Begin typing your search above and press return to search.

సీఎం ర‌మేష్‌ కు జ‌గ‌న్ షాక్ గాలేరు న‌గ‌రి టెండ‌ర్ క్యాన్సిల్‌!

By:  Tupaki Desk   |   30 Aug 2019 2:31 PM GMT
సీఎం ర‌మేష్‌ కు జ‌గ‌న్ షాక్ గాలేరు న‌గ‌రి టెండ‌ర్ క్యాన్సిల్‌!
X
నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యుడు - క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం వారం రోజులు నిరాహార దీక్ష చేసి.. రాష్ట్రం లో గుర్తింపు పొందిన నాయ‌కుడు - క‌డప జిల్లాకే చెందిన ప్ర‌స్తుత బీజేపీ నేత సీఎం ర‌మేష్‌ కు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. వైసీపీ అధినేత‌ - సీఎం జ‌గ‌న్ తీసుకున్న రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్ణ‌యంలో సీఎం ర‌మేష్‌ కు ద‌క్కిన టెండ‌ర్ ఒక‌టి క్యాన్సిల్ అయింది. వాస్త‌వానికి ఈ టెండ‌ర్‌ ను టీడీపీ హ‌యాంలో దొడ్డిదారిలో ద‌క్కించుకున్నార‌ని అప్ప‌ట్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపించింది.

ఇప్పుడు ఎలూగూ త‌క్కువ ధ‌ర‌ల‌కే ప‌లు ప్రాజెక్టుల‌ను నిర్మించాల‌ని చూస్తున్న ప్ర‌భుత్వం ఆ దిశ‌గా చేప‌ట్టిన నిర్ణ‌యంలో బాగంగా గాలేరు-న‌గ‌రి సుజ‌ల శ్ర‌వంతి ప్రాజెక్టుకు సంబంధించిన టెండ‌ర్‌ను కూడా ర‌ద్దు చేసే దిశ‌గా అడుగులు వేస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. రాయ‌ల సీమ‌కు తాగు - సాగు నీరు అందించే గాలేరు-న‌గ‌రి సుజ‌ల శ్ర‌వంతి ప్రాజెక్టు రెండోద‌శ‌ను అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు టెండ‌ర్లు పిలిచారు. దీనికి నాలుగు కంపెనీలు టెండ‌ర్ల‌లో పాల్గొన్నాయి.

వీటిలో నిబంధ‌న‌లు పాటించ‌లేద‌నే కార‌ణంగా రెండు కంపెనీల‌ను ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆ వెంట‌నే మ‌రో రెండు కంపెనీల టెండ‌ర్లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. వీటిలో సీఎం ర‌మేష్‌ కు చెందిన రిత్విక్ కంపెనీ కూడా ఉంది. మ‌రో కంపెనీ ఎన్‌ సీసీ అయితే - ఇది రిత్విక్ కంపెనీ క‌న్నా 10 శాతం ఎక్కువ‌కు ప‌నులు కోట్ చేసింద‌ని పేర్కొంటూ.. దీనిని కూడా ప‌క్క‌కు త‌ప్పించింది. ఆ వెంట‌నే సీఎం ర‌మేష్‌ కు చెందిన కంపెనీకి ఈ ప‌నులు అప్ప‌గించింది.

ఈ ప్రాజెక్టు ప్ర‌ధాన కెనాల్ వ్య‌యం 180 కోట్లుగా నిర్ధారించారు. అయితే, ఈ ప‌నులు పూర్తి చేసేందుకు రిత్విక్ కంపెనీ 406.73 కోట్ల‌తో టెండ‌ర్ వేసింది. అయితే - అప్ప‌ట్లో ఆద‌రాబాద‌రాగా పిల‌వ‌డం వ‌ల్లే.. నిధుల వ్య‌యం పెరిగిపోయింద‌ని - ఎన్నిక‌ల ముందు కావ‌డంతో ప్ర‌భుత్వం కూడా ప్ర‌జ‌ల నుంచి ఓట్లు రాబ‌ట్టుకునేందుకు టెండ‌ర్ల‌ను ఇష్టానుసారంగా అనుమ‌తించింద‌ని పేర్కొంటున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం .. ఈ టెండ‌ర్‌ను ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించింది.

త‌ద్వారా క‌నీసం 54.74 కోట్లు ప్ర‌జా ధ‌నం ఆదా అవుతుంద‌ని అధికారులు లెక్క‌లు తేల్చారు. ఆ నేప‌థ్యంలోనే సీఎం ర‌మేష్‌ కు చెందిన రిత్విక్ కంపెనీకి చంద్ర‌బాబు హ‌యాంలో ద‌క్కిన టెండ‌ర్‌ ను రేపో మాపో క్యాన్సిల్ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీంతో సీఎం ర‌మేష్‌ కు జ‌గ‌న్ భారీ దెబ్బ‌కొట్టార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.