Begin typing your search above and press return to search.

అయేషా కేసుపై ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   5 Aug 2017 4:49 AM GMT
అయేషా కేసుపై ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం
X
తెలుగు ప్రాంతంలో సంచ‌ల‌నంగా మారిన అయేషా మీరా హ‌త్య కేసు విచార‌ణ విష‌యంలో ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఇప్ప‌టికే ఈ కేసు విచార‌ణ జ‌రిపి.. నిందితుడిగా ఒక‌రిని అదుపులోకి తీసుకొని దోషిగా నిర్దారించి మ‌రీ జీవిత‌ఖైదు వేసిన సంగ‌తి తెలిసిందే. ఏళ్ల‌కు ఏళ్లు శిక్ష అనుభ‌వించిన త‌ర్వాత‌.. స‌ద‌రు దోషి నిర్దోషి అన్న విష‌యాన్ని కోర్టు చెప్ప‌టం మ‌రో సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే.

ఇలా ప‌లు మ‌లుపులు తిరిగిన అయేషా మీరా హ‌త్య కేసును మ‌ళ్లీ విచారించాలంటూ ఏపీ స‌ర్కారు తాజాగా నిర్ణ‌యించింది. ఇందుకు సంబంధించి ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ ఈ సిట్ బృందానికి ప‌ర్య‌వేక్ష‌కునిగా ఉంటార‌ని పేర్కొంది. ఏపీ రాష్ట్ర డీజీపీ సిఫార్సుల మేర‌కు తాజా నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా వెల్ల‌డిచింది.

దాదాపు ప‌దేళ్ల కింద‌ట (2007లో) విజ‌య‌వాడ స‌మీపంలోని ఇబ్ర‌హీం ప‌ట్నంలోని ఒక కాలేజీలో ఎంసీఏ చ‌దువుతున్న అయేషా మీరు దారుణ హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ప్రైవేటు హాస్టల్ లో ఉన్న ఆమెను అర్థ‌రాత్రి వేళ అత్యంత కిరాత‌కంగా అత్యాచారం చేసి.. హ‌త్య చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఈ ఉదంతంపై ప‌లువురి మీద ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఒకద‌శ‌లో నాటి ఉప ముఖ్య‌మంత్రి కోనేరు రంగారావు మ‌న‌మ‌డు మీద కూడా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే.. అత‌డికి నార్కో టెస్టులు నిర్వ‌హించి.. అత‌నికి ఎలాంటి సంబంధం లేద‌ని తేల్చేశారు.

ఈ హ‌త్య కేసులో కీల‌క‌మైన లేఖ‌లోని ద‌స్తూరిని పోల్చి చూసేందుకు వేలాది మంది చేతి రాత‌ల్ని పోల్చి చూశారు. అనేక ఒత్తిళ్ల మ‌ధ్య ఈ కేసును విచారించిన‌ట్లుగా విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అనాసాగ‌రం గ్రామానికి చెందిన స‌త్యంబాబును ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివ‌ర‌కు ఈ కేసులో నిందితుడిగా అదుపులోకి తీసుకున్న స‌త్యంబాబును దోషిగా నిర్దారిస్తూ జీవిత‌ఖైదును విధించింది న్యాయ‌స్థానం.
ఇదిలా ఉంటే.. ఈ కేసు విచార‌ణ స‌రిగా జ‌ర‌గ‌లేదంటూ అయేషా త‌ల్లిదండ్రులు ఆరోపించారు. నిజ‌మైన నిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ వారు సుదీర్ఘ‌కాలంగా పోరాడారు. ఇదిలా ఉండ‌గా.. స‌త్యంబాబు త‌ర‌ఫున ఒక పిటీష‌న్ దాఖ‌లైంది. దీనిపై విచారించిన హైకోర్టు.. ఏళ్ల త‌ర్వాత స‌త్యంబాబును నిర్దోషిగా నిర్దారిస్తూ.. తీర్పును ఇచ్చింది.

దీంతో.. ఈ కేసును మ‌ళ్లీ విచారించాలంటూ అయేషా త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు ప‌దేళ్ల క్రితం జ‌రిగిన నేరానికి సంబంధించి మ‌రోసారి విచార‌ణ జ‌ర‌పాలంటూ ఏపీ స‌ర్కారు తాజాగా నిర్ణ‌యించింది. ఇందుకోసం సిట్ ను ఏర్పాటు చేశారు. మ‌రి.. ప‌దేళ్ల కింద‌ట జ‌రిగిత ఈ నేరానికి సంబంధించిన ఆధారాల్ని సిట్ సేక‌రిస్తుందా? అయేషాకు జ‌రిగిన అన్యాయాన్ని ఈ సిట్ అయినా ఒక కొలిక్కి తెస్తుందా? అన్న‌ది కాల‌మే స‌రైన స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌దేమో?