Begin typing your search above and press return to search.

రోజా ఇష్యూలో ఏపీ సర్కారు వెనక్కి తగ్గిందా?

By:  Tupaki Desk   |   22 March 2016 4:27 AM GMT
రోజా ఇష్యూలో ఏపీ సర్కారు వెనక్కి తగ్గిందా?
X
రోజా సస్పెన్షన్ ఇష్యూలో ఏపీ సర్కారు ఆచితూచి అడుగులేసింది. న్యాయవ్యవస్థతో లేనిపోని వివాదాలు తెచ్చి పెట్టుకోవటం తమకేమాత్రం ఇష్టం లేదన్న సంకేతాలు పంపుతూనే.. రోజా ఇష్యూలో వెనక్కి తగ్గేది లేదన్న విషయాన్ని స్పష్టం చేసింది. రోజా సస్పెన్షన్ ఇష్యూలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్న బాబు సర్కారు.. ఆ అపవాదును తొలగించుకునేలా తాజాగా పావులు కదిపింది. తన మీద వేలెత్తి చూపించే అవకాశం లేకుండా చేసుకుంది. రోజా వ్యవహారంలో ఏపీ సర్కారు మొండిగా వ్యవహరిస్తుందన్న విమర్శలకు చెక్ చెప్పేలా తాజా పరిణామాలు ఉండటం గమనార్హం. వ్యూహాత్మకంగా వేసిన అడుగులు చూస్తే.. రోజా ఇష్యూలో ఏపీ సర్కారు తాజా వ్యూహం ఏమిటన్న సంగతి చూస్తే..

రోజాపై విధించిన సస్పెన్షన్ వేటును సింగిల్ బెంచ్ జడ్జి తీర్పును అమలు చేయలేదన్న అపవాదు తమ మీద పడకుండా ఉండేందుకు సరికొత్త ఎత్తుగడను అనుసరించింది. ఒక్క నిర్ణయంతో అన్ని ఇష్యూలకు చెక్ చెప్పేలా చేసిన బాబు సర్కారు వ్యవహరించింది. రూల్ 340(2) కింద రోజాను ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేయటం.. ఆ నిబంధన ప్రకారం అలా నిర్ణయం తీసుకునే వీల్లేదంటూ విపక్ష ఎమ్మెల్యే ఆర్కే రోజా వాదించటం తెలిసిందే. ఈ వాదనకు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం తెలిసిందే. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ కు అప్పీలు చేసుకున్న ప్రభుత్వం.. తన తాజా వాదన సందర్భంగా.. రోజా క్షమాపణలు చెబితే.. చర్యలు ఉండవన్న సంకేతాల్ని అటు కోర్టుకు.. ఇటు సభలోనూ పంపటం గమనార్హం.

రోజాపై సస్పెన్షన్ వేటుతో పాటు.. సభాహక్కుల కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉండటంతో.. ఈ వ్యవహారంలో లేనిపోని తలనొప్పులు తెచ్చుకునేందుకు సిద్దంగా లేని ఏపీ సర్కారు.. రోజా చేత క్షమాపణలు చెప్పిస్తే చాలన్నట్లుగా తాజా వ్యూహాన్ని సిద్దం చేసింది. ఇందుకు తగ్గట్లే కోర్టులో తన వాదనను వినిపించింది.

రోజా ఇష్యూలో తమ వాదనకు తగ్గట్లే.. ఇప్పటికే తాము చేతల్లో చూపించామన్న భావన కలిగేలా వ్యవహరించింది. తమ ప్రవర్తనకు క్షమాపణ చెప్పిన ఇతర వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో హక్కుల కమిటీ ఉదారంగా వ్యవహరించటమే దీనికి నిదర్శనం. మిగిలిన విపక్ష నేతల తరహాలోనే రోజాకు అలాంటి అవకాశమే ఇవ్వాలన్నది తమ భావన అన్న విషయాన్ని ఏపీ సర్కారు చెప్పటం స్పష్టంగా కనిపిస్తోంది. చేసిన తప్పునకు రోజా కానీ సారీ చెబితే సమస్య పరిష్కారమైనట్లేనని అధికారపక్ష సభ్యులు చెబుతున్నారు.

సస్పెన్షన్ అంశంపై హైకోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉన్నా.. సభాహక్కుల ఉల్లంఘన ఇష్యూలో కమిటీ తీసుకునే చర్యలకు ఏ కోర్టులు జోక్యం చేసుకునే వీలు లేదు. అలా అని మొండిగా ఉండకుండా.. రోజా మీద తాము కక్ష కట్టినట్లుగా కనిపించకూడదన్న భావన కలిగేలా ఏపీ సర్కారు తాజా వాదన ఉండటం గమనార్హం. ఇందుకు తగ్గట్లే సోమవారం హైకోర్టులో తమ వాదనలు వినిపించటం కనిపిస్తుంది.

తాము ఉదారంగా ఉన్నామని.. వ్యక్తిగత ద్వేషాలకు తాము దూరమన్న భావన కలిగించేలా వ్యవహరించటం కనిపిస్తుంది. అలా అని తాము పూర్తిగా తగ్గలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. రోజా సారీ చెబితే చాలన్నట్లుగా ఏపీ సర్కారు భావిస్తోంది. మొత్తంగా చూస్తే.. రోజా ఇష్యూలో గత కొద్ది రోజులుగా డ్యామేజ్ జరుగుతుందన్న వాదనకు బాబు సర్కారు విలువ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. కొన్నిసార్లు వెనకడుగు మంచిదే.