Begin typing your search above and press return to search.

రాజధాని కూలీలకు వెయ్యి కోట్లు!

By:  Tupaki Desk   |   29 Jun 2015 11:11 AM GMT
రాజధాని కూలీలకు వెయ్యి కోట్లు!
X
నవ్యాంధ్ర రాజధానిలో రైతులకు భూమికి భూమి ఇచ్చింది. పదేళ్లపాటు వారికి కౌలు కూడా ఇస్తోంది. మరి, ఇక్కడ పని చేసే వ్యవసాయ కూలీల మాటేమిటి? ఇప్పటి వరకు వారికి పంటేల ఆధారం. అక్కడ కూలీ పనులు చేసుకుని పొట్ట పోసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ వ్యవసాయమే కనుమరుగు అవుతోంది. మరి వారికి ఉపాధి ఎలా? ఈ ప్రశ్న భూ సమీకరణ తొలి రోజుల్లోనే ఎదురైంది. అందుకే వారికి పదేళ్లపాటు జీవన భృతి ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.

నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించింది. మొత్తం రాజధాని పరిధిలో 34 వేల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారని గుర్తించింది. వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.2500 చొప్పున పదేళ్లపాటు జీవన భృతి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. జూలై ఒకటో తేదీ నుంచే వీరందరికీ జీవన భృతిని పంపిణీ చేయాలని వేగంగా కసరత్తు కూడా చేస్తోంది.

అంతేనా.. కొత్త రాజధాని నిర్మాణంలో నిపుణ కూలీల అవసరం కూడా ఉంది. అందుకే కూలీలకు జీవన భృతి ఇవ్వడంతోపాటు వారికి శిక్షణ ఇచ్చి రాజధానిలో పని కల్పించాలని కూడా భావిస్తోంది. వారికి ఇష్టమైన రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఒక బ్యాచ్‌కు రంగారెడ్డి జిల్లాలో శిక్షణ ప్రారంభమైంది. ఇందుకు ఒక్కొక్కరికి రూ.40 వేల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. దశలవారీగా అర్హులందరికీ శిక్షణ ఇచ్చి అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.