Begin typing your search above and press return to search.

భ‌న్వ‌ర్‌ లాల్‌ పై బాబు కొరడా ఝుళిపించేశారుగా!

By:  Tupaki Desk   |   1 Nov 2017 4:18 AM GMT
భ‌న్వ‌ర్‌ లాల్‌ పై బాబు కొరడా ఝుళిపించేశారుగా!
X
టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా... అధికారుల‌కు హ‌డ‌లేన‌న్న వాద‌న గ‌తంలో బాగానే వినిపించింది. అయితే అధికార యంత్రాంగంపై అకార‌ణంగా విరుచుకుప‌డే మ‌న‌స్త‌త్వంతో లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌గా ఉంద‌న్న విష‌యాన్ని తెలుసుకున్న చంద్ర‌బాబు... ఇటీవ‌ల త‌న పంథాను మార్చేశారు. అధికారుల‌తో స‌ఖ్య‌త‌గా మెల‌గుతున్న‌ట్లు వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా చెప్పుకుంటూ వ‌చ్చారు. అయితే అది మాట‌ల వ‌ర‌కేన‌ని - అధికారుల‌పై ఆయ‌న తీరు ఏనాటికి మార‌దు - మార‌బోద‌ని తేలిపోయింది. ఓ అధికారిపై బాబు క‌క్ష గ‌ట్టారంటే... చాలా సింపుల్‌గానే కాకుండా సైలెంట్‌ గా ప‌నికానిచ్చేస్తార‌న్న వాద‌న లేక‌పోలేదు. ఇప్పుడు అలానే చ‌డీ చ‌ప్పుడు కాకుండా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిపై ఆయ‌న కొర‌డా ఝుళిపించేశారు. బాబు ఆగ్ర‌హానికి గురైన అధికారి సాదా సీదా అధికారి కాదు. తెలుగు నేల ఉమ్మ‌డి ఉన్న‌ప్ప‌డు రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధానాధికారిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి... రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కూడా అదే ప‌ద‌విలో కొన‌సాగడ‌మే కాకుండా రెండు రాష్ట్రాల‌కు కూడా ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా వ్య‌వ‌హ‌రించిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి భ‌న్వ‌ర్ లాల్‌. విధి నిర్వ‌హ‌ణ‌లో చాలా నిక్కచ్చిగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న పేరున్న భ‌న్వ‌ర్‌ లాల్‌ ను... కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కే ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా ఎన్నిక‌ల ప్రధానాధికారిగా కొన‌సాగించాల్సి వ‌చ్చింది.

అస‌లు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారిగా నియ‌మితుల‌య్యే అధికారులు... ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వంతోనే కాకుండా అటు కేంద్ర ప్ర‌భుత్వంతోనూ నిమిత్తం లేకుండా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కే వ్య‌వ‌హ‌రిస్తారు. అస‌లు వారి నియామ‌కంలోనూ కేంద్ర‌ - రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్ర‌మేయం ఏమాత్రం కూడా ఉండ‌దు. ఆయా రాష్ట్రాల‌కు ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ప‌ద‌వి భ‌ర్తీ మొత్తం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌రిధిలోనే జ‌రుగుతుంది. స‌ర్వీస్‌ లో అత్యంత నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని పేరున్న ముగ్గురు అధికారుల జాబితాను ఆయా రాష్ట్రాలు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపితే... ఆ జాబితాలోని అధికారుల స‌ర్వీస్ రికార్డుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించిన మీద‌టే ఆ ముగ్గురిలో ఒక‌రిని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నియ‌మిస్తుంది. స‌ద‌రు అధికారిని కేంద్ర ఎన్నిక‌ల సంఘం బ‌దిలీ చేయ‌మంటే త‌ప్పించి రాష్ట్ర ప్ర‌భుత్వాలు అస‌లు జోక్యం చేసుకునే అవ‌కాశమే లేదు. రాష్ట్రానికే కాదు కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యంలో వేలు పెట్ట‌డానికి సాహ‌సం చేయ‌దంటే... ఆ ప‌ద‌విలో కొన‌సాగుతున్న అధికారులు ఎంత‌టి నిజాయితీప‌రులో ఇట్టే చెప్పేయొచ్చు.

మ‌రి అలాంటి ప‌ద‌విని ఏళ్ల త‌ర‌బ‌డి మోస్తున్న భ‌న్వ‌ర్‌ లాల్ నిన్న ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘ ప్ర‌యాణాన్ని సాగించిన భ‌న్వ‌ర్‌ లాల్‌... రిటైర‌య్యే వ‌య‌సు రావ‌డంతో ఉద్యోగ విర‌మ‌ణ పొందారు. అయితే భ‌న్వ‌ర్ లాల్ అటు రిటైర్ అయ్యారో, లేదో... ఇటు బాబు ఆధ్వ‌ర్యంలోని ఏపీ స‌ర్కారు ఆయ‌న‌పై క‌త్తి దూసింది. ఉమ్మ‌డి రాష్ట్ర హ‌యాంలో హైద‌రాబాదు క‌లెక్ట‌ర్‌ గా ప‌నిచేసిన భ‌న్వ‌ర్‌ లాల్‌... ఆ ప‌ద‌వి నుంచి బ‌దిలీ అయిన త‌ర్వాత హైద‌రాబాదు క‌లెక్ట‌ర్‌ కు కేటాయించే ప్ర‌భుత్వ క్వార్ట‌ర్‌ ను ఖాళీ చేయ‌లేద‌ట‌. ఇదేమ‌ని అడిగినా... ఆయ‌న స‌మాధానం ఇవ్వ‌లేద‌ట‌. ఇలా దాదాపుగా ఆయ‌న ఆరేళ్ల పాటు వేరే హోదాలో ప‌నిచేస్తున్నా హైద‌రాబాదు క‌లెక్ట‌ర్ బంగ్లాను మాత్రం ఖాళీ చేయ‌లేదట‌. ఈ విష‌యంపై అప్ప‌టి నాడు అంత‌గా ప‌ట్టించుకోని ఉమ్మ‌డి రాష్ట్ర స‌ర్కారు ఆ త‌ర్వాత‌... కొన్నాళ్ల‌కు స‌ద‌రు క్వార్ట‌ర్‌ ను ఖాళీ చేయాల‌ని భ‌న్వ‌ర్‌ లాల్‌ ను కోరింది. అయితే ఆయ‌న ఆ క్వార్ట‌ర్‌ ను ఖాళీ చేయ‌క‌పోగా స‌ద‌రు నోటీసుల‌కు కూడా పెద్ద‌గా స్పందించ‌లేద‌ట‌. ఇక ఆ త‌ర్వాత ఆరేళ్ల‌కు ఎలాగోలా ఆయ‌న స‌ద‌రు క్వార్ట‌ర్‌ ను ఖాళీ చేయ‌డంతో పాటుగా త‌న‌కు కొత్త‌గా కేటాయించిన క్వార్ట‌ర్‌ కు మారిపోయారు.

అయితే ఆరేళ్ల పాటు హైద‌రాబాదు క‌లెక్ట‌ర్ క్వార్ట‌ర్‌ ను వాడుకున్నందుకు గానూ భ‌న్వ‌ర్ లాల్ అద్దె రూపేణా ప్ర‌భుత్వానికి 17 ల‌క్ష‌ల పై చిలుకు మొత్తం బాకీ ప‌డ్డార‌ట‌. ఈ మొత్తాన్ని చెల్లించాల‌ని కోరినా కూడా భ‌న్వ‌ర్‌ లాల్ నుంచి స్పంద‌న రాలేద‌ట‌. దీంతో మ‌రింత త‌గ్గిన ప్ర‌భుత్వం స‌ద‌రు మొత్తాన్ని 4.37 ల‌క్ష‌లకు త‌గ్గించేసి చెల్లించాల‌ని చెప్పింద‌ట‌. అప్ప‌టికి కూడా భ‌న్వ‌ర్‌ లాల్ నుంచి పెద్ద‌గా స్పంద‌న రాక‌పోవ‌డంతో ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యాన్ని మ‌రిచిపోయింది. అయితే ఇటీవ‌లి నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో అక్క‌డి డీఎస్పీ అధికార పార్టీకి వ‌త్తాసు ప‌లుకుతున్నార‌న్న కార‌ణంతో ఆయ‌న‌ను భ‌న్వ‌ర్ లాల్ కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌తో త‌ప్పించారు. నాడు భ‌న్వ‌ర్‌ లాల్ విప‌క్ష వైసీపీకి కొమ్ము కాస్తున్నార‌ని కూడా అధికార పార్టీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారిగా ఉన్న భ‌న్వ‌ర్‌ లాల్‌ ను ఏ ఒక్క మాట అన్నా మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న భావ‌న‌తో నాడు చంద్ర‌బాబు అండ్ కో మౌనం వ‌హించింది.

అయితే తెర వెనుక పెద్ద తతంగాన్నే న‌డిపిన బాబు స‌ర్కారు.. భ‌న్వ‌ర్‌ లాల్ ఇటు ప‌ద‌వీ విమ‌ర‌ణ చేయ‌గానే ఆయ‌న‌కు ఝ‌ల‌క్ ఇచ్చేలా ముందే ప‌థ‌క ర‌చ‌న చేసుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా నిన్న భ‌న్వ‌ర్‌ లాల్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌గానే.. ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దినేశ్ కుమార్ పేరిట మ‌రో జీవో జారీ అయ్యింది. నాడు ప్ర‌భుత్వానికి బాకీ ప‌డ్డ మొత్తాన్ని ఎందుకు చెల్లించ‌లేదంటూ భ‌న్వ‌ర్‌ లాల్‌ పై విరుచుకుప‌డింది. అన‌ధికారికంగా హైద‌రాబాదు క‌లెక్ట‌ర్ బంగ్లాను వాడుకున్నందుకు ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందేన‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా త‌న‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించిన భ‌న్వ‌ర్‌ లాల్ నుంచి ఆ మొత్తాన్ని వ‌సూలు చేయ‌డంతో పాటుగా ఆయ‌న‌పై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. అయినా ఇన్నేళ్ల పాటు స‌ర్వీసులో కొన‌సాగిన భ‌న్వ‌ర్‌ లాల్ అక్ర‌మాలు ఇప్పుడు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన మ‌రుక్ష‌ణ‌మే ఏపీ స‌ర్కారుకు గుర్తుకు రావ‌డం చూస్తుంటే... దీనిని క‌క్ష‌సాధింపు చ‌ర్య‌గానే ప‌రిగ‌ణించాల్సి వ‌స్తుంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎంత‌దాకా వెళుతుందో చూడాలి.