Begin typing your search above and press return to search.

2017 జూన్ 2లోపు ఏపీకి వెళ్లినోళ్లంతా లోకలే

By:  Tupaki Desk   |   28 May 2016 5:44 AM GMT
2017 జూన్ 2లోపు ఏపీకి వెళ్లినోళ్లంతా లోకలే
X
విభజన నేపథ్యంలో తెర మీదకు వచ్చిన ఎన్నో చిక్కుముడులలో ఇప్పటికి ఒక కొలిక్కి రాని అంశాలెన్నో ఉన్నాయి. అన్నింటికి మించి.. ‘‘స్థానికత’’ అంశం మీద ఇప్పటికి స్పష్టత లేని సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో రాజధానిగా ఉన్న హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో ఉండటం.. రాజధాని నగరంలో పెద్ద ఎత్తున సీమాంధ్రులు నివాసం ఉన్న సంగతి తెలిసిందే. విభజన నేపథ్యంలో వారు ఏపీకి తిరిగి వచ్చేయాలంటూ విద్యా.. ఉద్యోగాలకు సంబంధించిన స్థానికత ఏమిటన్నది ఇప్పుడో సమస్యగా ఉంది.

దీనికి పరిష్కారంగా ఏపీ సర్కారు 2017 జూన్ 2 లోపుల సీమాంధ్రకు తరలి వచ్చే వారంతా ఏపీ స్థానికత వచ్చేలా నిర్ణయం తీసుకుంటూ ఒక ప్రతిపాదనను సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన పరిపాలనా ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. అయితే.. కేంద్రం దగ్గర ఈ ఫైల్ పెండింగ్ లో ఉన్న పరిస్థితి. ఏపీ సర్కారు ప్రతిపాదించిన అంశాల మీద పలు వివరణలు కోరిన కేంద్రం.. ఏపీ సర్కారు చెప్పిన సమాధానాలపై సంతృప్తి చెందినట్లుగా తెలుస్తోంది.

ఏపీ ప్రతిపాదనపై ప్రధాని మోడీ సంతకం చేసినట్లుగా చెబుతున్నారు. ఇక.. మిగిలింది రాష్ట్రపతి సంతకం మాత్రమేనని.. ఆ ప్రక్రియ పూర్తి అయి.. చట్టంగా మారటానికి రెండు.. మూడు వారాలకు మించి సమయం పట్టదని చెబుతున్నారు. రాష్ట్రపతి సంతకం మాత్రమే మిగిలిన ఉన్న నేపథ్యంలో.. 2017 జూన్ 2 నాటికి ఏపీకి వెళ్లిన వారంతా ఆంధ్రప్రదేశ్ స్థానికతను పొందే వీలుందని చెప్పొచ్చు. ఈ నిర్ణయంతో స్థానికతకు సంబంధించిన సందేహాలన్నీ తీరిపోయినట్లేనని చెప్పొచ్చు.