Begin typing your search above and press return to search.

బాబు మార్కు ఎమర్జెన్సీ దేనికి సంకేతం!

By:  Tupaki Desk   |   24 Jan 2017 12:11 PM GMT
బాబు మార్కు ఎమర్జెన్సీ దేనికి సంకేతం!
X
ప్రజల్లోనుంచి వచ్చిన ఒక ఉద్యమాన్ని ఆపడానికి ప్రభుత్వం రకరకాల చర్యలు చేపడుతూ ఉండటం అత్యంత సహజం. ఆ ఉద్యమ నేతను పిలిపించుకోవడమో లేక ప్రభుత్వమే ఆ నేత వద్దకు దూతలను పంపడమో చేస్తుంటుంది. అనంతరం ఉద్యమాలకు సంబందించి సవరణలో, లేక ప్రభుత్వం తరుపున ఒక "మాట" ఇవ్వడమో జరుగుతుంటుంది. ప్రభుత్వం ఇచ్చిన మాటకు అప్పటికీ కట్టుబడని క్రమంలో.. ఆ ఉద్యమ నేత మరోసారి తొడకొట్టడం సహజం. ఈ క్రమంలో ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహరించాలి.. తీసుకునే ప్రతీ నిర్ణయం ఆచి తూచి వేయాలి.. బలవంతపు చర్యల వల్లో, భయబ్రాంతులకు గురిచేయడం వల్లో ఉద్యమాలు ఆగవు సరికదా మరింత తీవ్రరూపం దాల్చడం, మరిన్ని శక్తుల సహకారం లభించడం జరగొచ్చు! ఈ విషయం తెలిసిన ప్రభుత్వ పెద్దలు స్పందించే విధానం అత్యంత హేతుబద్దంగా కూడా ఉండాలి.. మిగిలిన వర్గాలు కూడా హర్షించే విధంగా ఉండాలి! అయితే... మరోసారి కాపు సామాజిక వర్గం ఉద్యమిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలా ఉంటున్నాయి.. ఎలా ఉండాలి.. అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం!

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బుధవారం నుంచి సత్యాగ్రహం చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీవినీ ఎరుగని స్థాయిలో ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్ సర్వీసులు ఆపడం దగ్గర నుంచి మీడియాపై ఆంక్షలు విధించడం వరకూ... ఏపీ ప్రభుత్వం "ఎమర్జెన్సీ" చర్యలు తీసుకుంటోంది! ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించడం, రాపిడ్ యాక్షన్ ఫోర్సులను రప్పించడం, వీధుల్లో పోలీసు బలగాల కవాతులు వంటి మొదలైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది!!

యాత్ర జరుగుతున్నప్పుడో, ఉద్యమం చేస్తున్నప్పుడో ఆ గుంపుల్లో అసాంఘిక శక్తులు చేరి అల్లర్లు సృష్టించడం జరుగుతుంటుంది కాబట్టి... వాటిని నివారించడానికి, అలాంటి సంఘటనలు జరగకుండా చూడటానికి ప్రభుత్వం పోలీసులు బలగాలను రప్పించడం, వారి సమక్షంలోనే యాత్ర జరిగేలా చేయడం వంటికి హేతుబద్దంగా అనిపించినా... మీడియాపై ఆంక్షలు విధించడం అనే చర్య ఏమాత్రం సరైనది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్ సేవలు సైతం నిలిపేసే స్థాయిలో ప్రభుత్వం కదలడం దేనికి సంకేతమో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. ఒక సామాజిక వర్గం వారు ఉద్యమం చేస్తున్నారు కాబట్టి... ఇక ఆ ప్రాంతంలోని ఇతర వ్యక్తులు ఎవరూ ఇంటర్నెట్ వాడకూడదా? సమాజంలో జరిగే విషయాలను ప్రపంచానికి, ప్రభుత్వానికి తెలియజేసే మీడియా తమ పని తాము చేయకూడదా..? వాటిని ఆపే నిర్ణయాలు, వాటిని నియంత్రించాలని ప్రభుత్వం చేస్తున్న పనులను సామాన్యుడు ఎలా అర్ధం చేసుకోవాలి.

అయితే ఇక్కడొక విషయం సుస్పష్టం! సాధారణ ఉద్యమాలకు, సాధారణ యాత్రలకు కూడా అసాధారణ రీతిలో ప్రభుత్వాలు స్పందించి వాటికి అసామాన్య రీతిలో వెలుగులోకి తేవడం జరిగిన సందర్భాలు చరిత్రలో చాలానే ఉన్నాయి. ఈ విషయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ చేపట్టబోయే తాజా యాత్ర విషయంలో కూడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు... ఈ కోవలోకే వస్తాయని కామెంట్స్ అక్కడక్కడా వినిపిస్తున్నాయి! దాని ఉద్దేశ్యం ముద్రగడ యాత్ర, ఉద్యమం చిన్నదని కాదు కానీ... ఆ యాత్ర, ఉద్యమం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ "ఎమర్జెన్సీ" నిర్ణయాలు మాత్రం వెనక్కి తీసుకుని, ఎవరి బాదను వారిని చెప్పుకోనిస్తే మంచిదని, లేనిపక్షంలో... భవిష్యత్తులో ప్రభుత్వం అన్ని కులాల విషయంలోనూ ఒకేలా స్పందించడం లేదనే విషయం మరింత బలంగా జనాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/