Begin typing your search above and press return to search.

రాజీనామా మైసూరాకు బాగానే గిట్టుబాటైంది

By:  Tupaki Desk   |   25 Jun 2016 5:57 AM GMT
రాజీనామా మైసూరాకు బాగానే గిట్టుబాటైంది
X
యూరోపియన్ యూనియన్ నుంచి బయటకొచ్చేసిన బ్రిటన్ వ్యవహారం( బ్రెగ్జిట్) వల్ల ఆ దేశానికి ఎంత లాభమో ఇంకా తెలియదు కానీ ఏపీ రాజకీయాల్లో అలాంటి ఎగ్జిట్ వల్ల మాత్రం ఓ నేతకు మంచి లాభమే కలిగింది. అవును... ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బయటకొచ్చేసిన మైసూరరెడ్డి వ్యవహారం(మెగ్జిట్) గిట్టుబాటయినట్లుగా ఉంది. వైసీపీని వీడిన ఆయన ఇంకా టీడీపీలో చేరకపోయినా టీడీపీ నుంచి మాత్రం బాగానే లాభం చేకూరింది. సీఎం చంద్రబాబు ఆయనపై కరుణ చూపారు. మైసూరా కుమారుడికి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు కేటాయించారు. ఇందుకు ఏపీ కేమినేట్ ఆమోద ముద్ర కూడా వేసింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం నిడుజువ్విలో 140 ఎకరాల భూమిని మైసూరా కుమారుడి సిమెంటు ఫ్యాక్టరీకి ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఆ ప్రాంతంలో ఉన్న విలువ ప్రకారం ఎకరం రూ.2.4 లక్షల చొప్పున భూమిని తేజ సిమెంట్స్ కు అప్పగించనున్నారు.

వైసీపీ అధినేత జగన్ తో విభేదించిన మైసూరారెడ్డి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జగన్ తీరును విమర్శిస్తూ ఆయన అప్పట్లో లేఖ రాశారు. అయితే.. మైసూరా వైసీపీకి రాజీనామా చేయడానికి కారణం ఆయన సిమెంటు ఫ్యాక్టరీ వ్యవహారమేనని వైసీపీ వర్గాలు అప్పుడే ఆరోపించాయి. మైసూరారెడ్డి రాజీనామా చేయడానికి కుమారుడి సిమెంట్స్ ఫ్యాక్టరీ భూముల వ్యవహరమే కారణమని అప్పట్లో పెద్దెత్తున విమర్శలు వచ్చాయి. వైసీసీలో ఉంటే భూములు ఇచ్చే ప్రసక్తే లేదని టీడీపీ పెద్దలు స్పష్టం చేయడ వల్లే మైసూరారెడ్డి రాజీనామా చేశారని అప్పట్లో వార్తాలు వచ్చాయి. వెళ్తూవెళ్తూ మైసూరారెడ్డి కూడా జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసి వెళ్లారు. మొత్తం మీద ఇప్పుడు మైసూరారెడ్డి కుమారుడికి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీకి ఏపీ ప్రభుత్వం భూములు ఇవ్వడంతో వైసీపీ ఆరోపణలకు నిజమేనన్నట్లు తేలింది.

వాస్తవానికి మైసూరారెడ్డి కుమారుడు సిమెంట్స్ ఫ్యాక్టరీ పెట్టుకునేందుకు ముఖ్యమంత్రిగా వైఎస్సే తొలుత బీజం వేశారని చెబుతారు. వైఎస్ హయాంలోనే భూకేటాయింపుల వరకు వచ్చినప్పటికీ అనుకోకుండా వైఎస్ మరణించడంతో అవి పెండింగులో ఉండిపోయాయి. తరువాత ప్రభుత్వాల నుంచి మైసూరా పని చేయించుకోలేకపోయారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం భూకేటాయింపులకు అంగీకరించినా వైసీపీ నుంచి వచ్చేయాలని మెలిక పెట్టడంతో మైసూరా రాజీనామా చేశారని చెబుతారు.