Begin typing your search above and press return to search.

అమరావతిలో మూడు రకాల నివాస ప్రాంతాలు

By:  Tupaki Desk   |   27 Dec 2015 11:43 AM GMT
అమరావతిలో మూడు రకాల నివాస ప్రాంతాలు
X

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరంలో నివాస ప్రాంతమే ఎక్కువ. రాజధాని అనగానే అక్కడ పరిశ్రమలు, ఇతర కంపెనీలతోపాటు సమస్తం కేంద్రీకృతమై ఉంటాయన్న అభిప్రాయం అమరావతి విషయంతో తప్పుకానుంది.

అమరావతిలో ఇప్పటికే ఉన్న గ్రామాలు మినహా మూడు రకాల నివాస ప్రాంతాలు రానున్నాయి. వాటిలో ఒకటి తక్కువ జన సాంధ్రత ఉండే ప్రాంతం. మరొకటి మధ్యస్థాయి జన సాంధ్రత ఉండే ప్రాంతం. మూడోది ఎక్కువ జన సాంధ్రత ఉండే ప్రాంతం. అంటే, భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం వివిధ పరిమాణాల్లో భూములు ఇస్తోంది. వీటిలో అతి తక్కువ విస్తీర్ణం 125 చదరపు అడుగులు అయితే అతి ఎక్కువ విస్తీర్ణం 2000 చదరపు అడుగులు. వీటిలో 125 నుంచి 400 వరకూ చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ప్రాంతాలన్నీ ఒకచోట ఉంటాయి. వాటిలో హైదరాబాద్ తరహాలో మూడు నాలుగు లేదా ఐదు అంతస్తులకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఇక, 500, 1000, 2000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ప్రాంతాలన్నీ ఒకచోట రానున్నాయి. వీటిలో 500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే స్థలాల్లో 13 వరకూ; 1000, 2000 అడుగుల విస్తీర్ణాల్లో అంతకు మించిన బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇవ్వనున్నారు. ఈ రకంగా చూస్తే మొత్తంమీద 6910 హెక్టార్లు అంటే 17 వేల ఎకరాలను నివాస భవనాలకు కేటాయిస్తున్నారు. ఇందులో దాదాపు 7000 ఎకరాలను రైతులకు పరిహారం రూపంలో ఇస్తుండగా, పది వేల ఎకరాల్లో ప్రభుత్వమే నివాస భవనాలను అభివృద్ధి చేయనుంది. అయితే, ఈ భూములను ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించి వారితో భవనాలు కట్టిస్తుందా? లేక ప్రభుత్వమే భవనాలు కట్టి రాజీవ్ స్వగృహ తరహాలో ఇస్తుందా అనే విషయంలో స్పష్టత లేదు. నివాస ప్రాంతం తర్వాత ఎక్కువ భూమిని వాణిజ్య అవసరాలకు కేటాయించారు. పరిశ్రమలకు అమరావతిలో ఇచ్చిన భూమి నామమాత్రం. మొత్తంమీద విశాలమైన ఆహ్లాదకరమైన ప్రాంతంలో నివాస భవనాలు రానున్నాయి.