Begin typing your search above and press return to search.

విజయవాడ పేరు మారుతోందా?

By:  Tupaki Desk   |   20 Aug 2016 5:33 AM GMT
విజయవాడ పేరు మారుతోందా?
X
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని ప్రధాన నగరం విజయవాడ పేరు మారనున్నట్లు సమాచారం. శనివారం జరగనున్న ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గోదావరి పుష్కరాల తరువాత రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పేరు మార్చుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో పుష్కరాలు కొనసాగుతున్న సమయంలోనే జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి పేరు మార్పును రాష్ట్ర ప్రజలు ఆమోదించారు. ఇప్పుడు విజయవాడ పేరు కూడా మార్చబోతున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా వినిపిస్తోంది.

తాజాగా విజయవాడ పేరును బెజవాడగా మార్చాలని పలువురు ప్రతిపాదిస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. అందువల్ల ఈ అంశంపై ఈ రోజు కేబినెట్‌ లో చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. విజయవాడ అనేది రాతకోతల్లో రాసే పేరయినా ఇప్పటికీ దాన్ని బెజవాడగానే వ్యవహరిస్తారు. ఏపీలోని చాలాప్రాంతాల ప్రజలు విజయవాడను బెజవాడ అనే పిలుచుకుంటారు. అయితే.. ఇటీవల కాలంలో విజయవాడ అనే పేరే ఎక్కువగా వాడకంలోకి వస్తోంది. ఇకపై పేరు మారిస్తే వ్యవహారికంతో పాటు అధికారికంగానూ బెజవాడ అన్న పేరే స్థిరపడనుంది.

కాగా కేబినెట్ భేటీలో టూరిజం ప్రాజెక్ట్‌ లపై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. విజయవాడ - విశాఖపట్నం - తిరుపతి తదితర ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్ట్‌ లు ఏర్పాటు చేయడానికి వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. కృష్ణా పుష్కరాల సందర్భంగా వివిధ విజయవాడ - చుట్టుపక్కల ప్రదేశాల్లో భారీ టూరిజం ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసే అవకాశాలను ప్రభుత్వం గుర్తించింది. అందువలన ఈ అంశాన్ని కేబినెట్‌ లో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి ఉద్యోగుల తరలింపు, సెక్రటేరియట్ పూర్తి స్థాయిలో పనిచేసేందుకు తీసుకోవలసిన చర్చల గురించి చర్చించే అవకాశం ఉంది. కాగా విజయవాడ పేరు మార్పుపైనా ఇందులో నిర్ణయం తీసుకుంటే కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు ప్రాంతాల పేర్లు మార్చినట్లువుతుంది. దీనికి కొనసాగింపుగా విశాఖపట్నం పేరు కూడా భవిష్యత్తులో మార్చే అవకాశాలున్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి.