Begin typing your search above and press return to search.

పక్కరాష్ట్రపు చిక్కు: బాధ ఎవరిది? భారం ఎవరిది?

By:  Tupaki Desk   |   9 April 2015 2:30 PM GMT
పక్కరాష్ట్రపు చిక్కు: బాధ ఎవరిది? భారం ఎవరిది?
X
కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్నట్లుంది ఏపీలో చంద్రబాబు పరిస్థితి. విభజన వల్ల ఆర్థిక లోటుతో సతమతం అవుతున్న చంద్రబాబు తెలంగాణ సర్కారు ఇచ్చినట్లే ఆయా భత్యాలు ఇవ్వడంలో బాబు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఖరారులో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. దాని అమలు విషయంలోనూ ఇదే తీరు కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌కు సై అనడంతో ఫిబ్రవరి 9న జరిగిన ప్రభుత్వ-ఉద్యోగ సంఘాల ఒప్పందం మేరకు 43 శాతం ఫిట్‌మెంట్‌కు ఏపీ సర్కారు అంగీకారం తెలిపింది. ఆ సమయంలో ఏప్రిల్‌ వేతనం నుంచి పెరిగిన జీతం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసింది, వేతనాల్లో కలిపి ఇస్తామని ప్రకటించింది. కానీ ఏపీలో మాత్రం ఇంకా గందరగోళం కొనసాగుతోంది.

పెరిగిన ఫిట్‌మెంట్‌ వేతనం ఏప్రిల్‌ నెలతో పాటు అందుతుందనే ఆశతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగులను ప్రభుత్వం గందరగోళంలో పడేసింది. ఇప్పటివరకు ఎలాంటి ఫిట్‌మెంట్‌ విధి విధానాలు.. ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం జారీ చేయలేదు. మరోవైపు బకాయిల చెల్లింపుపైనా స్పష్టత లేకపోవడంతో.. ఈ బకాయిలను ఏ రూపంలో చెల్లిస్తారన్న విషయంపై ఉద్యోగుల్లో సందిగ్ధం నెలకొంది.

ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల ఒప్పందంలో 2014 జూన్‌2 నుంచి 43 శాతం ఫిట్‌మెంట్‌ అమల్లోకి వచ్చేలా నిర్ణయించారు. మరోవైపు.. జూన్‌ 2, 2014 - 31.03.2015 వరకు పెరిగిన మొత్తం బకాయిల కింద భవిష్యత్తులో ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇదే సమయంలో ఏప్రిల్‌ 2015 నుంచి మాత్రం పెరిగిన మొత్తాన్ని.. ఆ నెల వేతనంతో అంటే మే ఒకటో తేదీన చెల్లించే వేతనంతో కలిపి ఇచ్చేలా ఒప్పందం జరిగింది. కానీ ఇప్పటివరకు పీఆర్సీ ఒప్పందం విధి విధానాలను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేయలేదు. దీంతో మే ఒకటో తేదీన పెరిగిన వేతనం అందుకోవటం కష్టమనే వాదనలు తెరమీదకొస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం.. బకాయిల చెల్లింపుకు సంబంధించి రెండు లేదా మూడేళ్ల కాల పరిమితితో బాండ్లు ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. దీనిపై ఈనెల పదో తేదీన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉద్యోగ సంఘాలతో సమావేశమై చర్చించే అవకాశం ఉంది. కొంత ఆలస్యమైనా.. ఏప్రిల్‌ వేతనంతో పాటు పెరిగిన మొత్తాన్ని కూడా ఉద్యోగులకు అందేలా చూస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు.