Begin typing your search above and press return to search.

ఏపీ స‌ర్కారు మ‌ళ్లీ జ‌గ‌న్‌ ను అవ‌మానించింది

By:  Tupaki Desk   |   5 Oct 2017 9:40 AM GMT
ఏపీ స‌ర్కారు మ‌ళ్లీ జ‌గ‌న్‌ ను అవ‌మానించింది
X
రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి వేరు...శత్రుత్వం వేరు. రాజకీయాల్లో పార్టీ నేత‌లుగా ప్ర‌త్య‌ర్థులుగా భావించ‌డం వ‌ర‌కు త‌ప్పు లేకున్నా....శ‌త్రువులుగా భావించిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తేనే...స‌ద‌రు నాయ‌క‌త్వంపై ఒక‌ర‌క‌మైన చుల‌కన భావ‌న ఏర్ప‌డుతుంది. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తాజాగా వ్య‌వ‌హ‌రించిన తీరు, ఆయ‌న‌కు అవ‌మానం చేసిన విధానం... పాల‌కుల‌పై ఇలాంటి అభిప్రాయ‌మే క‌లిగించేదిగా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేతగా వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డికి కేబినెట్ మంత్రితో స‌మాన‌మైన ప్రొటోకాల్ ఉంటుంది. నియ‌మిత షెడ్యూల్ ప్ర‌కారం ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల స‌మ‌యంలో తగు ఏర్పాట్ల‌ను ఇటు ప్ర‌భుత్వం అటు ప్రొటోకాల్ విభాగం చూడాల్సి ఉంటుంది. కానీ తాజాగా గుంటూరులో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వైఎస్‌ జగన్ వెళుతుండ‌గా అలాంటి `త‌ప్ప‌నిస‌రి ఏర్పాట్లు` ఏవీ జ‌ర‌గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. గుంటూరుకు వెళ్లేందుకు గ‌న్న‌వ‌రం విమానశ్ర‌యం చేరుకున్న వైఎస్ జ‌గ‌న్‌ కు నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌మ‌కూర్చాల్సిన బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాన్ని ప‌లు కార‌ణాల‌తో ప‌క్క‌న‌పెట్టేశారు. ఏసీ రావ‌డం లేద‌ని, శుభ్రంగా లేద‌ని చెప్తూ అధికారులు ఆయ‌న‌కు వాహ‌నం ఇవ్వ‌లేదు. దీంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం వైసీపీ నేత‌ల వంతు అయిన‌ప్ప‌టికీ...చిన్నదానికి,...పెద్ద‌దానికి ప‌ట్టింపుల‌కు పోవ‌ద్ద‌ని భావిస్తూ...మ‌రో వాహ‌నంలో త‌న ప‌ర్య‌ట‌న‌కు జ‌గ‌న్ వెళ్లారు.

అయితే తిరుగు ప్ర‌యాణంలో మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. జ‌గ‌న్‌కు స‌మ‌కూర్చిన వాహ‌నం పంక్చ‌ర్ అయింది. మంగ‌ళ‌గిరి వద్ద వాహ‌నం ఇలా మొరాయించేయ‌డంతో ఏం చేయాలో వైసీపీ నేత‌ల‌కు అర్థం కాలేదు. దీంతో జ‌గ‌న్ మ‌రో ప్రైవేట్ వాహ‌నంలో గ‌న్న‌వ‌రం ఎయిర్‌ పోర్ట్‌ కు చేరుకున్నారు. కాగా, ఈ ప‌రిణామంపై వైసీపీ నేత‌లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత విష‌యంలో ఇంత ప‌ట్టింపులేని దోర‌ణి ఎందుకని ప్ర‌శ్నిస్తున్నారు. రాజ‌కీయంగా విబేధాలు ఉన్నంత మాత్రాన‌....రాజ్యాంగ‌బ‌ద్దంగా క‌ల్పించాల్సిన సౌక‌ర్యాల‌ను కూడా లైట్ తీసుకోవ‌డం ఏమిటని అంటున్నారు. ముంద‌స్తు షెడ్యూల్ ప్ర‌కారం వైఎస్ జ‌గన్ ప‌ర్య‌టిస్తున్న‌ప్ప‌టికీ... వాహ‌నం చెక్ చేసుకోక‌పోవ‌డం..పోనీ స‌మ‌కూర్చిన వాహ‌నం స‌రిగా లేక‌పోవ‌డం వంటివి ఎలాంటి సంకేతాల‌ను పంపుతాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి ప‌రిణామానికి అధికార పార్టీ త‌మ‌దైన శైలిలో ఎలా స‌మ‌ర్థించుకుంటుందో చూడాలి మ‌రి!!