Begin typing your search above and press return to search.

బాబు దూకుడు ఆప‌ట్లే!!

By:  Tupaki Desk   |   25 Nov 2016 9:30 AM GMT
బాబు దూకుడు ఆప‌ట్లే!!
X
'సన్‌ రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌' పేర గత ఏడాది జనవరి 10 నుంచి 12 వరకు నిర్వహించిన ఇన్వెస్టర్ల సదస్సు హ‌డావుడి గుర్తుండే ఉంటుంది. ఆంధ్ర‌ప్రదేశ్‌ ప్రభుత్వం - భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యాన విశాఖ నగరంలో నిర్వ‌హించిన ఈ స‌ద‌స్సుకు ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున్నే ప్ర‌చారం చేసింది. ఈ సద‌స్సు ద్వారా బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు 26 పరిశ్రమలు ఏర్పాటుకు ఎంఒయులు కుదుర్చుకున్నార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కాగా ఇటీవ‌ల మొద‌టి స‌ద‌స్సు ఊపులో రెండో ద‌ఫా సీఐఐ ఇన్వెస్టెర్ల సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపింది. 2017 జనవరి 27 - 28 తేదీల్లో విశాఖలో జరపనున్నట్టు ప్రకటించింది. అయితే మొద‌టి ద‌శ‌లో క‌నీసం పాతిక శాతం ఒప్పందాలు కూడా ఫ‌లితం ఇవ్వ‌న‌పుడు రెండో స‌దస్సు నిర్వ‌హించ‌డానికి ఉవ్విళ్లూర‌డం ఎందుక‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖవ‌ర్గాల‌ అధికారిక స‌మాచారం ప్ర‌కారం 2016 సీఐఐ సదస్సులో మొత్తం 26 అవ‌గాహ‌న ఒప్పందాల్లో కేవ‌లం ఐదు ప్రాజెక్టులు మాత్రమే ఆచరణరూపం దాల్చే దిశగా ఫైళ్లు కదులుతున్నాయి. ఆ స‌ద‌స్సు ద్వారా నిర్దేశించుకున్న రూ.5 లక్షల కోట్ల విలువైన ఎంఒయుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదం లభించినవి రూ.60 వేల కోట్ల లోపేనని అధికారులు చెబుతున్నారు. అందులో కూడా 60 శాతం వరకూ భూ కేటాయింపు జరగలేదని తెలుస్తోంది. ప్రారంభించిన సంస్థ‌లు సైతం చిత్తూరు జిల్లాలో అదికూడా శ్రీ సిటీలో ఎంఒయులు అమలైనట్లు సమాచారం. రాష్ట్రం మొత్తం మీద ప్రాజెక్టులేవీ ఆచరణలోకి రాలేదు. ఇక త్వ‌ర‌లో ప‌నులు మొద‌లు పెట్ట‌నున్న వాటిలో రిలయన్స్‌కు చెందిన భారీ ప్రాజెక్టు ఉంది. రూ.5 వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన 'షిప్‌ బిల్డింగ్‌'కు రాంబిల్లిలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రిలయన్స్‌ కంపెనీ 2 వేల ఎకరాలు కావాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం - ఏపీఐఐసీ వెయ్యి ఎకరాలు కేటాయించింది. రాష్ట్ర ఇన్వెస్ట్‌ మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు దీనికి సంబంధించిన అంగీకారాన్ని తెలిపింది. రాంబిల్లి ప్రాంతంలో ఎకరా రూ.20 లక్షలు మార్కెట్‌ విలువ ఉండగా రూ.17.50 లక్షలకు రిలయన్స్‌ కు ఇవ్వనున్నారని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

మ‌రోవైపు సీఐఐ స‌ద‌స్సు సంద‌ర్భంగా మాన్యుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమలు ఏర్పాటుకు ఐదు ఎంఒయులు కుదరగా, ఒక్కటి కూడా త‌మ ఉత్ప‌త్తిని ప్రారంభింలేదు. సీఐఐ స‌ద‌స్సులో ఎంఓయూలు కుదుర్చుకున్న వాటిల్లో అనేక సంస్థ‌ల‌కు సాక్షాత్తు ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు ద‌క్క‌లేద‌ని స‌మాచారం. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం దుస్తుల పరిశ్రమకు ఆమోదం లేదు. అత్యధిక మంది యువతకు ఉపాధి కలిగించే కీలకమైన, మధ్యతరహా పరిశ్రమలకు ఆమోదం లభించలేదు. గ‌త స‌ద‌స్సు తాలుకూ విజ‌యం ఇంత అత్య‌ల్ప స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ రెండో స‌ద‌స్సుకు శ‌ర‌వేగంగా సిద్ధ‌మ‌వ‌డం కేవ‌లం ప్ర‌భుత్వం త‌న ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌చారం చేసుకునేందుకేన‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. సీఐఐ స‌ద‌స్సును ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌డం లేద‌ని అయితే గ‌త ఎంఓయూలే ఆచ‌ర‌ణ రూపం దాల్చ‌న‌పుడు మ‌రో స‌ద‌స్సు పేరుతో నిధులు దుర్వినియోగం ఎందుక‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/