపక్షానిదే పైచేయిగా కనిపించాలన్నట్లుగా ఏపీ సర్కారు వ్యవహరించటం కనిపిస్తుంది. రోజా సస్పెన్షన్ వ్యవహారంపై హైకోర్టులో జరిగిన వాదనలు చూసినప్పుడు.. ఈ తీరు ఏపీ సర్కారులో స్పష్టంగా కనిపించింది. సత్ ప్రవర్తన లేని ఒక సభ్యుడి విషయంలో చర్యలు తీసుకోవటం తప్పు ఎలా అవుతుందన్న విషయాన్ని బలంగా వాదిస్తూనే.. సభ్యుడిపై చర్యలు తీసుకునే క్రమంలో పొరపాటు సెక్షన్ ను ఉదహరించిన విషయాన్ని అంగీకరించటం గమనార్హం.

అయితే.. అలాంటి పొరపాటు ఆధారంగా చేసుకొని.. తప్పు చేసిన సభ్యులు తప్పించుకోకూడదన్న వాదనను వినిపించి కోర్టు మనసును గెలుచుకునే ప్రయత్నం చేసింది. రోజా ఇష్యూలో హైకోర్టులో ఏపీ సర్కారు తాజా వాదన చూస్తే.. తాము న్యాయవ్యవస్థతో గొడవ పెట్టుకోవాలన్న ఉద్దేశం తమకు లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూనే.. సాంకేతికంగా జరిగిన తప్పును ఆధారంగా చేసుకొని తప్పు చేసిన వాళ్లు తప్పించుకునే అవకాశం ఇస్తారా? అంటూ సూటిప్రశ్నను సంధించింది.

రూల్ ను తప్పుగా ప్రస్తావించినంత మాత్రాన తప్పు చేసిన సభ్యుడ్ని ఏడాది పాటు సభ సస్పెండ్ చేసే అధికారం ఉందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలన్న విషయాన్ని కోరటం ద్వారా.. హైకోర్టు తుదితీర్పులో తాము చేసింది కరెక్టేనని చెప్పుకునే ప్రయత్నాన్ని ఏపీ సర్కారు షురూ చేసిందని చెప్పొచ్చు. రోజాపై సస్పెన్షన్ వేటు సందర్భంగా ప్రస్తావించిన రూల్ తప్పు అన్న విషయాన్ని అంగీకరించిన ఏపీ సర్కారు.. రోజాను తాము వ్యక్తిగత లక్ష్యంగా చేసుకోలేదన్న మాటను చెప్పుకునేందుకు ప్రయత్నించింది.

ఇదే సమయంలో కోర్టు అడిగిన ఒక ప్రశ్నకు ఏపీ సర్కారు తరఫు న్యాయవాది ఇచ్చిన సమాధానం చూస్తే.. రోజా విషయంలో వెనక్కి తగ్గి గెలవటానికి ఏపీ సర్కారు సిద్ధమైందని చెప్పొచ్చు. రోజా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబితే సస్పెన్షన్ ను వెనక్కు తీసుకునే అవకాశం ఉందా? అని డివిజన్ బెంచ్ ప్రశ్నిస్తే.. ప్రభుత్వ తరఫు న్యాయవాది అంగీకరించటమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే.. రోజా వ్యవహారంలో తాము రూల్ ని తప్పుగా ప్రస్తావించిన దానికి రోజా సారీతో ఈ ఇష్యూను ముగించాలన్నట్లుగా ఏపీ సర్కారు ఉన్నట్లు కనిపిస్తోంది.