Begin typing your search above and press return to search.

ఇసుక దుమారం.. వైసీపీ తక్షణ కర్తవ్యం..

By:  Tupaki Desk   |   27 Oct 2019 5:59 AM GMT
ఇసుక దుమారం.. వైసీపీ తక్షణ కర్తవ్యం..
X
చంద్రబాబు హయాంలో ప్రకృతి వనరులను టీడీపీ నేతలే బినామీల పేరుతో దోచుకున్నారని ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.. ఇసుక - మైనింగ్ - గ్రానైట్ సహా టీడీపీ పెద్దల దోపిడీకి ఏపీ లూటీ అయ్యిందని ఆరోపించారు. అందుకే గద్దెనెక్కగానే ఏపీలో ఇసుక - సహా టీడీపీ నేతల కంబంధ హస్తల్లో బందీ అయిన ప్రకృతి సంపదను కాపాడేందుకు వైసీపీ సర్కారు నడుం బిగించింది. రాష్ట్రంలో ఇసుక - మైనింగ్ తవ్వకాలను నిలిపివేసింది.

అయితే ఇసుక తవ్వకాలకు బ్రేక్ వేయడం కొత్త సమస్యలకు దారితీస్తోంది. టీడీపీ నేతల అఘాయిత్యాలకు కళ్లెం వేశామని ప్రభుత్వం భావించినా ఇప్పుడు ఇసుక కొరత ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తోంది. దీనివల్ల భవన నిర్మాణ రంగం కుదలై దాదాపు 20 అనుబంధ రంగాలపై ప్రభావం పడుతోంది. స్టీల్ - సిమెంట్ అమ్మకాలు పడిపోయాయి. వారి రవాణాపై ఆధారపడిన వారీకీ కష్టమొచ్చింది. ఈ రంగంపై ఆధార పడ్డ కార్మికుల ఉపాధికి ఎసరు వస్తోంది.

ఇక భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన మేస్త్రీలు - కార్మికులు ఉపాధి కరువైన పరిస్థితి ఏర్పడింది. కొందరు ఇతర రాష్ట్రాల్లోని భవన నిర్మాణాలకు కూడా పనికి వెళుతున్నారు. అడ్డా కూలీలు పనిదొరక్క ఐదు నెలలుగా ప్రత్యామ్మాయ పనులకు వెలుతున్నారు.

టీడీపీ నేతల దోపిడీని అరికట్టాలని చూసిన ప్రభుత్వం ప్రస్తుతం ఇసుక విధానం కోసం కసరత్తు చేస్తోంది. కానీ అప్పుడే టీడీపీ తమ చేతుల్లోని దోపిడీ పోతోందని.. ఇసుక కొరతతో చాలా మందికి ఉపాధి - భవన నిర్మాణం రంగం కుదేలైందని పచ్చమీడియాతో కలిసి పెడబొబ్బలు పెడుతోంది. తమ చేతుల్లోని ఆర్థిక వనరులు పోతాయని గగ్గోలు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ సైతం టీడీపీకి సపోర్టుగా రాజకీయం చేస్తున్నారు.

దీంతో వైసీపీ సర్కారు ఈ సమస్యను పరిష్కరించాలని యోచిస్తోంది. టీడీపీ నేతల దోపిడీని అరికట్టడంతోపాటు పేదలకు ఉచితం ఇసుక ఇచ్చేలా.. ఈ రంగంపై ఆధారపడిన వారికి మేలు జరిగేలా సరికొత్త విధానం రూపకల్పనకు శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది.