Begin typing your search above and press return to search.

బాబు జ‌మానాలో సినిమాలు చూడ‌లేం!

By:  Tupaki Desk   |   6 July 2017 7:29 AM GMT
బాబు జ‌మానాలో సినిమాలు చూడ‌లేం!
X
నిజ‌మేనండోయ్‌... ఏపీలో ఇక‌పై సినిమా చూడాలంటే వంద‌ల‌కు వంద‌లు ఖ‌ర్చు పెట్టాల్సిందే. ఇప్ప‌టికే సినిమా థియేట‌ర్లు వ‌సూలు చేస్తున్న టికెట్ ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని స‌గ‌టు సినీ ప్రేక్ష‌కుడు ఆవేద‌న‌కు లోన‌వుతుంటే... అదేమీ ప‌ట్ట‌న‌ట్టు చంద్ర‌బాబు స‌ర్కారు టికెట్ ధ‌ర‌ల‌ను ఏకంగా రెండింత‌లు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇటీవ‌లే... చంద్ర‌బాబు కేబినెట్ లోని ఆర్థిక‌, రెవెన్యూ, హోం మంత్రుల‌తో స‌మావేశ‌మైన చ‌ల‌న‌చిత్ర వాణిజ్య మండ‌లి ప్ర‌తినిధులు ప్ర‌త్యేకంగా భేటీ అయ్యార‌ట‌. ఈ భేటీలో టికెట్ ధ‌ర‌ల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించిన ఇరు వ‌ర్గాలు.. ఇప్పుడు సాధార‌ణ థియేట‌ర్ల‌లో రూ.75గా ఉన్న టికెట్ ధ‌ర‌ను ఏకంగా రూ.125కు పెంచాల‌ని ప్ర‌తిపాదించార‌ట‌. ఇదే జ‌రిగితే... కొత్త‌గా అమ‌ల్లోకి వ‌చ్చిన జీఎస్టీ ప‌న్ను (వంద‌కు మించిన టికెట్‌పై 28 శాతం ప‌న్ను)తో క‌లిపితే... అది ఏకంగా రూ.153కు వెళ్లే ప్ర‌మాద‌ముంది.

ఇప్ప‌టికే సినిమా టికెట్ రేట్ల‌పై జ‌నం నుంచి వినిపిస్తున్న వ్య‌తిరేకత‌ను గుర్తుకు తెచ్చుకున్న మంత్రులు - మండ‌లి ప్ర‌తినిధులు మ‌రోమారు ఆలోచించి... రూ.75గా ఉన్న టికెట్‌ ను రూ.100ల‌కు పెంచాల‌ని నిర్ణ‌యించార‌ట‌. అంటే జీఎస్టీ ప‌న్ను విధివిధానాల ప్ర‌కారం వంద రూపాయ‌ల లోపు టికెట్‌పై 18 శాతం ప‌న్నును ఈ టికెట్ ధ‌ర‌కు క‌లుపుకుంటే... వాస్త‌వ టికెట్ ధ‌ర రూ.118కి చేరుకుంటుంది. రూ.2 చిల్ల‌ర ఎటూ ఇవ్వ‌రు కాబ‌ట్టి... సినిమా చూడాలంటే రూ.200ల‌ను వదులుకోవాల్సిందేన‌న్న మాట‌. ఇదంతా సాధార‌ణ థియేట‌ర్ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం. ఇక మ‌ల్టీప్లెక్స్‌ల విష‌యానికి వ‌స్తే... ప్ర‌స్తుతం ఉన్న రూ.150 టికెట్‌ ను ఏకంగా రూ.300ల‌కు పెంచేందుకు బాబు స‌ర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇద్ద‌రికి అయ్యే టికెట్ ఖ‌ర్చుతో ఇక‌పై కేవ‌లం ఒక్క‌రు మాత్ర‌మే సినిమా చూడ‌గ‌ల‌ర‌న్న‌మాట‌.

ఈ టికెట్ ధ‌ర విష‌యంలో ఏమాత్రం ఆలోచ‌న లేకుండానే చ‌ర్చ‌లు జ‌రిపిన మంత్రులు - మండ‌లి ప్ర‌తినిధులు... టికెట్ల ధ‌ర‌ల‌పై ఏకాభిప్రాయంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. అయితే ఇక్క‌డ ఓ చిన్న లాజిక్‌ ను మ‌నం గ‌మ‌నించాలి. మ‌ల్టీప్లెక్స్‌ లో రెక్లెయినర్లతో కూడిన సీట్ల‌కు మాత్ర‌మే రూ.300 వ‌సూలు చేస్తామ‌ని, సాధార‌ణ సీట్ల‌కు రూ.200 ధ‌ర వ‌సూలు చేస్తామ‌ని మండ‌లి ప్ర‌తినిధులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు సాధార‌ణ థియేట‌ర్లుగా ఉన్న సినిమా హాళ్ల‌న్నీ మ‌ల్టీప్లెక్స్‌ లుగా మారిపోతున్నాయి. ఇక అధిక ధ‌ర‌ల‌ను రాబ‌ట్టేందుకు మ‌ల్టీప్లెక్స్‌ల్లోని సాధార‌ణ సీట్లు కూడా రెక్లెయిన‌ర్లతో కూడిన సీట్లుగా మారినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌న్న మాట‌. అంటే... బాబు జమానాలో సినిమా చూడాలంటే ఒక‌టికి రెండు సార్లు ఆలోచించాల్సిందేన‌న్న మాట‌.