Begin typing your search above and press return to search.

ఒక లీకు.. నాలుగు వాద‌న‌లు.. ఏది నిజం

By:  Tupaki Desk   |   8 Jun 2017 4:20 AM GMT
ఒక లీకు.. నాలుగు వాద‌న‌లు.. ఏది నిజం
X
ఒక ఊహించ‌ని ప‌రిణామం జ‌రిగిన‌ప్పుడు.. అంద‌రి దృష్టి దాని మీద ప‌డిన‌ప్పుడు ప్ర‌భుత్వం ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. తాను చెప్పే ప్ర‌తి మాటా.. భ‌విష్య‌త్ రిఫరెన్స్ అవుతుంద‌న్న విష‌యాన్ని అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు. కానీ.. తాజా వైనాన్ని చూస్తే.. ఒక‌రి మాట‌తో మ‌రొక‌రికి సంబంధం లేన‌ట్లుగా మాట్లాడిన తీరు విస్మ‌యానికి గురి చేసేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కొత్త‌గా నిర్మించిన తాత్కాలిక స‌చివాల‌యం.. అసెంబ్లీ భ‌వ‌నాలు ఒక్క వ‌ర్షానికే ఆగ‌మాగ‌మైన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

అన్నింటికి మించి ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఛాంబ‌ర్‌ కు నీళ్లు రావ‌టంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. దీనికి తోడు లీకైన వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ కావ‌టంతో.. పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. ఇదిలా ఉంటే.. జ‌గ‌న్ ఛాంబ‌ర్లోకి నీళ్ల విష‌య‌మై ఏపీ స‌ర్కారు నాలుగు ర‌కాల వాద‌న‌లు వినిపించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక‌దానితో మ‌రొక‌టి సంబంధం లేకుండా.. ఎవ‌రికి వారుగా చేసిన ప్ర‌క‌ట‌న‌లు ఇప్పుడు గంద‌ర‌గోళంగా మార్చాయి.

జ‌గ‌న్ ఛాంబ‌ర్లో వ‌ర్ష‌పు నీటి లీకుల‌పై స్పందించిన ప్ర‌ముఖులంతా కీల‌కస్థానాల్లో ఉన్న వారే కావ‌టం ఒక విశేషం అయితే.. అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌లు సైతం మిగిలిన మూడు వాద‌న‌ల‌కు భిన్నంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఒక కీల‌క అంశంపై వేర్వేరుగా స్పందించిన వైనంలో ఎవ‌రి కుట్ర ఉందంటూ విప‌క్ష నేత‌లు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. నిజానిజాల మాట ఎలా ఉన్నా.. విప‌క్ష నేత ఛాంబ‌ర్ లీకుల‌పై ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున వినిపించిన నాలుగు వాద‌న‌లు చూస్తే.. ఒక ఘ‌ట‌న మీద ఇంత గంద‌ర‌గోళం ఎందుక‌న్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు. ఇంత‌కూ లీకుల‌పై వినిపించిన నాలుగు వాద‌న‌ల్ని చూస్తే..

వాద‌న నెంబ‌రు 1
(ఈ వాద‌న‌ను వినిపించింది సీఆర్డీఏ కార్య‌ద‌ర్శి స్థానంలో ఉన్న చెరుకూరి శ్రీధ‌ర్‌) (మంగ‌ళ‌వారం రాత్రి)
అసెంబ్లీ భ‌వ‌నంలోని ప్ర‌తిప‌క్ష నేత గ‌దికి ఎల‌క్ట్రిక‌ల్ కాండ్యూట్ పైపు ద్వారా నీరు వ‌చ్చింది. జ‌గ‌న్ చాంబ‌ర్లో విద్యుత్ ప‌నుల కోసం ఒక పైపును దించ‌టంతో పైక‌ప్పులో నుంచి ఆ పైపు ద్వారా కూడా నీరు వ‌చ్చింది. దాన్ని ఇంజ‌నీరింగ్ అధికారులు వెంట‌నే స‌రి చేశారు.నాలుగో బ్లాక్ లోని ఒక సెక్ష‌న్లో కిటీకి తెరిచి ఉంచ‌టంతో ఈదురు గాలుల కార‌ణంగా నీరు వ‌చ్చి చేరింది. భారీ వ‌ర్షంతో వ‌చ్చిన జ‌ల్లుతో నీరు వ‌చ్చింది.

వాద‌న నెంబ‌రు 2
(ఈ వాద‌న‌ను వినిపించింది అసెంబ్లీ కార్య‌ద‌ర్శి విజ‌య‌రాజు) (బుధ‌వారం ఉద‌యం)
విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ గ‌దిలోకి కిటికీల్లో నుంచి వ‌ర్ష‌పు జ‌ల్లు లోప‌లకు వ‌చ్చింది. అసెంబ్లీ భ‌వ‌నంలో ఎలాంటి లీకేజీలు జ‌ర‌గ‌లేదు.

వాద‌న నెంబ‌రు 3
(ఈ వాద‌న‌ను వినిపించింది ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌) (బుధ‌వారం మ‌ధ్యాహ్నం)
అసెంబ్లీ బిల్డింగ్ పైన ఉన్న పైపు క‌ట్ కావ‌టంతోనే విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఛాంబ‌ర్లోకి నీళ్లు వెళ్లింది. ఎవ‌రో కావాల‌నే పైపును క‌ట్ చేశారు. దీన్లో కుట్ర కోణం క‌నిపిస్తోంది. అన్ని పైపులూ బాగానే ఉన్న‌ప్పుడు.. ఈ ఒక్క పైపే ఎందుకు క‌ట్ చేయాల్సి వ‌చ్చింది?

వాద‌న నెంబ‌రు 4
(ఈ వాద‌న‌ను వినిపించింది మంత్రులు నారాయ‌ణ‌.. న‌క్కా ఆనంద్ బాబు) (బుధ‌వారం సాయంత్రం)
జ‌గ‌న్ ఛాంబ‌ర్‌ కు వెళ్లే ఏసీ పైపును కావాల‌ని క‌ట్ చేయించి రాద్దాంతం చేస్తున్నారు. రాజ‌ధానిలో ఏదో జ‌రిగిపోయింద‌న్న భ‌యభ్రాంతుల‌కు గురి చేస్తున్నారు. న‌వ‌నిర్మాణ దీక్ష స‌క్సెస్ కావ‌టంతో ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌కు గురి చేయ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/