Begin typing your search above and press return to search.

రక్తదానం కాస్తా వైరస్ దానమవుతుందేమో !

By:  Tupaki Desk   |   14 April 2020 4:30 PM GMT
రక్తదానం కాస్తా వైరస్ దానమవుతుందేమో !
X
కరోనా వ్యాపించడానికి అవకాశం ఉన్న అన్ని మార్గాలను ఏపీ సర్కారు పకడ్బందీగా నియంత్రిస్తోంది. తాజాగా ఈరోజు రక్తదానం క్యాంపులు - బ్లడ్ బ్యాంకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. లాక్ డౌన్ ముగిసే వరకు రాష్ట్రంలో ఎవరూ బ్లడ్ బ్యాంకులు దాతల నుంచి రక్తం సేకరించడాన్ని నిషేధించింది. రక్తం సేకరించే క్రమంలో దాతను పలువురు ముట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి సులువుగా సోకే వ్యాధి కాబట్టి ఎవరైనా ఇంకుబేషన్ పీరియడ్ లో ఉంటే అలాంటి వారు రక్తదానం చేస్తే ఇది విపరీత పరిణామాలకు దారితీస్తుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

బ్లడ్ బ్యాంకులో గాని - బయట గానీ - క్యాంపుల ద్వారా గానీ ఎక్కడా సేకరించకూడదు. ఎందుకంటే రక్తసేకరణ క్యాంపుల్లో సమూహాల ద్వారా వేగంగా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, తలసేమియా వంటి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారికి తరచుగా రక్తమార్పిడి అవసరం ఉంటుంది. అలాంటి వారికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తపడనుంది. రక్తమార్పిడి చేసుకునే వారికి - వీరికి రక్తం ఇచ్చేవారికి ప్రత్యేక పాసులు ఇవ్వనుంది. వైద్య శాఖ - పోలీసులు సమన్వయంతో ఇలాంటి వారికి ఇబ్బంది కలగకుండా సాయం చేస్తారు. అయితే... ఈ క్రమంలో ఎవరికైనా రక్త దాతల కొరత వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భం వస్తే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు.