Begin typing your search above and press return to search.

నారాయ‌ణ మాట విన్నావా ప‌వ‌న్ క‌ల్యాణ్‌?

By:  Tupaki Desk   |   29 Oct 2015 10:05 AM GMT
నారాయ‌ణ మాట విన్నావా ప‌వ‌న్ క‌ల్యాణ్‌?
X
ఏపీలో రాజ‌కీయం మ‌రోసారి ర‌గులుకోనుందా? తాను చెప్పిన మాట జ‌రిగి తీరాల‌న్నట్లుగా చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ను ఏపీ స‌ర్కారు ప‌ట్టించుకోకూడ‌ద‌ని డిసైడ్ అయ్యిందా? అదే జ‌రిగితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కామ్ గా ఉంటారా? తాను చెబుతున్నాను కాబ‌ట్టి ఏపీ స‌ర్కారు రాజ‌ధాని రైతుల నుంచి భూస‌మీక‌ర‌ణ త‌ప్పించి భూసేక‌ర‌ణ చేయ‌కూడ‌ద‌ని అల్టిమేటం ఇచ్చిన ప‌వ‌న్ మాట‌ను తాజాగా ఏపీ స‌ర్కారు లైట్ తీసుకోవాల‌ని అనుకుంటుందా? లాంటి ప్ర‌శ్న‌లెన్నో మంత్రి నారాయ‌ణ తాజాగా చేసిన వ్యాఖ్య‌ను చేస్తే మ‌న‌సులోకి రాక మాన‌దు.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించి 33వేల ఎక‌రాల భూమిని భూస‌మీక‌ర‌ణ ద్వారా సేక‌రించ‌టం తెలిసిందే. అయితే.. రాజ‌ధాని ప్రాంతానికి చెందిన కొంద‌రు రైతులు త‌మ భూముల్ని ఇచ్చేది లేదంటూ ఆందోళ‌న చేప‌ట్టారు. దీనిపై స్పందించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టించి.. రైతుల ఇష్టానికి వ్య‌తిరేకంగా భూమిని తీసుకునే అవ‌కాశ‌మే లేద‌ని తేల్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆవేశంగా మాట్లాడిన ప‌వ‌న్‌.. నేను చెబుతున్నాను.. నేను చెబుతున్నాను.. రైతుల నుంచి బ‌ల‌వంతంగా భూమిని తీసుకోవ‌ద్దంటూ ఏపీ స‌ర్కారుకు హెచ్చ‌రించిన విధంగా వ్యాఖ్యానించారు.

రైతుల భూముల సేక‌రించే విష‌యంలో ప‌వ‌న్ నుంచి వ‌చ్చిన తీవ్ర వ్యాఖ్య‌తో ఏపీ స‌ర్కారు వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా క‌నిపించింది. అప్ప‌టికే భూసేక‌ర‌ణ‌కు జీవో జారీ చేసిన‌ప్ప‌టికీ దాన్ని అమ‌లు చేయ‌లేదు. తాజాగా మంత్రి నారాయ‌ణ మాట్లాడుతూ.. రాజ‌ధాని నిర్మాణానికి అవ‌స‌ర‌మైన 300 ఎక‌రాల‌ను మ‌రో ప‌దిహేను రోజుల్లో భూస‌మీక‌ర‌ణ కింద రైతులు ఇచ్చేయాల‌ని.. లేని ప‌క్షంలో భూసేక‌ర‌ణ చ‌ట్టం కింద తీసుకోవ‌టం ఖాయ‌మ‌ని తేల్చి చెప్పారు. రాజ‌ధాని రైతుల నుంచి భూముల్ని బ‌ల‌వంతంగా ఒక్క ఎక‌రా కూడా తీసుకోనివ్వ‌న‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెబితే.. మ‌రోవైపు మంత్రి నారాయ‌ణ ప‌దిహేను రోజుల గ‌డువు ఇవ్వ‌టం గ‌మ‌నార్హం. మ‌రి.. ఈ అంశంపై ప‌వ‌న్ ఎలా స్పందిస్తార‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారిందని చెప్ప‌క‌త‌ప్ప‌దు. 300 ఎక‌రాల విష‌యంలో ప‌వ‌న్ కానీ స్పందిస్తే.. ఏపీలో రాజ‌కీయ క‌ల‌క‌లం త‌ప్ప‌ద‌న్న మాట వినిపిస్తోంది.