Begin typing your search above and press return to search.

'సాయం' అభ్యర్థించడం లేకితనం!

By:  Tupaki Desk   |   18 Feb 2018 4:15 AM GMT
సాయం అభ్యర్థించడం లేకితనం!
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేయడం అనేది విభజన చట్టం రూపంలో దక్కిన హక్కు. మరి హక్కును కాదని.. సాయం కోసం ఒప్పుకున్నాం... అని చంద్రబాబునాయుడు ప్రభుత్వం చెప్పడం అనేది చాలా లేకితనం గా కనిపిస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. సాయం అనేది ఇతరుల దయమీద ఆధారపడినది.. అదే సమయంలో విభజన చట్టం ద్వారా దక్కవలసినవి కోరుకోవడం అనేది.. హక్కుభుక్తంగా రాష్ట్రానికి సంక్రమించిన సొంతం అనుకోవాలి. అలాంటి నేపథ్యంలో హక్కులను మంటగలిపి.. చంద్రబాబు సర్కారు ముష్టి అడగడంతో సమానమైన ‘సాయం’ అనే మాటకు ఎందుకు అంగీకరించింది.. అనే సంగతే అర్థం కావడం లేదు.

తెలుగుదేశం నాయకులు కొన్ని రోజులుగా అదే పనిగా మాటల గారడీ ప్రదర్శిస్తున్నారు. ప్యాకేజీకి ఒప్పుకోవడమే తెలుగుదేశ ప్రభుత్వం చేసిన తప్పు అని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. వారు ఆత్మరక్షణలో పడక తప్పలేదు. ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని.. మేం ప్యాకేజీకి అంగీకరించలేదు.. ప్రత్యేకహోదాతో సమానం అయిన ప్రత్యేకసాయం చేస్తాం అని కేంద్రం హామీ ఇచ్చింది. అందువల్లనే ఒప్పుకున్నాం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

ఈ రకంగా తెదేపా సాయం కు ఒప్పుకోవడం వల్లనే .. ఇప్పుడు కేంద్రం ఏదో తాము సాయం చేసేవాళ్లం.. వీళ్లు తమ సహాయానికి తమ వాకిట్లో నిల్చుని తమ దయకోసం ఎదురుచూస్తున్న వాళ్లు అనేంత అహంకార పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితి ఇవాళ దాపురించిందంటే.. దాని మర్మం.. ‘సాయం’ అనే పదం మాత్రమే. సాయం చేయడానికి ఏపీ ముష్టెత్తుకోవడంలేదు. ఫెడరల్ వ్యవస్థలో భాగంగా ఉన్న ఒక రాష్ట్రం ఇది. ఈ రాష్ట్ర ప్రజల మనోభిప్రాయాలతో గానీ, భావోద్వేగాలతో గానీ నిమిత్తం లేకుండానే ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు.. ఈ రాష్ట్రం లెవెల్ ప్లేయింగ్ కెపాసిటీకి వచ్చే వరకు అవసరమైన అన్ని నిధులు ఇవ్వడం కేంద్రం ప్రాథమిక బాధ్యత. అలాంటి హక్కును తెదేపానే నాశనం చేసేసుకున్నదని.. ‘సాయం’ అన్నదానికి ఒప్పుకోవడం వలన ఇప్పుడు కేంద్రం వారు గేమ్స్ ఆడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.