Begin typing your search above and press return to search.

టీ సర్కారు బాటలోనే ఏపీ సర్కారు నడుస్తుందా?

By:  Tupaki Desk   |   27 Jun 2015 7:00 AM GMT
టీ సర్కారు బాటలోనే ఏపీ సర్కారు నడుస్తుందా?
X
మరక మంచిదే మాదిరి.. కొన్నిసార్లు మొండితనం కూడా మంచిదే. అయితే..ఎక్కడ మొండిగా ఉండాలో.. మరెక్కడ తగ్గాలో అన్న విషయంలో లెక్క తేడా వస్తేనే ఇబ్బంది. కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా వ్యవహరించటం ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన వాటి కంటే ఎక్కువ లబ్థి పొందే వీలుంటుంది. అయితే.. కొన్ని పంచాయితీల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ విషయం తాజాగా కేసీఆర్‌ సర్కారుకు అర్థమై ఉంటుంది.

మద్యం వ్యాపారానికి సంబంధించి ఐటీ శాఖకు.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివాదం గురించి తెలిసిందే. మిగిలిన వాటి మాదిరే విభజనలో భాగంగా మద్యం అమ్మకాలకు సంబంధించి చెల్లించాల్సిన ఆదాయపన్ను చెల్లించకపోవటం. దీనిపై ఐటీ శాఖ కోర్టుకు వెళ్లటం జరిగింది. విభజనలో భాగంగా ఆదాయపన్ను శాఖకు బాకీ పడ్డారని చెప్పే మొత్తం రూ.3100కోట్లలో.. ఏపీ వాటాను 1900 కోట్లు.. తెలంగాణ వాటాగా రూ.1200కోట్లుగా లెక్క వేయటం తెలిసిందే.

అయితే.. ఈ మొత్తాన్ని చెల్లించే విషయంలో తెలంగాణ సర్కారు మొండిగా వ్యవహరించింది. దీంతో.. కోర్టుకు వెఇ్లన ఐటీ శాఖ.. తన వాదనను వినిపించటం.. కోర్టు సైతం ఆ వాదనను సమర్థించి.. తెలంగాణ సర్కారు బాకీ పడ్డ రూ.1200కోట్లు చెల్లించాలని పేర్కొంది. అయితే.. ఈ విషయంలో తెలంగాణ సర్కారు స్పందించకపోవటం.. నోటీసులు ఇచ్చినా ప్రయోజనం లేకపోవటంతో ఐటీ శాఖ.. ఆర్‌బీఐ నుంచి తెలంగాణ సర్కారుకు చెందిన రూ.1200కోట్లను తన ఖాతాకు మళ్లించుకుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

వాస్తవానికి ఇలాంటి బకాయిల మొత్తాన్ని వాయిదాల వారీగా ఇస్తామని చెబితే.. కొస్తంత వెసులుబాటుతో పాటు.. ప్రభుత్వంపై భారం పడకుండా ఉండేది. కానీ.. తాజా పరిణామాలతో ఒకేసారి రూ.1200కోట్ల భారీ మొత్తం వెళ్లటం కాస్తంత ఇబ్బందని చెబుతున్నారు. ఇలాంటి పరిణామాన్ని ఏ మాత్రం ఊహించని తెలంగాణ సర్కారుకు ఇదో షాక్‌గా మారిందని చెబుతున్నార. ఇక.. ఏపీ కూడా ఐటీ శాఖకు బకాయిలు ఉంది. దానిపై ఐటీ శాఖ దృష్టి పెట్టిందని చెబుతున్నారు. మరి.. బాబు మేల్కంటారా? లేక కేసీఆర్‌ బాటలో పయనించి లేని తిప్పలు తెచ్చి పెట్టుకుంటారా అన్నది చూడాలి.