Begin typing your search above and press return to search.

ఈ 'దూకుడు' ఎవరి కోసం చంద్రబాబు..!

By:  Tupaki Desk   |   25 Jun 2015 4:37 AM GMT
ఈ దూకుడు ఎవరి కోసం చంద్రబాబు..!
X
విమర్శలు చేయాలి.. కానీ అవి ఆకట్టుకునేవిగా ఉండాలి. ప్రత్యర్థిని ఇరుకున పెట్టేవిగా ఉండాలి. వైరిపక్షం వారు సైతం నిజమే బాసూ.. అతగాడి మాటలో పాయింట్‌ ఉందన్నట్లుగా ఉండాలి. విమర్శ.. ఆరోపణ అర్థవంతంగా ఉండటమే కాదు.. వైరిపక్షాన్ని ఇబ్బంది పెట్టేదిగా ఉండాలే తప్ప దిగజారుడుతనంతో ఉండకూడదు. విద్వేషాల్ని రెచ్చగొట్టేదిగా ఉండకూడదు.

మరో కీలకమైన విషయం.. మన దగ్గర తప్పులు పెట్టుకొని బడాయి మాటలు అస్సలు కూడదు. సెక్షన్‌ 8 మీద ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్న ఏపీ అధికారపక్షం.. ఇవే మాటల్ని తాము అధికారంలో వచ్చిన రోజు నుంచే ఎందుకు చెప్పటం లేదన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పే నాధుడే కనిపించరు. ఓటుకు నోటు వ్యవహారం ముదిరి పాకాన పడిన తర్వాత కానీ.. సెక్షన్‌ 8 ఎందుకు గుర్తుకు రాలేదు.

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి అవమానం జరిగిన సమయంలోనో.. హైదరాబాద్‌లోని న్యాయమూర్తిపై కోడిగుడ్ల దాడి జరిగిన సమయంలోనో స్పందించని ఏపీ సర్కారు.. తన వరకు వచ్చేసరికి మాత్రం సెక్షన్‌ 8 అంటూ గావుకేకలు పెడుతూ.. పెడబబ్బలు పెడుతోందన్న విమర్శలు ఉన్నాయి.

విభజన చట్టంలోని అన్నీ అంశాలు అమలు కావాల్సిందేనన్న డిమాండ్‌లో ఎవరూ ఏమీ అనరు. కానీ.. అలాంటి మాట మొదటి నుంచే ఉండాలి తప్పించి.. రాజకీయ ప్రయోజనాల కోసం మధ్యలో రాలేదు. పలు వివాదాలకు సంబంధించి తెలంగాణ సర్కారు.. ఏపీ అధికారపక్షంపై చాలానే ఆరోపణలు చేసింది. అయితే.. వీటిని ఖండించేందుకు.. ధీటుగా సమాధానం చెప్పేందుకు ఏపీ నేతలు పలువురు రెఢీ అయితే.. వారిని వద్దని వారించింది చంద్రబాబే అన్న మాట ప్రచారంలో ఉంది.

తెలంగాణలో పార్టీ ఉందని.. తెలంగాణ అధికారపక్షంపై విరుచుకుపడితే రాజకీయ ఇబ్బందులు ఎదురువుతాయంటూ ఏపీ నేతల నోటికి పరిమితుల తాళాలు వేసేసిన చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఏపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి.

చిన్నప్పుడు మాటల్లేకుండా.. పెద్దయ్యాక మాటలు వచ్చేస్తే.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం లాంటివి సినిమాల్లో చూపించిన విధంగా.. ఇష్టారాజ్యంగా విమర్శలు చేయటం కనిపిస్తుంది. మాటల విషయంలో హద్దులు దాటితే ఇబ్బందులే. ఎందుకంటే.. ఇంతకాలం మౌనంగా ఉన్న వారు ఇప్పుడే నిద్ర లేచినట్లుగా వ్యవహరించటం అంత సబబుగా ఉండదు. సంయమనంతో వ్యవహరిస్తాం.. మీలా మేం దిగజారి మాట్లాడతాం లాంటి వ్యాఖ్యలు గతంలో చేసిన ఏపీ నేతలు.. ఇప్పుడు ఎందుకు విరుచుకుపడుతున్నారు.

అభ్యంతరకర వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నట్లు. ఆత్మ రక్షణలో పడినప్పుడు ఒకలా.. అలాంటి పరిస్థితి లేనప్పుడు మరోలా వ్యవహరించటం నేతలకు ఫర్లేదు కానీ.. సామాన్య ప్రజానీకం మాత్రం అందుకు సిద్ధంగా ఉండరన్న విషయం ఏపీ ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకుంటే మంచిది. తమకు ఇబ్బంది ఏర్పడితే గుర్తుకు వస్తే నిబంధనలు.. ప్రజలకు కలిగినప్పుడు స్పందించినప్పుడు మాత్రమే వారి మనసు దోచుకోగలరన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది. సెక్షన్‌ 8 అంటూ గావుకేకలు.. పెడబబ్బలు పెట్టే బదులు నిర్మాణాత్మకంగా తమ హక్కుల్ని సాధించే దిశగా ఏపీ సర్కారు వ్యవహరిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.