Begin typing your search above and press return to search.

రాజధాని మినహా భూముల విలువలు పెంపు

By:  Tupaki Desk   |   16 July 2015 11:48 AM GMT
రాజధాని మినహా భూముల విలువలు పెంపు
X
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన సీఆర్ డీఏ మినహా మిగిలిన ఆంధ్రప్రదేశ్ అంతటా భూముల విలువలు పెంచాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు సాగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి భూ సమీకరణ లేదా భూ సేకరణ చేస్తే ప్రభుత్వానికి భారం కారాదనే ఈ ముందు చూపు.

వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర మొత్తం భూముల విలువలు పెరిగాయి. అన్ని ప్రాంతాలతోనూ పోలిస్తే ఎక్కువ విలువ పెరిగింది సీఆర్ డీఏ పరిధిలోనే. ఇప్పుడు అక్కడ మార్కెట్ విలువకు రిజిస్ట్రేషన్ విలువకు హస్తి మశకాంతరం ఉంది. రిజిస్ట్రేషన్ విలువ ఎకరాకు లక్ష రూపాయలు ఉంటే మార్కెట్ విలువ కోటి రూపాయలు ఉంది. అయినా ఇక్కడ భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచరాదని ప్రభుత్వం నిర్ణయించింది.

రాజధానిని నిర్మించిన తర్వాత దానిని మరింత విస్తరించాల్సి ఉంటుంది కదా. రాజధానికి బయట వివిధ కంపెనీలు, పరిశ్రమలు తదితరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కదా. అప్పుడు అక్కడ భూములను సేకరించాలన్నా సమీకరించాలన్నా పెద్దఎత్తున ధరలు పెట్టాలి కదా. ఒకవేళ భూములను సేకరిస్తే నాలుగు రెట్లు ఎక్కువగా ధరలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికితోడు సమీకరణకు ముందుకు రాని వారి నుంచి సేకరణ చేయాలి కదా. వారికి పెద్దఎత్తున ముట్టచెప్పాల్సి ఉంటుంది కదా. అందుకే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటోంది. సీఆర్ డీ ఏ పరిధి మినహా మిగిలిన రాష్ట్రంలోనే విలువలు పెంచాలని భావిస్తోంది. ఈ మేరకే కసరత్తు చేస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితికి భిన్నమే అయినా ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ఉండడానికే ఈ ముందు జాగ్రత్త చర్య.