Begin typing your search above and press return to search.

ఏపీలో విచార‌ణ‌...న‌త్త‌తో పోటీ

By:  Tupaki Desk   |   30 Oct 2016 6:10 AM GMT
ఏపీలో విచార‌ణ‌...న‌త్త‌తో పోటీ
X
ఆనందోత్సాహాల మ‌ధ్య ఉన్న‌వారు దాదాపుగా పాతిక మంది చ‌నిపోతే ఆ విషాదంపై ద‌ర్యాప్తు ఎలా సాగాలి? ఎంత వేగం ఉండాలి? కానీ అదేమీ లేదు. న‌త్త‌తో పోటీ ప‌డే రీతిలో...స‌ద‌రు విచార‌ణ సాగుతోంది. గోదావరి మహా పుష్కరాల్లో రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద సంభవించిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్ విచారణ గడువును ప్రభుత్వం ముచ్చ‌ట‌గా మూడోసారి మళ్లీ పొడిగించింది. సెప్టెంబర్ 29వ తేదీతో ముగిసిన మూడో విడత గడువును మళ్లీ మరో నాలుగు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2017 జనవరి 29వ తేదీ వరకు నాలుగు నెలల పాటు పొడిగించింది.

మ‌హా పుష్క‌రాల సంద‌ర్భంగా జ‌రిగిన ఘోరక‌లి ఘ‌టనపై ప్రభుత్వం జస్టిస్ సివై సోమయాజులు కమిషన్‌ ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. 2015 జూలై 14వ తేదీన రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ప్రభుత్వం మొదట సెప్టెంబర్ 15వ తేదీన 2015 వరకు ఆరు నెలల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేయ‌గా ఈ గడువు మార్చి 30వ తేదీకి పూర్తయింది. అనంతరం మళ్ళీ జూన్ 30కి గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ గడువులోగా కూడా విచారణ కొలిక్కి రాకపోవడంతో ఈ ఏడాది జూన్ 30 నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు గడువు పెంచారు. ఈ గడువులోగా కూడా విచారణ పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో తాజాగా ప్రభుత్వం అక్టోబర్ 25వ తేదీన జిఓ నెంబర్ 390 ప్రకారం గడువు పెంచారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు గడువు పెంచుతూ ప్రభుత్వం జీవోలపై జీవోలు జారీ చేస్తోంది గానీ సంబంధిత యంత్రాంగం మాత్రం కమిషన్‌ కు అవసరమైన సమాచారాన్ని - సాక్ష్యాలను అందించడంలో దాటవేత దోరణి ప్రదర్శించింది.

దాదాపు ఏడాది పాటు కమిషన్‌ కు కనీసం సాక్ష్యాధారాలను సమర్పించడంతోనే అధికార యంత్రాంగం నెట్టుకొచ్చింది. ఎట్టకేలకు కొన్ని డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ ఇంకా అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడంలో జాప్యం చేయడంతో అరకొరగా విచారణ కొనసాగింది. ఈలోగా కమిషన్ గడువు పుణ్యకాలం ముగిసిపోయింది. ఇపుడు మళ్లీ మరో నాలుగు నెలలపాటు గడువు పెంచారు. గడువు పెంచిన విషయాన్ని కూడా ప్రభుత్వం జీవో జారీ చేసే సమయానికే నెల రోజుల విచారణ కాలం వృథా అయింది. పేరుకు నాలుగు నెలల పాటు గడువు పెంచినప్పటికీ కేవలం మూడు నెలల పాటే వ్యవధి వున్నట్టయింది. ఈ మూడు నెలల వ్యవధిలో ఎన్ని సార్లు కమిషన్ విచారణ నిర్వహించి నివేదిక సమర్పించనుందో అనేది తేలనుంది. ఈ గడువులోగానైనా విచారణ పూర్తవుతుందో లేదో అనేది మీమాంసగానే మిగిలింది. విచారణ పొడిగింపులో సాగదీత ధోరణి ప్రభుత్వం కావాలనే చేస్తోందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. పుష్కర ఘాట్ వద్దకు వి ఐపి ట్రాఫిక్‌ ను ఎవరు అనుమతించారు, బారికేడింగ్ - ఘాట్ ఇన్‌ ఛార్జిగా వివిధ విభాగాల అధికారులు తదితర వివరాలను అధికార యంత్రాంగం సమర్పించాల్సి వుంది. ఈ సమాచారాన్ని - సాక్ష్యాలను ఎంత కాలంలో సమర్పిస్తారో అనేది చూస్తుంటే కావాలనే ప్రభుత్వం తాత్సారం చేస్తున్నట్టుగా వుందని, ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు. ప్రతీ గడువు పెంపు జీవోలకు మధ్యలో దాదాపు నెల రోజుల పాటు కాలం వృథా అవుతోందని, కావాలనే ఇదంతా చేస్తున్నట్టుగా వుందని బాధితుల తరపున న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/