Begin typing your search above and press return to search.

'స్విస్‌'లో లాభాపేక్షేమీ లేదంటున్న ఏపీ!

By:  Tupaki Desk   |   21 Sep 2016 5:42 AM GMT
స్విస్‌లో లాభాపేక్షేమీ లేదంటున్న ఏపీ!
X
న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించి నిర్వ‌హించిన స్విస్ చాలెంజ్ ప‌ద్ద‌తి టెండ‌ర్ల‌కు సంబంధించి హైకోర్టులో సుదీర్ఘ వాద‌న‌లు సాగుతున్నాయి. అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించిన టెండ‌ర్ల‌లో పాలుపంచుకునే అర్హ‌తే లేని ఓ కాంట్రాక్ట‌ర్ వేసిన పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు... ఈ పద్ద‌తిపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సింగ‌పూర్ కంపెనీలు కోట్ చేసిన ధ‌ర‌ల‌ను బిడ్డ‌ర్ల‌కు తెల‌ప‌కుండా టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను ఎలా నిర్వ‌హిస్తార‌ని ధ‌ర్మాస‌నం ఏపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది. అంతేకాకుండా టెండర్ల‌లో పాలుపంచుకునేందుకు ముందుకు వ‌చ్చే ప్ర‌తి కాంట్రాక్ట‌ర్ కు సింగ‌పూర్ కంపెనీ కోట్ చేసిన ధ‌ర‌ల‌ను వెల్ల‌డించాల్సిందేన‌ని తేల్చిచెప్పింది. ఈ క్ర‌మంలో నిన్న జ‌రిగిన విచార‌ణ‌లో ప్ర‌భుత్వం కీల‌క అంశాల‌ను కోర్టు ముందుంచింది. స్విస్ చాలెంజ్ ప‌ద్ద‌తిలో తాము ఎలాంటి లాభాపేక్ష లేకుండానే చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని తెలిపింది.

ఈ మేరకు ప్ర‌భుత్వ త‌ర‌ఫున ఈ విచార‌ణ‌కు హాజ‌రైన అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ ద‌మ్మాల‌పాటి శ్రీ‌నివాస్ త‌న‌దైన శైలిలో వాద‌న‌లు వినిపించారు. అమ‌రావ‌తి నిర్మాణం ద్వారా యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌నే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని ఆయ‌న వివ‌రించారు. ఒరిజిన‌ల్ ప్రాజెక్ట్ ప్రొపోనెంట్ (ఓపీపీ)గా ఉన్న సింగ‌పూర్ క‌న్సార్టియం ప్ర‌భుత్వానికి ఎంత మేర రెవెన్యూ షేర్ ఇవ్వ‌నుంద‌న్న విష‌యానికి ఎలాంటి ప్రాధాన్యం లేద‌ని తెలిపారు. విదేశీ పెట్టుబ‌డులు - యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలే ఇందులో కీల‌క‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 2.5 ల‌క్ష‌ల ఉద్యోగాలిస్తామ‌ని సింగ‌పూర్ క‌న్సార్టియం ప్ర‌భుత్వానికి హామీ ఇచ్చింద‌ని తెలిపారు. అయితే సింగిల్ కాంట్రాక్ట‌ర్ వేసిన పిటిష‌న్ ను విచారించిన ఏక‌స‌భ్య ధ‌ర్మాస‌నం... స్విస్ చాలెంజ్ ప‌ద్ద‌తిని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంగా అభివ‌ర్ణించ‌డం ఎంత‌మాత్రం స‌రికాద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. రాజ‌ధానిలో కీల‌క ప్రాంతంగా ప‌రిగ‌ణిస్తున్న సీడ్ కేపిట‌ల్ లోని స్థ‌లాల‌ను... యువత‌కు ఉద్యోగాలు క‌ల్పించిన సంస్థ‌ల‌కే సింగ‌పూర్ క‌న్సార్టియం విక్ర‌యిస్తుంద‌ని చెప్పారు. త‌ద్వారా విదేశీ పెట్టుబ‌డులు పెద్ద ఎత్తున త‌ర‌లిరావ‌డానికి అవ‌కాశాలుంటాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.