Begin typing your search above and press return to search.

పడవ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన టీడీపీ

By:  Tupaki Desk   |   13 Nov 2017 9:50 AM GMT
పడవ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన టీడీపీ
X
కృష్ణానదిలో పడవ ప్రమాదం జరగడం... 19 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. తీవ్ర విషాధాన్ని మిగిల్చిన ఈ ప్రమాదం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందన్న సంగతి అడుగడుగునా కనిపిస్తోంది. అనుమతుల్లేని పడవలు... అందుకు అవకాశమిచ్చిన అధికారులు, నేతలు... తన శాఖలో ఏం జరుగుతోందో పట్టించుకోని మంత్రి.. అంతా కలిసి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. అయితే.... ఇంత పెద్ద ప్రమాదం జరిగినా గట్టిగా నిలదీసేవారు లేకపోవడంతో టీడీపీ ప్రభుత్వానికి - ప్రభుత్వ పెద్దలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా ఆ సమావేశాలను విపక్ష వైసీపీ బహిష్కరించడంతో పాలక టీడీపీ ఇలాంటి ఇబ్బందికర సమయంలో బతికి బయటపడిపోయింది.

నిజానికి ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సభ్యులు ఉండి ఉంటే సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేవారు. కానీ... విపక్షం సభకు రాకపోవడంతో పాలక పార్టీ ఒక సంతాప తీర్మానం చదివేసి, ఎక్స్ గ్రేషియా ప్రకటించేసి సరిపెట్టేసింది.

ప్రయివేటు పడవలు ఇష్టారాజ్యంగా కండిషన్లో లేకపోయినా తిప్పడం... పరిమితికి మించి పర్యాటకులను ఎక్కించడం నుంచి కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వరకు అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. పైగా ఈ పడవల కాంట్రాక్టుల విషయంలో కొందరు నేతల ప్రమేయం ఉందన్న ఆరరోపణలూ వినిపిస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో సభలో విపక్షం అనేది ఉంటే పాలక పక్షం ఇరకాటంలో పడేది. కానీ.... అదృష్ట వశాత్తు టీడీపీ ఈ సందర్భంలో సేఫ్ గా మిగిలిపోయింది.