Begin typing your search above and press return to search.

ముద్రగడ వెనుక జగన్ ఉన్నారా?

By:  Tupaki Desk   |   3 March 2016 4:44 AM GMT
ముద్రగడ వెనుక జగన్ ఉన్నారా?
X
ఏపీ సర్కారును తన ఉద్యమంతో వణికించిన మాజీ మంత్రి.. కాపు నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ సీన్లోకి రావటం తెలిసిందే. తాను చంద్రబాబు మాటల్ని విని మోసపోయినట్లుగా ముద్రగడ వ్యాఖ్యానించటం.. తమ హక్కుల సాధన కోసం ఉద్యమబాటను పడతానని ఆయన వెల్లడించిన నేపథ్యంలో.. బాబు సర్కార్ అలెర్ట్ అయిపోయింది. ఆమరణ నిరాహార దీక్షను చేపట్టి.. ఏపీ ప్రభుత్వానికి వణుకు తెప్పించటం.. మంత్రుల బృందం ఆయన ఇంటికి వెళ్లి.. ఆయన డిమాండ్లపై ప్రభుత్వ స్పందనను తెలిపి.. ఆయన్ను ఒప్పించి దీక్షను విరమించేలా చేయటం తెలిసిందే.

తన దీక్ష విరమణ సమయంలో.. తన డిమాండ్లపై ఏపీ సర్కారు ఇచ్చిన హామీలపై ముద్రగడ అప్పట్లో సంతృప్తిని వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించటంతోపాటు.. పరిష్కరిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అనుకున్న గడువు పూర్తి కాక ముందే.. ముద్రగడ మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేయటం.. ఉద్యమం చేస్తానన్న మాటను చెప్పటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశ్చర్యాన్ని.. ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

ముద్రగడ తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇచ్చిన గడువు పూర్తి కాకముందే మళ్లీ డెడ్ లైన్ పెట్టటం ఏమిటని బాబు ప్రశ్నిస్తున్నారు. ముద్రగడ వ్యవహారం చూస్తుంటే.. ఏపీ విపక్ష నేత జగన్ కోసమే ముద్రగడ లేఖ రాసినట్లుగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. లేఖలో వాడిన భాష ఏ మాత్రం హుందాగా లేదన్న మాటను మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో మాదిరి కాకుండా.. ముద్రగడ విషయంలో ఏపీ సర్కారు సీరియస్ గా ఉందని చెబుతున్నారు. ముద్రగడను అడ్డు పెట్టుకొని జగన్ రాజకీయంగా లబ్థి పొందాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేయటం చూస్తుంటే.. ఈసారి ముద్రగడ విషయంలో బాబు సీరియస్ గా ఉంటారన్న మాట బలంగా వినిపిస్తోంది.

మరోవైపు.. ముద్రగడ వైఖరి విస్మయాన్ని కలిగిస్తోంది. తన దీక్ష ద్వారా ఏపీ సర్కారుకు ముచ్చెమటలు పోయించిన ఆయన.. మంత్రుల బృందం నుంచి సరైన హామీలు లేకుండా నాడు దీక్ష విరమణకు ఓకే చెప్పేయటం ఒక ఎత్తు అయితే.. ఇచ్చిన గడువు పూర్తి కాకముందే మళ్లీ దీక్ష చేస్తానన్న మాట చెప్పటంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సర్కారు ఇచ్చిన హామీల గడువు ముగియటానికి సమయం ఉన్న నేపథ్యంలో. గడువు ముగిసిన తర్వాత ఉద్యమం చేయటం బాగుంటుందే తప్పించి.. నాలుగు రోజులకో మాట మాట్లాడటం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. కాపు నేతల డిమాండ్లను పరిష్కరించటానికి ఏపీ సర్కారు కొంత సమయం కోరటం.. అందుకు ముద్రగడ సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో.. ఆ గడువు పూర్తి అయ్యే వరకూ వెయిట్ చేయటం సబబు. ఒకవేళ.. మధ్యలోనే మళ్లీ ఉద్యమం అంటే ముద్రగడ తీరుపై సందేహాలు వ్యక్తం కావటం ఖాయం. ఆయన వెనుక జగన్ ఉన్నారంటూ ఏపీ సర్కారు చేస్తున్న ఆరోపణల్ని సైతం నమ్మాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ముద్రగడ ఏం చేస్తారో..?