Begin typing your search above and press return to search.

క్లియరా : ''లాఠీలకు పనిచెప్పొద్దు''!

By:  Tupaki Desk   |   26 July 2017 4:29 AM GMT
క్లియరా : లాఠీలకు పనిచెప్పొద్దు!
X
వందల మంది పోలీసు బలగాలు ఆయుధాలు ధరించి.. చిన్న చిన్న పల్లెటూళ్లలో కవాతు చేస్తూ ప్రజలను భయపెట్టేయండి. ఇంట్లోంచి బయటకు కదిలితే ఏమౌతుందో ఏమో అనే భయవిహ్వల వాతావరణాన్ని అక్కడ నింపేయండి. పాదయాత్ర సంగతి తర్వాత.. అసలు తమ దైనందిన కార్యక్రమాల నిమిత్తం బయటకు రావాలంటే కూడా జనం రెండోసారి ఆలోచించేలా మీరు అక్కడ ప్రవర్తించాలి. అంతే... జనం మదిలో భయాన్ని నాటడమే మన పని.... ఎక్కడైనా చిన్నచిన్న అల్లర్లు జరుగుతూ, నిరసనలు జరుగుతూ కనిపిస్తే చెదరగొట్టండి. అంతేతప్ప కనీసం లాఠీచార్జీ కూడా చేయవద్దు.’’ ఇదీ పోలీసులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంకేతం.

ఇవాళ ముద్రగడ పద్మనాభం పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే తూర్పగోదావరి జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మంది పోలీసుల్ని మోహరించింది. అయితే వారికి అందుతున్న అనధికారిక ఆదేశాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. పాదయాత్ర సాగడానికి వీల్లేదు. చిన్న అల్లర్లు జరిగినా పర్లేదు. కానీ ఆందోళన కారులే రెచ్చిపోవాలి తప్ప... పోలీసులు రెచ్చిపోకూడదు... ఇదీ సారాంశం.

దీని వెనుక ఒక చాలా పెద్ద వ్యూహం ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. ముద్రగడ ఎప్పుడు ఏ ప్రజా ఉద్యమ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా సరే.. అది హింసాత్మక రూపంలోకి పరిణమిస్తున్నదని ముద్ర వేయాలని ప్రభుత్వం తపన పడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక హింసను ప్రేరేపించే ఒక సంఘవ్యతిరేక శక్తిగా ఆయనకు తాటాకులు కట్టేయడానికి పోలీసు వర్గాలు తపన పడుతున్నాయి. అందుకే చిన్న అల్లర్లు జరిగినా.. పోలీసులు మాత్రం లాఠీ చార్జి కూడా చేయకుండా వాటిని శృతిమించకుండా చూసుకోవాలనేది సూచన. ఎందుకంటే.. సామాన్య ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లనూ కాపుల మీద సానుభూతి ఏర్పడడానికి వీల్లేదు. అయితే గియితే ప్రభుత్వం, పోలీసుల మీదనే సానుభూతి ఏర్పడాలి. .

ఇలాంటి వక్రనీతులతో చంద్రబాబునాయుడు ప్రభుత్వం చెలరేగుతోంది. కాపులకు తాము ఇచ్చింది నెరవేర్చడంలో మాత్రం నిర్ణయాత్మకంగా ఉండలేకపోతున్న సర్కారు, ముద్రగడ పాదయాత్రను అణిచివేయడానికి నానా కొత్త ఎత్తులు వేస్తుండడం విశేషం. తూర్పుగోదావరి జిల్లాలోని పల్లెలన్నీ యుద్ధమేదో జరుగుతున్న వాతావరణంతో బెంబేలెత్తుతున్నాయి. మరి ఇంతకూ ప్రభుత్వం ఇన్ని ఎత్తుల ద్వారా ఏం సాధించదలచుకుంటున్నదో మాత్రం బోధపడ్డం లేదు.