Begin typing your search above and press return to search.

ఆపరేషన్ నంద్యాల : గంట మోగే లోగా గలాటా!

By:  Tupaki Desk   |   19 July 2017 5:01 PM GMT
ఆపరేషన్ నంద్యాల : గంట మోగే లోగా గలాటా!
X
నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి జరగాల్సి ఉన్న ఉప ఎన్నిక విషయంలో ఇప్పటికే సంకేతాలు తమకు ప్రతికూలంగా ఉండడంతో కంగారు పడుతున్న చంద్రబాబునాయుడు సర్కారు... ఏదో ఒక హడావుడి చేయడం ద్వారా ఆ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. నంద్యాల మీద తమ ప్రభుత్వానికి వల్లమాలిన అభిమానం ఉన్నదని, నంద్యాల అభివృద్ధికి చాలా కష్టపడిపోతున్నామని.. ప్రజల ముందు బిల్డప్ ఇవ్వడానికి తెదేపా పాట్లు పడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ రూపేణా నిబంధనల గంట మోగేలోగానే.. వీలైనన్ని అభివృద్ధి పనులను ప్రారంభించేసి.. చేయగలిగినంత ఎక్కువ గలాటా చేయాలని వారు స్కెచ్ వేసుకున్నట్లుగా కనిపిస్తోంది.

భూమా నాగిరెడ్డి మరణం పర్యవసానంగా నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైసీపీ గెలుపొందింది. అయితే భూమా పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఆ విజయం ఆయన సొంత ఖాతాకే చెందుతుందేమోనని తెదేపా భావించింది. తీరా ఆయన హఠాన్మరణం తర్వాత ఉప ఎన్నిక జరుగుతుండగా.. అక్కడి ఓటర్ల నాడి భూమా వారసుడిగా తెదేపా తరఫున రంగంలోకి దిగిన బ్రహ్మానందరెడ్డికి అనుకూలంగా లేకపోవడం వారికి కంగారు పుట్టిస్తోంది. వైసీపీకి పార్టీపరంగా బలం పుష్కలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారి తరఫున శిల్పా మోహన్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఇప్పటికే సీనియర్ నాయకుల్ని భారీగా మోహరించి.. విజయం ఖచ్చితంగా దక్కించుకోవాల్సిందేనని దృష్టిపెట్టిన తెదేపా అనేక పనులు కూడా హడావుడిగా ప్రారంభిస్తోంది.

నంద్యాల నగరానికి రోడ్ల విస్తరణ, ఆక్రమణల తొలగింపు చాలా పెద్ద సమస్య. ఇదే సమస్యపై గతంలో మునిసిపాలిటీ స్థాయిలో చాలా రచ్చలు జరిగాయి కూడా. తాజాగా సర్కారు రోడ్ల విస్తరణను ప్రారంభించేసింది. తద్వారా నంద్యాల చిరకాల సమస్యలను తాము కొలిక్కి తెస్తాం అనే సంకేతాలను ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా మరిన్ని పనులు ప్రారంభించాలనేదే వారి ఆలోచన.

అయితే రోడ్ల విస్తరణ లాంటి పనుల వల్ల.. వారి పార్టీ పట్ల ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉంటుందని ఏకపక్షంగా చెప్పడానికి వీల్లేదు. ఇలాంటి పనుల వల్ల ప్రజల్లో ఒక వర్గంలో వ్యతిరేకత కూడా వస్తుంది. భవనాల తొలగింపునకు వీలుగా అధికార్లు సమావేశం ఏర్పాటుచేసినప్పుడు చాలా మంది భవన యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు కూడా. అలాంటప్పుడు ఎన్నికల ముందు అధికార పార్టీ ఇలాంటి స్టెప్ ఎందుకు వేస్తున్నదో అర్థం కావడం లేదు.